చాలా.. లోపాలున్నాయ్‌

Intellectuals and Unemployed and Students Instructions To the APPSC - Sakshi

ఏపీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేయాలి

చైర్మన్‌వి నియంతృత్వ పోకడలు.. ఆయన్ని తక్షణం తొలగించాలి

అభ్యర్థుల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలి 

ఇంటర్వ్యూలు పూర్తిగా ఎత్తివేసి, నెగటివ్‌ మార్కులు తీసేయాలి 

సిలబస్‌ ఆరేళ్లయినా కొనసాగించాలి 

ఏపీపీఎస్సీకి మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థుల సూచనలు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌(ఏపీపీఎస్సీ)ను సమూలంగా ప్రక్షాళన చేయాలని పలువురు మేధావులు, ప్రజాప్రతినిధులు, నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌ పి.ఉదయభాస్కర్‌ నియంతృత్వ పోకడల వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, ఆయన్ను తక్షణం తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఏపీపీఎస్సీ చరిత్రలోనే తొలిసారి కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు సోమవారం మేధావులు, ప్రజాప్రతినిధులు, నిరుద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించారు. కమిషన్‌లోని లోపాలు సరిదిద్దేందుకు సలహాలు, సూచనలు స్వీకరించారు. విజయవాడలోని ఆర్టీసీ కాన్ఫరెన్సు హాలులో జరిగిన ఈ సమావేశంలో చైర్మన్‌ ఉదయభాస్కర్‌పై పలువురు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన్ను తక్షణమే తొలగించకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగదని స్పష్టంచేశారు. 

నాలుగేళ్లుగా ఏపీపీఎస్సీ పనితీరు బాలేదు 
గత నాలుగేళ్లుగా ఏపీపీఎస్సీ పనితీరు సరిగా లేదని, చైర్మన్‌ నియంతృత్వం పోకడలు అవలంభించారని ఎమ్మెల్సీ కె.లక్ష్మణరావు ఆరోపించారు. ‘సిలబస్‌ కనీసం ఆరేళ్లపాటు కొనసాగేలా చూడాలి. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాలి. అన్ని పరీక్షల్లో నెగిటివ్‌ మార్కులు తీసేయాలి. గ్రూప్‌–1కు మాత్రమే ప్రిలిమినరీ ఉండేది. చైర్మన్‌ అన్నిటికీ ప్రిలిమినరీ తప్పనిసరి చేశారు. బోర్డులోని సబ్జెక్టు నిపుణులపై చైర్మన్‌ ఒత్తిడి తెచ్చి తనవారికి ఎక్కువ మార్కులు వేయించారని ఆరోపణలున్నాయి. అందువల్ల రెండు మూడు ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటుచేయాలి’ అని సూచించారు. ఎమ్మెల్సీ కత్తి నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. పరీక్షలు సకాలంలో నిర్వహించి నియామకాలు వేగంగా పూర్తిచేయాలని కోరారు. ‘ప్రశ్నపత్రాల తయారీకి ప్యానెల్‌ ప్రొఫెసర్ల ఎంపిక పగడ్బందీగా ఉండాలి. సీల్డుకవర్లలో ఇచ్చే ప్రశ్నలను ఏపీపీఎస్సీలోని వారంతా చూస్తున్నారన్న అపవాదుంది. ప్రశ్నల రూపకల్పనలో సమతూకం ఉండాలి. ప్రశ్నల్లో తప్పులకు  బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. 

ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూల్లో అనేక అక్రమాలు 
పోస్టుల భర్తీలో అవినీతికి తావులేకుండా అడ్డుకట్ట వేసేలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టడం మంచి పరిణామమని మద్య నియంత్రణ ప్రచార కమిటీ చైర్మన్‌  వి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. ‘గత కొన్నేళ్లుగా ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూల్లో అనేక అక్రమాలు జరిగాయి. ఎవరికెన్ని మార్కులు వేయాలో చైర్మన్‌ ఉదయభాస్కర్‌ ఒత్తిడి తెచ్చేవారని బోర్డులోని సబ్జెక్టు నిపుణులు చెప్పారు. రాజకీయ జోక్యంతో వారు చెప్పిన వారికి పోస్టులు దక్కేలా చైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరించారు. ఉదయభాస్కర్‌ను తొలగిస్తేనే కమిషన్‌ ప్రక్షాళన సాధ్యం’ అని పేర్కొన్నారు. నిరుద్యోగులపై చైర్మన్‌ కేసులు పెట్టించి వేధించారని నిరుద్యోగ జేఏసీ నేతలు రామచంద్ర, సుకుమార్, రాజ్‌కుమార్‌లు నిరసన వ్యక్తంచేశారు. అక్రమ కేసులు ఎత్తివేసి, చైర్మన్‌ను తక్షణం తొలగించాలని డిమాండ్‌చేశారు. వినతులు అందించేందుకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు సుబ్బారావు పేర్కొనగా.. కమిషన్‌ కార్యాలయం మెట్లు ఎక్కనివ్వనంటూ బడుగు, బలహీనవర్గాలను చాలా చిన్నచూపు చూశారని మరో విద్యార్థి సంఘం నేత షానవాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

పలువురు ప్రతినిధులు ఏపీపీఎస్సీలో సంస్కరణల కోసం సూచనలు చేశారు. 
1. ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీ విధానం కోసం కర్ణాటకలో మాదిరిగా చట్టం చేయాలి.
2. రాష్ట్ర సిలబస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.
3. ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్‌ వాడుకున్నా.. మెయిన్స్‌లో మెరిట్‌లో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓపెన్‌ కేటగిరీ పోస్టులు ఇవ్వాలి.
4. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షల్లో 75కు పైగా ప్రశ్నల్లో తప్పులు ఇతర లోపాలున్నందున దాన్ని రద్దుచేసి తిరిగి నిర్వహించాలి.
5. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆన్‌లైన్‌కు అలవాటు పడేవరకు ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలి. 
6. నోటిఫికేషన్‌కు ప్రిలిమ్స్‌కు మధ్య 5 నెలలు.. అనంతరం మెయిన్స్‌కు 4 నెలల సమయమివ్వాలి.
7. వివిధ పరీక్షల మోడల్‌ పేపర్లను ముందుగానే విడుదల చేయాలి.
8. హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయాలి.
9. అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేయకపోవడం వల్ల నష్టపోతున్నారు. దాన్ని వెంటనే అమలు చేయాలి.
10. ఆంగ్లం, తెలుగు ప్రశ్నల్లో ఏది తప్పైతే దాన్నే రద్దుచేయాలి. స్కేలింగ్‌ను కూడా రద్దుచేయాలి. 
11. గ్రూప్‌–2లో ఎగ్జిక్యుటివ్‌ పోస్టులు యధాతథంగా భర్తీచేయాలి.
12. నిబంధన– 7ను పునరుద్ధరించి పోస్టుల్ని తదుపరి నోటిఫికేషన్లకు మళ్లించకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలి.
13. అభ్యంతరాలు నేరుగా లేదా పోస్టు ఇవ్వమనడంతో నష్టపోతున్నాం. ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు అవకాశం కల్పించాలి.
14. మెయిన్స్‌ పరీక్షల్లో మార్కులను ఇంటర్వ్యూలకు ముందుగా ప్రకటిస్తూ కమిషన్‌లోని సభ్యులు బేరసారాలు సాగిస్తున్నారు. సెలెక్షన్‌ పూర్తయ్యాకే మార్కులు ప్రకటించాలి.
15. యూనివర్సిటీ అసిస్టెంటు ప్రొఫెసర్‌ పోస్టులు ఏపీపీఎస్సీతో సంబంధం లేకుండా పాతవిధానంలో భర్తీచేయాలి.

అన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ ద్వారా అందరికీ మేలుజరిగేలా సలహాలు సూచనలకోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సలహాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అందరికీ పూర్తి న్యాయం చేసేందుకు మూడు వారాల్లో చర్యలు తీసుకుంటాం. నెగిటివ్‌ మార్కులు తీసేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనిపై కమిషన్‌లోనూ నిర్ణయం తీసుకుంటాం. 
సీతారామాంజనేయులు, ఏపీపీఎస్సీ కమిషన్‌ కార్యదర్శి   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top