breaking news
return journey
-
రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం
అహ్మదాబాద్: ఆగి ఉన్న వాహనాన్ని మినీ ట్రక్కు ఢీకొన్న ఘటనలో 10 మంది చనిపోగా మరో 13 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘోర ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖేడా జిల్లా కపడ్వంజ్ తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 23 మంది సురేంద్రనగర్ జిల్లా చోటిలాలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారి వాహనం శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో బగోదర సమీపంలో రాజ్‌కోట్–అహ్మదాబాద్ హైవేపై రోడ్డు పక్క ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 13 మంది గాయపడినట్లు ఎస్పీ అమిత్ వాసవ తెలిపారు. ఘోర ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు. -
తిరుగు ప్రయాణం కొండంత భారం
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: సంక్రాంతి కోసం స్వస్థలాలకు వచ్చినవారి తిరుగు ప్రయాణం కొండంత భారం కానుంది. నేటి నుంచి ఈ నెల 20 వరకు ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు. డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్, ఆర్టీసీ పోటాపోటీ పడుతున్నాయి. సాధారణ రోజుల్లో టిక్కెట్ల ధరల కంటే ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు మూడు, నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తుండగా.. ఆర్టీసీ కూడా వ్యాపార ధోరణి ప్రదర్శిస్తోంది. రెగ్యులర్ బస్సులతో పాటు మూడు వేలకు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రిజర్వేషన్లకు ఫ్లెక్సీ ఫేర్ విధానం(విమాన చార్జీల్లాగా పరిస్థితిని బట్టి రేట్లు అమలు చేయడం) ప్రవేశపెట్టింది. రెగ్యులర్ చార్జీల కంటే 150 శాతం అధికంగా వసూలు చేస్తోంది. సిటీ మెట్రో కూడా ప్రత్యేక బస్సే..! సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీలోని అన్ని జిల్లాలకు 20 లక్షల మంది వచ్చారని అంచనా. వీరి తిరుగు ప్రయాణం కోసం అన్ని జిల్లాల నుంచి 1,100 ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ బస్సుల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రతిరోజూ హైదరాబాద్‌కు అన్ని జిల్లాల నుంచి 150 వరకు సర్వీసులు నడుపుతున్నారు. వీటితో పాటు గురువారం నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌కు 1,100 బస్సులు తిప్పుతున్నట్లు ప్రకటించారు. ఫ్లెక్సీ ఫేర్ అమలు చేయడం ద్వారా ప్రయాణికులను బాదేస్తున్న ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల పేరిట సిటీల్లో తిరిగే మెట్రో, సాధారణ బస్సుల్ని అందుబాటులో ఉంచింది. దీంతో ప్రయాణికులు గంటలకొద్దీ ఆ సీట్లలో నానా ఇబ్బందులు పడుతున్నారు. రిజర్వేషన్ సమయంలో ఏ బస్సు నడుపుతున్నారో కూడా సమాచారమివ్వకుండా వ్యాపార ధోరణి అవలంభిస్తోందంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. మరోవైపు రెగ్యులర్ సర్వీసులు కూడా సరైన సమయంలో తిప్పకుండా ప్రత్యేక బస్సుల్నే ఆర్టీసీ నడపడం గమనార్హం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు 3571 అమరావతి సర్వీస్ మధ్యాహ్నం 1.30కు బయల్దేరాల్సి ఉండగా.. ప్రత్యేక బస్సుకు ప్లాట్‌ఫాం కేటాయించి, ఈ బస్సును గంట పాటు పక్కన పెట్టారు. ఇక సంక్రాంతి హడావుడి ఎక్కువగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాలోని 8 డిపోల నుంచి రోజూ 28 బస్సులు హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. పండుగ నేపథ్యంలో మరో 57 ప్రత్యేక సర్వీసుల్ని ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే బుధవారం వీటిలో చాలా వరకు సీట్లు మిగిలిపోయాయని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధాకర్ పేర్కొన్నారు. ఇక రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి ప్రధాన నగరాలకు అదనంగా 50 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేకం పేరిట సిటీ మెట్రో బస్సులు పెట్టడంపై పలువురు ప్రయాణికులు మండిపడ్డారు. ప్రైవేటు ట్రావెల్స్ బాదుడు ఎక్కువ ఉండటంతో తప్పనిసరి పరిస్థితిలో వీటిలోనే వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. మా కష్టాలు పట్టవా? కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో సంక్రాంతి జరుపుకుందామని వస్తే.. ఇలా బాదేస్తున్నారని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వానికి మా కష్టాలు పట్టవా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీకి ప్రభుత్వం తగిన చేయూతనిస్తే.. తమకు ఈ బాధలుండేవి కాదన్నాడు. 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేయకుండా.. అదనపు బస్సులు మరిన్ని ఏర్పాటు చేస్తే తమకు వెతలుండేవి కాదని మరో ప్రయాణికుడు వాపోయాడు. పోలవరం సందర్శన, సీఎం సభలకైతే ఇష్టారీతిన బస్సులు పెడతారని.. సామాన్యులను పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదేశాలిచ్చినా టోల్ ట్యాక్స్ వసూలు.. పండుగ సందర్భంగా 3 రోజుల పాటు వాహనదారుల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయబోమని ప్రభుత్వమిచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదు. కృష్ణా జిల్లా కీసర టోల్ ప్లాజా సిబ్బంది ఎప్పటిలానే టోల్‌ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. దీనిపై వాహనదారులు మండిపడుతున్నారు. తెలంగాణలోని పంతంగి, కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద ట్యాక్స్ వసూలు చేయడం లేదని.. రాష్ట్రంలో మాత్రం ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. కాగా, ఈ విషయంపై ప్లాజా సీవోఎం హరిపాండు రంగస్వామిని వివరణ కోరగా.. తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు పాటిస్తున్నామన్నారు. -
మధ్యలోనే వెనక్కి వెళ్లిన విమానం
నార్వే : టాయిలెట్లలో సమస్య ఏర్పడి దాదాపు సగం దూరం వెళ్లిన విమానాన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చి దింపేశారు. ఆ విమాన ప్రయాణీకుల్లో టాయిలెట్స్‌లో సమస్య ఏర్పడితే పరిష్కరించే ప్లంబర్స్ 60మందికి పైగా ఉన్నప్పటికీ వారు ముందుకు రాకపోవడంతో దాదాపు రెండున్నరగంటలపాటు రివర్స్ జర్నీ చేసి సమస్య పరిష్కరించుకోవాల్సి వచ్చింది. నార్వే ఎయిర్ విమానంలో ఈ సమస్య తలెత్తింది. వివరాల్లోకి వెళితే.. నార్వేలోని ఓస్లో నుంచి డీవై 1156 అనే విమానం జర్మనీలోని మ్యూనిచ్కు బయలుదేరింది. అది సరిగ్గా స్వీడన్ బోర్డర్ దాటే సమయంలోనే టాయిలెట్లలో సమస్య ఉన్నట్లు తెలిసింది. అయితే, అదే విమానంలోమ మొత్తం 186మంది ప్రయాణీకులు ఉండగా కనీసం 60 నుంచి 70మంది ప్లంబర్లు ఉన్నారు. వారంతా రార్క్జాప్ అనే కంపెనీలో పనిచేసేందుకు మ్యూనిచ్కు వెళుతున్నారు. పైగా వారందరికీ మంచి సుశిక్షితులుగా గుర్తింపు ఉంది. కానీ, వారిలో ఏ ఒక్కరు కూడా టాయిలెట్లో సమస్యను పరిష్కరించి తమను తాము నిరూపించుకోలేకపోయారు. దీనిపై వర్కర్లను తెప్పించుకున్న కంపెనీ సీఈవో ఫ్రాంక్ ఓల్సెన్ మాట్లాడుతూ సహాయం చేసేందుకు తమవాళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ అప్పటికి విమానం 10వేల అడుగుల ఎత్తులో ఎగురుతోందని, ఆ సమస్య వెలుపల నుంచి పరిష్కరించాల్సింది కావడంతో తమ వారెవరూ కూడా ఆ పనిచేయలేదని వివరణ ఇచ్చారు. మొత్తానికి దాదాపు రెండుగంటలపాటు ప్రయాణించిన విమానాన్ని తిరిగి ఓస్లోకు మళ్లించి సమస్య పరిష్కరించి మరోసారి ప్రయాణం ప్రారంభించారు. -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు
