తెలంగాణ బంద్‌కు సై.. | JAC calls for 24-hour Telangana bandh against CM Kiran's 'anti-Telangana' stance | Sakshi
Sakshi News home page

తెలంగాణ బంద్‌కు సై..

Sep 7 2013 4:04 AM | Updated on Jul 29 2019 5:31 PM

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి వైఖరికి నిరసనగా తెలంగాణ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు ప్రభావం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచే కనిపించింది.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి వైఖరికి నిరసనగా తెలంగాణ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు ప్రభావం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచే కనిపించింది. బంద్ పిలుపు నేపథ్యంలో ఆర్టీసీ డిపోలు, బస్సుస్టేషన్లు, రైల్వే స్టేషన్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విజయకుమార్ ‘సాక్షి’కి వెల్లడించారు. బంద్‌ను సంపూర్ణంగా విజయవంతం చేయాలంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలు టీఎంయూ, ఈయూ పిలుపునిచ్చాయి. దీంతో తిరుపతి, బెంగళూరుకు వెళ్లే దూ ర ప్రాంత సర్వీసులను డిపోల నుంచి బయటకు తీసేందుకు సిబ్బంది నిరాకరించారు. బంద్‌ను విజయవంతం చేయాలంటూ జిల్లావ్యాప్తంగా టీజేఏసీ, టీఆర్‌ఎస్, ఇతర సంఘాలు పలుచోట్ల ర్యాలీలు నిర్వహించాయి.
 
 జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ర్యాలీ తీసేందుకు ప్రయత్నించిన టీజేఏసీ నేతలను పోలీసు యాక్టు-30 ఉల్లంఘించారంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. బంద్‌ను విజయవంతం చేయాలంటూ  సంగారెడ్డిలో టీజేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. టీజేఏసీ, టీఎన్జీఓస్ యూనియన్, టీఆర్‌ఎస్, సీపీఐతో పాటు ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
 
 నిరసన ప్రదర్శనలకు పిలుపు
 బంద్ సందర్భంగా శాంతియుత నిరసన తెలపాల్సిందిగా టీజేఏసీ పశ్చిమ జిల్లా కమిటీ అధ్యక్షుడు వై. అశోక్‌కుమార్ పిలుపునిచ్చారు. ఉద్యోగులు విధులు బహిష్కరించి సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి బస్టాండు వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేందర్, అసోసియేట్ అధ్యక్షుడు శ్యాంరావు వెల్లడించారు. తాలూకా, మండల కేంద్రాల్లో ఉద్యోగులు నిరసన తె లపాల్సిందిగా పిలుపునిచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జరిగే బంద్‌లో పాల్గొనాల్సిందిగా టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మంద పవన్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement