
బాలగజేంద్రుని విలాపం!
ప్రమాదవశాత్తు నీటిదొనలో పడ్డ గున్న ఏనుగు ఒక రాత్రంతా అక్కడే విలపించింది. దాన్ని పైకి లాగలేక.. వదిలి వెళ్లలేక గజరాజులు అక్కడే ఘీంకారాలు చేశాయి.
- రాత్రంతా నీటి దొనలోనే..
- గున్న ఏనుగును వదిలి వెళ్లలేక గజరాజుల ఘీంకారం
- ఎట్టకేలకు సుఖాంతం
పలమనేరు, న్యూస్‌లైన్: ప్రమాదవశాత్తు నీటిదొనలో పడ్డ గున్న ఏనుగు ఒక రాత్రంతా అక్కడే విలపించింది. దాన్ని పైకి లాగలేక.. వదిలి వెళ్లలేక గజరాజులు అక్కడే ఘీంకారాలు చేశాయి. పిల్లను పైకి లాగేందుకు ఏనుగుల గుంపు చుట్టుపక్కల ఉన్న మట్టిని, ఎండిన చెట్టుమొదళ్లు, రాళ్లను దొనలోకి నెట్టాయి. దొన లోతు పది అడుగులకు పైగా ఉంది. అందులో నీళ్లు ఎనిమిది అడుగుల దాకా ఉన్నాయి. అయినా వాటి ప్రయత్నం ఫలించలేదు.
రాత్రంతా దొనలోనే...
కౌండిన్య అభయారణ్యంలో దాహం తీర్చుకోవడానికి వచ్చిన గున్నఏనుగు నీటి దొనలో పడి ఇరుక్కుపోయింది. ఒక రాత్రంతా అక్కడే ఉండిపోయింది. సోమవారం ఉదయం పశువుల కాపరులు అటవీశాఖకు సమాచారమందించారు. ఎఫ్‌ఆర్వో బాలవీరయ్య, సిబ్బంది, ఫారెస్ట్ ట్రాకర్స్, గ్రామస్తులను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లారు.
గున్నఏనుగు ఉన్న ప్రాంతంలోనే ఏనుగుల గుంపు ఉండడంతో ట్రాకర్స్ టపాసులు పేలుస్తూ వాటిని దూరంగావెళ్లగొట్టారు. మూడు గంటలపాటు శ్రమించి తాళ్ల సాయంతో ఏడాది వయసున్న గున్నఏనుగును బయటకు తీశారు. చెరుకులు ఆహారంగా ఇచ్చి అడవిలోకి వదిలిపెట్టే ప్రయత్నం చేశారు. నీరసించిన అది ముందుకు వెళ్లలేదు. సోమవారం బాగా పొద్దుపోయేవరకు కూడా ఏనుగుల గుంపు మాత్రం ఘీంకారాలు చేస్తూ అక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. ట్రాకర్స్ కాపలా ఉన్నారు.