
సాక్షి, అమరావతి: నవ నిర్మాణ దీక్ష పేరిట ఆర్భాటం చేస్తున్న సీఎం చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై నోరెందుకు విప్పడం లేదని జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు. రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఈ మేరకు శనివారం ఆయన 20 ప్రశ్నలతో ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వీటిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
ప్రపంచంలోని 50 వేల నగరాల్లో ఒకటిగా లేని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ఐదో స్థానంలోకి తెస్తానని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. కేంద్రీకృత అభివృద్ధి ధోరణి మంచిది కాదని పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. ఏపీని అవినీతిలో అగ్రస్థానంలో నిలబెట్టారని మండిపడ్డారు.