గుడిపాడు (గూడూరు రూరల్): దేవరకు హాజరై తిరుగు ప్రయాణంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. గుడిపాడు గ్రామంలో సోమవారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మునగాలకు చెందిన చాకలి మద్దిలేటి (ఆటో డ్రైవర్), సురేష్ ఇద్దరూ బంధువులు. వీరు కర్నూలులో జీవిస్తున్నారు. మూడు రోజుల క్రితం గూడూరులో బం«ధువులు చేపట్టిన దేవర కార్యక్రమానికి ఇద్దరూ కుటుంబీకులతో హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం మద్దిలేటి ఆటోలో కర్నూలుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో గూడూరు మీదుగా మంత్రాలయం వెళ్తున్న ఎమ్మిగనూరు డిపో గుడిపాడు వద్ద ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. చాకలి సురేష్ తలకు గాయమై అధిక రక్త స్రావం కావడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృత్యువాతపడ్డాడు. మద్దిలేటి కాలు, చెయ్యి విరిగి తీవ్ర గాయాలపాలు కాగా, ఏడు నెలల గర్భిణి అతని భార్య ఎల్లమ్మ తీవ్రంగా గాయపడి అపస్మాకరస్థితికి చేరుకుంది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ పవన్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదంపై స్థానికులను అడిగితెలుసుకున్నారు. మృతుడు సురేష్‌కు భార్య వెంకటేశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
తిరుగు ప్రయాణానికి ప్రత్యేక రైళ్లు
-
తిరుగు ప్రయాణానికి ప్రత్యేక రైళ్లు
- ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల రాకపోకలు - దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రయాణికులతో పాటు నగరానికి వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ గురువారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. కాకినాడ-సికింద్రాబాద్ (07076): 17న సాయంత్రం 4.45 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.50కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. విజయవాడ-సికింద్రాబాద్ (072076): శుక్రవారం(15న) రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి శనివారం ఉదయం 5.40కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాకినాడ-తిరుపతి (07431/07432): శుక్రవారం(15న) సాయంత్రం 4.45 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి శనివారం ఉదయం 7.10కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 16న సాయంత్రం 7 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. సికింద్రాబాద్-విజయవాడ (07208): 18న ఉదయం 6.30కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 1.30కు విజయవాడ చేరుకుంటుంది. తిరుపతి-కాకినాడ (07942): శుక్రవారం(15న) రాత్రి 10.40కి తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు కాకినాడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్-కాకినాడ (07011): 17న సాయంత్రం 7.15కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు 5.15కు కాకినాడ వస్తుంది. కాకినాడ-సికింద్రాబాద్ (07054): 17న సాయంత్రం 5.45కు కాకినాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు 4.30కు సికింద్రాబాద్ వస్తుంది. సికింద్రాబాద్-తిరుపతి (02764): 18న రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. కాచిగూడ-గుంటూరు డబుల్ డెక్కర్ (02122/02121): 16, 18 తేదీల్లో ఉదయం 9.55కు కాచిగూడ నుంచి బయల్దేరి అదే రోజు సాయంత్రం 5.10కి విజయవాడకు, సాయంత్రం 6.15కి గుంటూరుకు చేరుకుంటుంది. రాత్రి 11 గంటలకు గుంటూరు నుంచి బయల్దేరి రాత్రి 11.50కి విజయవాడకు, మరుసటి రోజు ఉదయం 5.25కి కాచిగూడ చేరుకుంటుంది. విశాఖ-సికింద్రాబాద్(08577/08578): 17,18 తేదీల్లో సాయంత్రం 4.45కు విశాఖపట్నం నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 18,19 తేదీల్లో సాయంత్రం 5.25కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.50కి విశాఖ చేరుకుంటుంది.


