తీగలాగితే డొంక కదిలింది! | JC Brothers irregularities into the light | Sakshi
Sakshi News home page

తీగలాగితే డొంక కదిలింది!

Feb 9 2020 4:13 AM | Updated on Feb 9 2020 4:13 AM

JC Brothers irregularities into the light - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న ట్రాన్స్‌పోర్ట్‌ జాయింట్‌ కమిషనర్‌ ఏఎస్‌బీ ప్రసాద్‌రావు

అనంతపురం సెంట్రల్‌: దివాకర్‌ ట్రావెల్స్‌ ముసుగులో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పాల్పడిన అక్రమాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ కారుచౌకగా 68 లారీలను అక్రమంగా కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నకిలీ ఎన్‌ఓసీలతో వీటికి రిజిస్ట్రేషన్‌ చేయించారు.  రవాణాశాఖ అధికారులు కూపీ లాగడంతో వీరి అక్రమాలు బట్టబయలయ్యాయి. ఈ వ్యవహారంలో అక్రమంగా వాహనాలను విక్రయించిన కంపెనీలపై రూ.100కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం కనిపిస్తోంది.

అనంతపురంలోని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో జాయింట్‌ డిప్యూటీ కమిషనర్‌ ఏఎస్‌బీ ప్రసాదరావు శనివారం మీడియాకు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లాలో అక్రమంగా వాహనాలు తిరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ఆయన చెప్పారు. 2017 మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బీఎస్‌–3 వాహనాలు రిజిస్ట్రేషన్‌ చేయరని, అలాంటిది బీఎస్‌–3 వాహనాలకు బీఎస్‌–4గా రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తేలిందన్నారు. దీనిపై కూపీ లాగగా నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ అయిన 68 వాహనాలు అనంతపురానికి ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు గుర్తించామన్నారు. ప్రత్యేక బృందం నాగాలాండ్‌కు వెళ్లి రికార్డులు ఇవ్వాలని కోరగా ఆరు వాహనాలకు సంబంధించిన రికార్డులు లభ్యమయ్యాయన్నారు. 

స్క్రాప్‌ వాహనాలు కొనుగోలు‘జేసి’..
పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా సుప్రీంకోర్టు కాలుష్యం వెదజల్లే బీఎస్‌–3 వాహనాలపై నిషేధం విధించిందని ప్రసాదరావు తెలిపారు. అయితే, అప్పటివరకూ ఉన్న వాహనాలను సదరు కంపెనీలు విక్రయించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇదే అదనుగా భావించి జేసీ బ్రదర్స్‌ 68 వాహనాలను స్క్రాప్‌గా కొనుగోలు చేశారన్నారు. కొనుగోలు చేసిన రెండు రోజుల నుంచి రెండు వారాల్లోపు మొత్తం వాహనాలు ఎన్‌ఓసీలతో జిల్లాకు వచ్చాయన్నారు. ఈ వాహనాల్లో కొన్ని తాడిపత్రికి చెందిన జేసీ ఉమారెడ్డి, వారి సమీప బంధువు సి.గోపాల్‌రెడ్డి పేర్ల మీద ఉన్నాయన్నారు. అడ్రస్‌ కూడా తాడిపత్రి పేరు మీద రిజిస్ట్రేషన్‌ అయ్యాయని ప్రసాదరావు తెలిపారు.

ఆఘమేఘాలపై బదిలీతో అనుమానం
కాగా, నాగాలాండ్‌లో కొనుగోలు చేసిన వాహనాలు రెండు రోజుల్లో ట్రాన్స్‌ఫర్‌ కావడంతో తమకు అనుమానం వచ్చిందన్నారు. సదరు అశోక్‌లేలాండ్‌ కంపెనీ నుంచి రికార్డులు స్వీకరించగా 68 వాహనాలు బీఎస్‌–3 వాహనాలేనని రికార్డుల్లో తేలిందన్నారు. ప్రస్తుతం ఆ వాహనాల రికార్డులు పరిశీలిస్తే నాలుగు వాహనాలు (ఎన్‌సీ 01ఏసీ–3680, ఎన్‌సీ01ఏసీ–3676, ఎన్‌సి01ఏసీ–3679, ఎన్‌సి01ఏసీ–1011) జేసీ ఉమారెడ్డి పేరు మీద, మరో రెండు వాహనాలు (ఎన్‌సి01ఏసీ–1087, ఎన్‌సీ01ఏసీ–1077) సి.గోపాల్‌రెడ్డి పేరు మీద ఉన్నట్లు గుర్తించామన్నారు.

క్రిమినల్‌ కేసులకు సిఫార్సు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై రవాణా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రసాదరావు తెలిపారు. సదరు వాహనాలను సీజ్‌ చేసే అధికారం రవాణా శాఖాధికారులకు ఉంటుందన్నారు. అక్రమంగా కొనుగోలు చేసిన వారికి ఒకనెల జైలుశిక్ష, 2 వేలు జరిమానా.. రోడ్డు భద్రతా, కాలుష్య నియంత్రణ చట్టం ప్రకారం 3–6 నెలల వరకూ జైలుశిక్ష, 10 వేల జరిమానా.. అక్రమంగా విక్రయించిన కంపెనీలపై దాదాపు రూ.100 కోట్ల్ల వరకు జరిమానా, ఏడాది పాటు జైలుశిక్ష విధించే అవకాశముందని చెప్పారు. కాగా, నకిలీ ఎన్‌ఓసీలతో చీటింగ్‌కు పాల్పడిన జేసీ ఉమారెడ్డి, సి.గోపాల్‌రెడ్డిలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నగరంలోని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశామని జాయింట్‌ డిప్యూటీ కమిషనర్‌ ఏఎస్‌బీ ప్రసాద్‌రావు వివరించారు. ఉపరవాణా కమిషనర్‌ శివరామప్రసాద్‌ ఫిర్యాదు మేరకు 33/2020 కింద కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement