కర్నూలు, అనంతపూర్ జిల్లాలతో ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయడం సహేతుకం. నదీ జలాలు, విద్యుత్ తదితర సమస్యలు కూడా ఈ జిల్లాల కలయికతో సర్దుకుంటాయి.
‘రాయల్’గా ఉంటాం
కర్నూలు, అనంతపూర్ జిల్లాలతో ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయడం సహేతుకం. నదీ జలాలు, విద్యుత్ తదితర సమస్యలు కూడా ఈ జిల్లాల కలయికతో సర్దుకుంటాయి. ఇటు బొగ్గు, అటు ఇనుము వంటి సహాజ వనరులు ఉండడం వల్ల రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అభివృద్ధి అసమానతలు తొలిగిపోతాయి. మొదట్నుంచి నేను వాదిస్తున్నట్లు ఇరు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలు సమంగా ఉంటాయి. రాయల తెలంగాణతో రాజకీయంగా కూడా కాంగ్రెస్‌కు కలిసివస్తుంది.
- కేఎల్లార్, మేడ్చల్ ఎమ్మెల్యే
కిరికిరి చేస్తే ఊరుకోం
పది జిల్లాలతో కూడిన తెలంగాణకే నా మద్దతు. పూట కో పేచీతో తెలంగాణకు అడ్డంకులు సృష్టిస్తే చూస్తూ ఊరుకోం. రాజకీయ ప్రయోజనాలను ఆశించి రాయలసీమను కలపాలని ప్రయత్నం మంచిది కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం కిరికిరిలు పెడితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు.
- పి.మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే
మళ్లీ దగా పడతాం
సంపూర్ణ తెలంగాణకే మా మద్దతు. సీమలోని రెండు జిల్లాలను కలిపితే తెలంగాణకు న్యాయం జరగదు. ఫ్యాక్షనిస్టుల దోపిడీతో మరోసారి మోసం పోతాం. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలి.
- కేఎస్ రత్నం, చేవెళ్ల ఎమ్మెల్యే
ఇది సరైన సమయం కాదు
రాష్ట్ర విభజన విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మొదట్నుంచి చెబుతూ వస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రకటనపై గ్రేటర్ ఎమ్మెల్యేల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం అధిష్టానం చేయలేదు. కొత్త రాష్ట్రాన్ని ప్రకటించి.. చివరి నిమిషంలో ఇప్పుడు మా అభిప్రాయాన్ని కోరడం అర్ధరహితం.
- దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే
సంపూర్ణ తెలంగాణ
57 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పడుతున్న తెలంగాణను అడ్డుకునే ప్రయత్నమే రాయల తెలంగాణ ప్రతిపాదన. హైదరాబాద్ రాజధానిగా ఏర్పడే తెలంగాణకే మా మద్దతు. రాయలసీమను విచ్ఛిన్నం చేసి.. తెలంగాణలో కలపాలని చూస్తే ప్రజా ఉద్యమం తప్పదు.
- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే