మహిళా అధ్యాపకులపై ప్రిన్సిపల్‌ వేధింపులు

Junior College Principal Harassment On Women Teachers In East College - Sakshi

ప్రిన్సిపాల్‌... కళాశాలలో విద్యార్థుల నుంచి అధ్యాపకులకు, సిబ్బందికి దిశా,నిర్దేశం చేస్తూ క్రమశిక్షణతో, ఏకతాటిపై ముందుకు తీసుకువెళ్లాల్సిన వ్యక్తి. ఇందులో ఏ ఒక్కరు తప్పు చేసినా మందలించి, అవసరమైతే చర్యలు తీసుకొని కళాశాలను అభివృద్ధి పథంలో నడిపించాలి. మంచి ఉత్తీర్ణతా ఫలితాలతో వందలాది మంది విద్యార్థులను తన కళాశాల వైపు అడుగులు వేయించి ఇతర కళాశాలలకు ఆదర్శంగా నిలపాలి. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన ఆయన ‘పచ్చ’ రంగు పులుముకొని...ఆ అండతో మహిళలపై వేధింపులకు దిగితే...అదే రాజమహేంద్రవంలోని ఓ ప్రభుత్వ  కళాశాలలో జరిగింది ...

సాక్షి, తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌కు సమీపాన ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాలే కీచకుడుగా మారి మహిళా అధ్యాపకులపై గత రెండున్నరేళ్లుగా వేధింపులకు దిగుతున్న ఘటన ఇది. వందల మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఈ కళాశాలలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది 60 మంది పని చేస్తున్నారు. రెండువేల మంది పైచిలుకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇలాంటి పవిత్రమైన విద్యాలయంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రిన్సిపాల్‌ నీచ చర్యలకు దిగడమేమిటని మహిళా సంఘాల ప్రతినిధులు విద్యావేత్తలు మండిపడుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనేందుకు ఇదో ఉదాహరణ. ఎదురైన అవమానాలపై మహిళా అధ్యాపకులు రెండున్నరేళ్లుగా పోరాడినా న్యాయం దక్కకపోగా అప్పటి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అండదండలు ప్రిన్సిపాల్‌కు తోడవడంతో ఇంటర్మీడియట్‌ బోర్డు ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్టు వ్యవహరించారు.

మొదట రాజమహేంద్రవరం పోలీసులకు, రెండోసారి ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు..ఇలా ఫిర్యాదులపై ఫిర్యాదులు చేసినా న్యాయం దక్కకపోగా తిరిగి రివర్స్‌లో ఫిర్యాదు చేసిన 17 మందిపై వేధింపులు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం కుప్పకూలి వైఎస్సార్‌సీపీ సర్కారు రావడంతో బాధితుల్లో ఆత్మస్థైర్యం పెరిగి నేరుగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత, విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌లకు బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బహిర్గతమైంది. వివరాలు ఇలా ఉన్నాయి...రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కొత్తపల్లి వీర్రాజు. 14 ఏళ్లుగా ఇక్కడ అధ్యాపకునిగా పనిచేస్తున్న ఈయన మధ్యలో రెండేళ్లు కొత్తపేట జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా వెళ్లారు. ఆ తరువాత తిరిగి 2016లో ఇక్కడికే ప్రిన్సిపాల్‌గా వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ టీడీపీకి వీరాభిమానిగా సహాయ, సహకారాలు అందిస్తూ వచ్చాడు.

దీంతో ఇంటర్మీడియట్‌ బోర్డులో కూడా ఇతని హవానే కొనసాగింది. తన కార్యకలాపాలకు అడ్డుపడే మహిళా అధ్యాపకులను తన ఆఫీసు రూమ్‌కి పిలిపించి ఏకవచనంతో, వెకిలి చేష్టలతో అవమానించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తరగతి గదిలో, విద్యార్థుల ఎదుటే ఏకవచనంతో అవమానిస్తుండడంతో గత ఫిబ్రవరిలో జనరల్‌ ఫౌండేషన్‌ కోర్సుకు కాంట్రాక్ట్‌ లెక్చరర్‌గా పనిచేసే ఉదయశాంతి రాజమహేంద్రవరం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలేజీలో పనిచేస్తున్న వారిలో సుమారు 40 మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఆమెకు అండగా నిలిచారు. అధికార పార్టీ అండదండలు, ఎమ్మెల్యేకు సానుభూతిపరుడిగా ఉండటంతో పోలీసులు ఆ కేసును నీరుగార్చేశారు. ఆ తరువాత గత మార్చి 3న అమరావతి వెళ్లి ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌ ఉదయలక్ష్మిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

అయినా ప్రిన్సిపాల్‌పై చర్యలు లేకపోగా, తిరిగి కాలేజీకి వచ్చాక ప్రిన్సిపాల్‌ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని మహిళా అధ్యాపకులు కన్నీరుపెట్టుకున్నారు. ఇలాంటి వ్యక్తిపై చర్యలు లేకపోగా ఇంటర్‌బోర్డుకు పిలిపించి ప్రిన్సిపాల్‌కు జోన్‌–3, జోన్‌–4లకు ఇన్‌చార్జి హోదా ఇవ్వడం విశేషం. ఈ పరిణామంతో ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగదనే అభిప్రాయానికి వచ్చిన మహిళా అధ్యాపకులు మరోసారి ఫిర్యాదు చేయడానికి ధైర్యం కూడా చేయలేకపోయారు. కనీసం ఇంటర్‌బోర్డు కమిషనర్‌ ఉదయలక్ష్మి మహిళ అయి ఉండి కూడా సహచర మహిళా అధ్యాపకులకు భరోసా నివ్వకపోవడమేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.  

కళాశాలలో కొరవడిన ప్రశాంతత..
ప్రభుత్వ  జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది మధ్య తరుచూ కీచులాట, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు, కమిషనర్‌కు ఫిర్యాదులతో కళాశాలలో ప్రశాంత వాతావరణం కొరవడిందనే చెప్పవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ వీర్రాజును ‘సాక్షి’ వివరణ కోరగా కాలేజీలో అటువంటి వాతావరణం ఏమీ లేదన్నారు. సక్రమంగా పనిచేయమన్నందుకే పనిగట్టుకుని కొందరు కేసులు పెడుతున్నారని చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top