ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాల జారీలో జాప్యం జరుగుతోంది
తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ దగ్గరే ఫైలు పెండింగ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాల జారీలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం ఆ ఫైలు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వద్ద పెండింగ్‌లో ఉంది. ఆ ఫైలుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో సంప్రదించిన తరువాత క్లియర్ చేయాల్సి ఉంది. కేసీఆర్ గత మూడు రోజుల నుంచి ఇతర ప్రభుత్వ వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో రాజీవ్ శర్మ ఈ అంశంపై చర్చించలేకపోయారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే అంశంపై కమలనాథన్ గురువారం సచివాలయానికి వచ్చి తెలంగాణ సీఎస్‌తో చర్చించారు.
శుక్రవారం రాజీవ్ శర్మ నుంచి ఫైలు క్లియర్ అవుతుందని కమలనాథన్ భావించారు. అయితే రాజీవ్ శర్మ ఫైలు క్లియర్ చేయలేదు. రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడం, సోమవారం రాజీవ్ శర్మ ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశానికి వెళ్లనుండడంతో మంగళవారం గానీ ముసాయిదా మార్గదర్శకాలకు మోక్షం లభించే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.