హైదరాబాద్ మెట్రో సుందరీకరణకు ఆరు లక్షల మొక్కలను కడియం నుంచి తీసుకువెళుతున్నట్టు ప్రాజెక్ట్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.
రాజమండ్రి క్రైం: ప్రపంచంలోనే మొదటి సారిగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో కడుతున్న ఏకైక మెట్రో రైల్ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో సుందరీకరణకు ఆరు లక్షల మొక్కలను తూర్పు గోదావరి జిల్లా కడియం నుంచి తీసుకువెళుతున్నట్టు ప్రాజెక్ట్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. సోమవారం ఇక్కడి షెల్టన్ హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
హైదరాబద్‌లో 72 కిలో మీటర్ల మేర మెట్రో పనులు 2017 జూన్‌నాటికి పూర్తవుతాయని ఆయన వివరించారు. మొత్తం రూ. 14,132 కోట్లతో మెట్రో పనులు చేపడుతున్నామని, ఇప్పటి వరకు 55 శాతం పనులు పూర్తయ్యాయని ఎండీ తెలిపారు. మెట్రో సుందరీకరణలో భాగంగా ఈ ఏడాది లక్ష సాధారణ మొక్కలు, 5 లక్షల పూల మొక్కలు నాటుతామన్నారు. మెట్రో రైల్వే నిర్వహణకు ప్రపంచంలోనే అత్యాధునికమైన కమ్యూనికేషన్ బేస్‌డ్ టెక్నాలజీ సిస్టం(సీబీటీఎస్)ను వినియోగిస్తున్నట్లు ఎండీ వివరించారు.