నా చెల్లివంటి దానివి...నీ ఆరోగ్యం మా బాధ్యత

ITDA PO Helps Tribal Woman Treatment in Palakonda Srikakulam - Sakshi

బాలింత రాజేశ్వరిని ఒప్పించిన ఐటీడీఏ పీవో  

మెరుగైన వైద్యానికి జెమ్స్‌కు తరలింపు

శ్రీకాకుళం, పాలకొండ రూరల్‌: ‘అమ్మా రాజేశ్వరి.. నువ్వు నా చెల్లివంటి దానివి... నాటువైద్యం మంచిదికాదు... నన్ను నమ్ము... నీ ఆరోగ్యం మా బాధ్యత’ అని సీతంపేట ఐటీడీఏ పీవో ఎం సాయికాంత్‌వర్మ గిరిజన బాలింత సవర రాజేశ్వరిని బతిమలాడారు. ఆది వారం రాజేశ్వరి వైద్యానికి నిరాకరించటం, ఆమెను ఒప్పించేందుకు ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఆర్డీవో, ఇతర అధికారులు శతవిధాలా ప్రయత్నించిన విషయం విదితమే. ఈ క్రమంలో విషయాన్ని పర్యవేక్షిస్తున్న పీవో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విశాఖ నుంచి పాలకొండ ఏరియా ఆస్పతికి చేరుకుని తనవంతు ప్రయత్నం చేశారు. దాదాపు గంట పాటు బాలింతను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎంతసేపటికి ఆమె ససేమిరా అనటంతో తానే స్వయంగా మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పటంతో ఎట్టకేలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాత్రి 12 గంటల సమయంలో పీవో తన సొంత వాహనంలో రాగోలు జెమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగలిగారు. సోమవారం అక్కడి వైద్యులు రాజేశ్వరికి అవసరమైన వైద్య పరీక్షలు చేశారు. ఒక యూనిట్‌ రక్తాన్ని అందించారు. అదేవిధంగా వైద్య ఖర్చులకు కొంత ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం రాజేశ్వరి ఆరోగ్యం నిలకడగా ఉందని జెమ్స్‌ వైద్యులు స్పష్టం చేశారు. పీవో వెంట ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో ఈఎన్‌వీ నరేష్‌ రాత్రంతా ఉన్నారు. ఏదేమైనా బాలింత ఆరోగ్యం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకున్న శ్రద్ధ ప్రశంసలు అందుకుంటున్నాయి.

 గిరిజన బాలింతను ఒప్పించిన ఎమ్మెల్యేకు అభినందన  
సీతంపేట: అవగాహన లేమి, మూఢవిశ్వాసాలతో వైద్యానికి నిరాకరించిన సీదిగూడకు చెందిన గిరిజన బాలింత రాజేశ్వరిని ఒప్పించిన పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిని ఐటీడీఏ పీవో సాయికాంత్‌ వర్మ అభినందించారు. సోమవారం సాయంత్రం ఐటీడీఏలో పుష్పగుచ్ఛం అందజేసి దుశ్శాలువాతో సన్మానించారు. అధికార యంత్రాంగం వేడుకున్నా ఇంటికి వెళ్లిపోతానని మొండిపట్టు పట్టి వైద్యానికి నిరాకరించిన ఆమెను ఓ దారికి తెచ్చి వైద్యం చేయించారని పీవో ఆనందం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ఆమెను ఒప్పించలేకపోయామని, చివరకు ఎమ్మెల్యే నచ్చచెప్పడంతో అంగీకరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో ఆనందరావు  పాల్గొన్నారు.  

ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛంతో అభినందిస్తున్న పీవో సాయికాంత్‌ వర్మ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top