కుటుంబం అదృశ్యంపై దర్యాప్తు | investigate on the Disappearance of family | Sakshi
Sakshi News home page

కుటుంబం అదృశ్యంపై దర్యాప్తు

Dec 12 2014 1:03 AM | Updated on Nov 6 2018 4:13 PM

కుటుంబం అదృశ్యంపై దర్యాప్తు - Sakshi

కుటుంబం అదృశ్యంపై దర్యాప్తు

అప్పుల బాధ భరించలేక చనిపోవాలని నిర్ణయించుకున్నామంటూ లేఖ రాసిన ఓ కుటుంబం అదృశ్యమైన సంఘటన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.

చనిపోయేందుకు వెళ్తున్నట్టు లేఖ
పెళ్లికి వచ్చి కనిపించని అక్కాచెల్లెళ్లు
తల్లిదండ్రులు, బిడ్డలతో కలిసి అదృశ్యం
కన్నీరు మున్నీరవుతున్న భర్తలు
వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

అల్లిపురం:  అప్పుల బాధ భరించలేక చనిపోవాలని నిర్ణయించుకున్నామంటూ లేఖ రాసిన ఓ కుటుంబం అదృశ్యమైన సంఘటన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం గుత్తు కృష్ణమూర్తి, వెంకటలక్ష్మి దంపతులు టౌన్ కొత్తరోడ్డులోని తుమ్మలపల్లి వారి వీధిలో నివసిస్తున్నారు.వీరికి సంతోష్‌లక్ష్మి, రాజ్యలక్ష్మి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్దమ్మాయి సంతోష్‌లక్ష్మిని విశాఖ జిల్లా ఎస్.రాయవరానికి చెందిన పడమట వెంకట్రావుతో వివాహం చేశారు. ఈమెకు మోనిక (6), దక్షిత అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు. రెండో అమ్మాయిని ఎన్‌ఏడీకి చెందిన ఆటో డ్రయివర్ బండారు నాగరాజుతో వివాహం జరిపించారు. వీరికి 8 నెలల కుమారుడు చరణ్‌మూర్తి ఉన్నాడు.
 
పుట్టింటికి వెళ్లి మాయం

ఈ నెల 6వ తేదీన వన్‌టౌన్ కన్యకాపరమేశ్వరి కల్యాణమండపంలో బంధువుల పెళ్ళికని ఇద్దరు ఆడపిల్లలు తమ భర్తలతో సహా వచ్చారు. పెళ్లి భోజనాల తరువాత ఇద్దరు అల్లుళ్లు వారి ఇళ్ళకు వెళ్లిపోయారు. అక్కాచెల్లెళ్లు సంతోష్‌లక్ష్మి, రాజ్యలక్ష్మి ఇద్దరు కలసి కన్నవారింటికి పిల్లలను తీసుకెళ్లారు. 7వ తేదీన ఇద్దరు అల్లుళ్లు భార్యలకు ఫోన్లు చేయగా అవి స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. దీంతో వారిద్దరు కొత్తరోడ్డులో అత్తింటివారు నివసిస్తున్న ఇంటికి వచ్చి చూడగా తలుపులకు తాళాలు వేసి ఉన్నాయి.

చుట్టుపక్కల ప్రాంతాలు వెతికినా వారి ఆచూకి తెలియలేదు. తిరిగి అనుమానం వచ్చిన వారు 10వ తేదీ ఉదయం వచ్చి వీధిలో అందరినీ వాకబు చే సారు. ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించటంతో కిటికీ వద్ద ఒక లేఖ దొరికింది. ‘అప్పులు ఎక్కువగా ఉండటంతో అంతా కలసి ఇల్లు వదిలి చనిపోయేందుకు వెళ్లిపోతున్నాం’ అని రాసి ఉంది. దీంతో అల్లుళ్లు వెంకట్రావు, నాగరాజులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
 
పోలీసు బృందాల గాలింపు
కేసు నమోదు చేసిన పోలీసులు పరవాడ, వాడ చీపురుపల్లితో పాటు నగరంలో పలు ప్రాంతాలకు బృందాలను పంపించారు. వారితో పాటు వెంకటరావు, నాగ రాజులు కూడా తమ కుటుంబ సభ్యులకోసం తీవ్రంగా వెదుకుతున్నారు. తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసిన వారు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లు ఫోన్ నంబర్లు 9440796019, 0891-2563632, 8121013250కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement