యువత చేతిలోనే భవిత | In the hands of the youth bhavita | Sakshi
Sakshi News home page

యువత చేతిలోనే భవిత

Jan 12 2015 12:48 AM | Updated on Mar 22 2019 5:33 PM

యువత చేతిలోనే భవిత - Sakshi

యువత చేతిలోనే భవిత

‘‘దేశం మొత్తం జనాభాలో 25 ఏళ్లలోపు యువకులు 50 శాతం మంది ఉన్నారు. వీరిలో నైపుణ్యం పెంచి, సద్వినియోగం చేసుకుంటే 2020 నాటికి భారత్ అగ్రదేశం అవుతుంది.

  • వారు దేశం కోసం పాటుపడాలి  
  • స్వర్ణ భారత్ ట్రస్టు సంక్రాంతి వేడుకల్లో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
  • నెల్లూరు: ‘‘దేశం మొత్తం జనాభాలో 25 ఏళ్లలోపు యువకులు 50 శాతం మంది ఉన్నారు. వీరిలో నైపుణ్యం పెంచి, సద్వినియోగం చేసుకుంటే 2020 నాటికి భారత్ అగ్రదేశం అవుతుంది’’ అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో ఆదివారం స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు ప్రాంగణంలో స్వర్ణభారత్, స్వచ్ఛభారత్ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫడ్నవీస్ ‘నమస్కారం, మీ అందరికీ శుభ మధ్యాహ్నం, సంక్రాంతి శుభాకాంక్షలు’ అని తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.

    ప్రతి యువకుడూ నైపుణ్యాన్ని సంపాదించుకుని దేశ భవిష్యత్ కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, మన పండుగల విశిష్టతను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 26 ఏళ్లకే మేయర్‌గా ఎన్నికైన ఫడ్నవీస్ అవినీతి పరుల పాలిట సింహస్వప్నమని, అభివృద్ధికి మారుపేరని కొనియాడారు. ఆయన దేశ భవిష్యత్ రాజకీయాల్లో ధృవతారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలందరూ ఒకరికొకరు బంధువులేనన్నారు.
     
    చిరంజీవి మూడో కన్ను: వెంకయ్య

    తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ రెండు కళ్లు అయితే చిరంజీవిని మూడో కన్నుగా వెంకయ్యనాయుడు అభివర్ణించారు. పవన్ కల్యాణ్ స్వార్థం కోసం కాకుండా ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లో వచ్చారన్నారు. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వచ్చేందుకు కారణమైన వారిలో పవన్ కల్యాణ్ ఒకరని చెప్పారు. నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో స్వర్ణభారత్ ట్రస్టుకు ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ఇతర రంగాల ప్రముఖుల్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు.

    వెంకయ్యనాయుడు ఆదర్శనీయుడని, ఫడ్నవీస్ స్ఫూర్తినిచ్చే వ్యక్తి అని పవ న్ కళ్యాణ్ కొనియాడారు. స్వచ్ఛ భారత్ అంటే ఫొటోలకు ఫోజు లివ్వడం కాదన్నారు. శుభ్రత మన నుంచే ప్రారంభం కావాలని సూచించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అభిమానులందరూ పాల్గొనాలని కోరారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఫడ్నవీస్, వెంకయ్యనాయుడు ప్రసంగించే సమయంలో మైక్ కొద్దిసేపు పని చేయలేదు. దీంతో వెంకయ్య కొంత అసహనానికి గురయ్యారు.
     
    శ్రీవారిని దర్శించుకున్న ఫడ్నవీస్

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం రాత్రి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కుకున్న ఆయన మహాలఘులో స్వామి దర్శనానికి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement