రాజధాని భూముల్లో... ఐటీ వ్యాపారం

IT business in the Amaravati Lands - Sakshi

     5.5 ఎకరాల్లో ఐటీ టవర్‌ నిర్మాణం

     నిర్మాణ వ్యయం రూ.284 కోట్లు

     విక్రయం ద్వారా రూ.375 కోట్లు

     ఐటీ టవర్‌కు ఇటీవల సీఎం శంకుస్థాపన

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూములతో రాష్ట్ర ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయనుందని ‘సాక్షి’ తొలి నుంచి చెబుతున్న అంశాలు కార్యరూపం దాలుస్తున్నాయి. రాజధాని భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతోపాటు పలు వాణిజ్య, వాణిజ్యేతర కార్యకలాపాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రుల కోసం అమరావతిలో ఐటీ టవర్‌ నిర్మాణం చేపట్టి దాన్ని విక్రయించడం ద్వారా  వ్యాపారం చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ఐటీ టవర్‌కు ఇటీవలే సీఎం చంద్రబాబు అట్టహాసంగా శంకుస్థాపన చేయడం తెలిసిందే. రాజధానిలో ఐటీ టవర్‌ నిర్మాణం ద్వారా రూ.90 కోట్ల లాభాన్ని ఆర్జించాలని సీఆర్‌డీఏ ప్రణాళిక రూపొందించింది. దీన్ని ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశం అమోదించింది. అమెరికాలోని తెలుగువారికి చెందిన 45 ఐటీ కంపెనీలు అమరావతికి వచ్చేందుకు ఆసక్తి చూపాయని, దీనికి సంబంధించి కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి మధ్య సంతకాలు కూడా జరిగాయని సీఆర్‌డీఏ పేర్కొంది.

10 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం... 
అమరావతిలో పది లక్షల చదరపు అడుగుల్లో ఐటీ టవర్‌ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏకు సూచించింది. 5.5 ఎకరాల్లో ఐటీ టవర్‌ నిర్మాణం చేపట్టనుంది. ప్లగ్‌ అండ్‌ ప్లే ఐటీ ఆఫీసెస్, ఐటీ మౌలిక వసతులను సంయుక్తంగా వినియోగించుకోవడం, బ్రాడ్‌బాండ్‌ కనెక్టివిటీ, నిరంతర విద్యుత్, ఐటీ కార్యాలయాలకు ఉద్యోగులు నడిచి వెళ్లి వచ్చేలా ఏర్పాట్లు, సరసమైన ధరలకు గృహాలు, సోషల్, రిక్రియేషన్‌ సౌకర్యాలు కల్పించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. 

ఐటీ కంపెనీలకు విక్రయం, దీర్ఘకాలిక లీజు
ఐటీ టవర్‌లోకి 45 ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలు రావడం ద్వారా 8,000 మందికి ఉద్యోగాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని సీఆర్‌డీఏ పేర్కొంది. ఐటీ టవర్‌ రెండు దశల్లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. నిర్మాణం పూర్తయిన తరువాత ఐటీ కంపెనీలకు స్పేస్‌ను విక్రయించడం, దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. ఐటీ టవర్‌ నిర్మించి విక్రయించడం ద్వారా రూ.90.64 కోట్ల లాభాన్ని ఆర్జించనున్నట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top