తిరుగు ప్రయాణం కొండంత భారం | Journey to the back is a huge burden | Sakshi
Sakshi News home page

తిరుగు ప్రయాణం కొండంత భారం

Jan 17 2019 3:08 AM | Updated on Jan 17 2019 8:32 AM

Journey to the back is a huge burden - Sakshi

సంక్రాంతి కోసం స్వస్థలాలకు వచ్చినవారి తిరుగు ప్రయాణం కొండంత భారం కానుంది.

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: సంక్రాంతి కోసం స్వస్థలాలకు వచ్చినవారి తిరుగు ప్రయాణం కొండంత భారం కానుంది. నేటి నుంచి ఈ నెల 20 వరకు ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు. డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్, ఆర్టీసీ పోటాపోటీ పడుతున్నాయి. సాధారణ రోజుల్లో టిక్కెట్ల ధరల కంటే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులు మూడు, నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తుండగా.. ఆర్టీసీ కూడా వ్యాపార ధోరణి ప్రదర్శిస్తోంది. రెగ్యులర్‌ బస్సులతో పాటు మూడు వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రిజర్వేషన్లకు ఫ్లెక్సీ ఫేర్‌ విధానం(విమాన చార్జీల్లాగా పరిస్థితిని బట్టి రేట్లు అమలు చేయడం) ప్రవేశపెట్టింది. రెగ్యులర్‌ చార్జీల కంటే 150 శాతం అధికంగా వసూలు చేస్తోంది.  

సిటీ మెట్రో కూడా ప్రత్యేక బస్సే..! 
సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు హైదరాబాద్‌ నుంచి ఏపీలోని అన్ని జిల్లాలకు 20 లక్షల మంది వచ్చారని అంచనా. వీరి తిరుగు ప్రయాణం కోసం అన్ని జిల్లాల నుంచి 1,100 ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ బస్సుల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రతిరోజూ హైదరాబాద్‌కు అన్ని జిల్లాల నుంచి 150 వరకు సర్వీసులు నడుపుతున్నారు. వీటితో పాటు గురువారం నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌కు 1,100 బస్సులు తిప్పుతున్నట్లు ప్రకటించారు. ఫ్లెక్సీ ఫేర్‌ అమలు చేయడం ద్వారా ప్రయాణికులను బాదేస్తున్న ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల పేరిట సిటీల్లో తిరిగే మెట్రో, సాధారణ బస్సుల్ని అందుబాటులో ఉంచింది. దీంతో ప్రయాణికులు గంటలకొద్దీ ఆ సీట్లలో నానా ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వేషన్‌ సమయంలో ఏ బస్సు నడుపుతున్నారో కూడా సమాచారమివ్వకుండా వ్యాపార ధోరణి అవలంభిస్తోందంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. మరోవైపు రెగ్యులర్‌ సర్వీసులు కూడా సరైన సమయంలో తిప్పకుండా ప్రత్యేక బస్సుల్నే ఆర్టీసీ నడపడం గమనార్హం.

విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే బస్సు 3571 అమరావతి సర్వీస్‌ మధ్యాహ్నం 1.30కు బయల్దేరాల్సి ఉండగా.. ప్రత్యేక బస్సుకు ప్లాట్‌ఫాం కేటాయించి, ఈ బస్సును గంట పాటు పక్కన పెట్టారు. ఇక సంక్రాంతి హడావుడి ఎక్కువగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలోని 8 డిపోల నుంచి రోజూ 28 బస్సులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. పండుగ నేపథ్యంలో మరో 57 ప్రత్యేక సర్వీసుల్ని ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే బుధవారం వీటిలో చాలా వరకు సీట్లు మిగిలిపోయాయని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ సుధాకర్‌ పేర్కొన్నారు. ఇక రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి ప్రధాన నగరాలకు అదనంగా 50 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేకం పేరిట సిటీ మెట్రో బస్సులు పెట్టడంపై పలువురు ప్రయాణికులు మండిపడ్డారు. ప్రైవేటు ట్రావెల్స్‌ బాదుడు ఎక్కువ ఉండటంతో తప్పనిసరి పరిస్థితిలో వీటిలోనే వెళ్లాల్సి వస్తోందని వాపోయారు.  

మా కష్టాలు పట్టవా?  
కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో సంక్రాంతి జరుపుకుందామని వస్తే.. ఇలా బాదేస్తున్నారని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వానికి మా కష్టాలు పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీకి ప్రభుత్వం తగిన చేయూతనిస్తే.. తమకు ఈ బాధలుండేవి కాదన్నాడు. 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేయకుండా.. అదనపు బస్సులు మరిన్ని ఏర్పాటు చేస్తే తమకు వెతలుండేవి కాదని మరో ప్రయాణికుడు వాపోయాడు. పోలవరం సందర్శన, సీఎం సభలకైతే ఇష్టారీతిన బస్సులు పెడతారని.. సామాన్యులను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.  

ప్రభుత్వం ఆదేశాలిచ్చినా టోల్‌ ట్యాక్స్‌ వసూలు.. 
పండుగ సందర్భంగా 3 రోజుల పాటు వాహనదారుల నుంచి టోల్‌ ట్యాక్స్‌ వసూలు చేయబోమని ప్రభుత్వమిచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదు. కృష్ణా జిల్లా కీసర టోల్‌ ప్లాజా సిబ్బంది ఎప్పటిలానే టోల్‌ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. దీనిపై వాహనదారులు మండిపడుతున్నారు. తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజాల వద్ద ట్యాక్స్‌ వసూలు చేయడం లేదని.. రాష్ట్రంలో మాత్రం ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. కాగా, ఈ విషయంపై ప్లాజా సీవోఎం హరిపాండు రంగస్వామిని వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఉత్తర్వులు పాటిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement