బోధన.. వేదన

Intermediate Colleges Management Teaching In YSR Kadapa - Sakshi

కేజీబీవీల్లో ఇంటర్‌ బోధన యాజమాన్యాలకు వేదనగా మారింది. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామన్న పాలకుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.   కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) పదో తరగతి తర్వాత బాలికలు విద్యను ఆపేస్తున్నారన్న ఉద్దేశంతో ఈఏడాది నుంచి ఇంటర్‌ విద్యను ప్రారంభించారు. అయితే బోధన, అధ్యాపకుల నియామకం గురించి మరచిపోయారు.కేజీబీవీల్లో పదవ తరగతికి బోధించే ఉపాధ్యాయులతో తెలుగు, ఇంగ్లిష్‌ సబ్జెక్టులను మాత్రమే బోధిస్తూ..ఇతర సబ్జెక్టులను అటకెక్కించడంతోవిద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు.

కడప ఎడ్యుకేషన్‌: బాలికా విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2004 నుంచి కేజీబీవీలను ప్రారంభించింది. జిల్లాలో 29 కేజీబీవీలు ఉన్నాయి. వీటిల్లో బాలికలకు మాత్రమే ప్రవేశం ఉంది.   కేజీబీవీల్లో పదో తరగతి వరకు విద్య అందించేవారు. అయితే విద్యార్థినులు పదో తరగతి తర్వాత విద్యకు స్వస్తి పలుకుతున్నట్లు తెలియడంతో ప్రభుత్వం బాలికల విద్యను ప్రొత్సహిస్తూ జిల్లాలోని పెద్దముడియం, వీరబల్లి కేజీబీవీల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్‌ తరగతులను ప్రారంభించింది.మౌలిక వసతులు అరకొరే.అధ్యాపకుల నియామకానికి సంబంధించిన ప్రక్రియను ఇప్పుడు మొదలు పెట్టింది. ఫలితంగా బోధన ఆలసమ్యమవుతోంది.

కళాశాలల వివరాలు
జిల్లాలోని పెద్దముడియం, వీరబల్లి కేజీబీవీలను ప్రభుత్వం ఈ ఏడాది ఇంటర్‌ వరకు అప్‌గ్రేడ్‌ చే సింది. వీరబల్లిలో బైపీసీ గ్రూపును మాత్రమే నిర్వహిస్తున్నారు, బైపీసీకి సంబంధించి 80 మందివిద్యార్థినులు ఉన్నారు. పెద్దముడియంలో బైపీసీ, ఎంపీసీ గ్రూపులు ప్రవేశపెట్టింది. ఇందులో బైపీసీకి సంబంధించి 26 మంది ఎంపీసీ విభాగంలో 35 మంది ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.

అధ్యాపకులు ఎప్పుడొస్తారో..
ఇంటర్‌ పాఠ్యాంశాలను బోధించేందుకు కావాల్సిన అధ్యాపకుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. వీరబల్లికి ఆరుగురు, పెద్దముడియం కేజీబీవీకి ఏడుగురు ఆధ్యాపకుల నియామకం కోసం ఈనెల 8వ తేదీ నుంచి కౌన్సిలింగ్‌ ప్రారంభించింది. సంబంధిత ప్రక్రియను 11వ తేదీ వరకు కొనసాగించారు. జాబితాను అధికారులు పరిశీలించి కలెక్టర్‌కు పంపినట్లు తెలిసింది. ఆయన ఓకే చేసి (సర్వశిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ)కు పంపుతారు. వారు జాబితాను ప్రదర్శిస్తారు. అనంతరం ఎస్‌ఎస్‌ఏ వారు జాబితాలో అభ్యంతరాలను కోరతారు. తర్వాత తుదిజాబితాను విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ తతంగమంతా జరగాలంటే ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో అధ్యాపకులు ఎప్పుడొస్తారో..పాఠాలు ఎప్పుడు బోధిస్తారోననే దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. కేజీబీవీల్లో ఇంటర్‌ను ఎలా పూర్తి చేస్తారో, ఎంతశాతం ఉత్తీర్ణత తెస్తారో వేచి చూడాల్సిందే.

త్వరలో సమస్యను పరిష్కరిస్తాం
కేజీబీవీల్లో ఇంటర్‌కు సంబంధించి ఆధ్యాపకుల నియామక ప్రక్రియ పూర్తయింది. త్వరలో జాబితా విడుదల కానుంది. జాబి తారాగానే ఎంపికైన వారితో బోధన ప్రారంభిస్తాం. విద్యార్థినులకు సమస్య లేకుండా చూస్తాం. సిలబస్‌ను కూడా సకాలంలో ముగించేలా చర్యలు తీసుకుంటాం. – సుజన, సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు అధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top