సౌరవిద్యుత్‌దే భవిష్యత్


 గోదావరిఖని, న్యూస్‌లైన్ : ప్రకృతి వనరు అయిన సౌరశక్తి విద్యుత్‌పైనే భవిష్యత్‌లో ఆధారపడాల్సి వస్తుందని, ఎన్టీపీసీ కూడా వాటికే ప్రాధాన్యతనివ్వబోతోందని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ అరూప్‌రాయ్ చౌదరి అన్నారు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాజీవ్హ్రదారి పక్కన నర్రశాలపల్లి శివారులో నెలకొల్పిన 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పాలని సూచిస్తోందని, ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా రెండు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని  తెలిపారు.



 ఇప్పటివరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిర్‌లో 5 మెగావాట్లు, ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో ఐదు మెగావాట్ల సోలార్ విద్యుచ్ఛక్తి ప్లాంట్లను ప్రారంభించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా రామగుండం వద్ద మొదటి దశ కింద రూ.90 కోట్ల వ్యయంతో 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభించామని, రెండో దశ కింద మరో 15 మెగావాట్ల ప్లాంట్ నెలకొల్పుతామని చెప్పారు. సౌరశక్తి విద్యుత్ ప్లాంట్లతో కాలుష్యాన్ని నియంత్రించొచ్చని, 12 వేల ఇళ్లకు విద్యుత్ అందించవచ్చని తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్ ఖర్చు ప్రస్తుతం ఎక్కువగా అవుతున్నా... రాబోయే రోజుల్లో తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రామగుండం సోలార్ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ట్ర అవసరాలకే కేటాయించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోలార్ ప్లాంట్‌లోని వివిధ దశలను తిలకించి ఒక రోజు ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను పరిశీలించారు.

 

 ప్లాంట్ సందర్శన

 ఎన్టీపీసీ ప్లాంట్‌ను సీఎండీ సందర్శించారు. నాల్గో యూనిట్‌లో గ్యాస్‌లు బయటకు వెళ్లేందుకు చేపట్టిన చర్యలను పరిశీలించారు.

 

 బొగ్గు లభ్యమైతేనే రామగుండం ఎన్టీపీసీ విస్తరణ

 రామగుండం ఎన్టీపీసీలో విస్తరణ చేపట్టేందుకు నూతనంగా ప్రారంభించనున్న 660 మెగావాట్ల 8, 9 యూనిట్లకు బొగ్గు లింకేజీ సమస్య ఏర్పడిందని, సింగరేణి గానీ, కోల్ ఇండియా నుంచి గానీ అనుమతి లభించిన వెంటనే వాటిని ప్రారంభించనున్నామని ఎన్టీపీసీ సీఎండీ తెలిపారు.

 

 ఎన్టీపీసీ-సింగరేణి భాగస్వామ్యంలో తలాయిపల్లి వద్ద బొగ్గు వెలికితీయబోతున్నామని, ఇతర ప్రాంతాల్లోనూ బొగ్గు కోసం అన్వేషణ చేస్తున్నామన్నారు. రామగుండం వద్ద గల బీపీఎల్ ప్రాజెక్టును తీసుకునేందుకు ప్రతిపాదనలు తయారుచేశామని, రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తే ఆ ప్రాజెక్టును చేపడతామని చెప్పారు. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా విద్యుత్ ప్లాంట్లను విస్తరించేందుకు, ఏర్పాటు చేసేందుకు రామగుండం ప్రాంతం అనువైన చోటనిపేర్కొన్నారు.

 

 ఏరియల్ వ్యూ ద్వారా బీపీఎల్ స్థల పరిశీలన

 ప్రారంభానికి నోచుకోకుండా ఉన్న బీపీఎల్ ప్లాంట్‌ను తీసుకోవడానికి ఎన్టీపీసీ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సంస్థ సీఎండీ అరూప్‌రాయ్ బుధవారం ఏరియల్ వ్యూ ద్వారా ఆ సంస్థకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో అధికారులు జెండాలను పాతి గుర్తులు ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ ప్లాంట్‌లో నూతనంగా ఏర్పాటు చేయదలుచుకున్న 8, 9 కొత్త యూనిట్లను నెలకొల్పే ప్రాంతాన్ని, సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుతోపాటు ఎన్టీపీసీకి నీటిని సరఫరా చేసేందుకు గోదావరినదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టును కూడా ఆయన ఏరియల్ వ్యూ ద్వారా తిలకించినట్లు తెలిసింది.

 

 ఆయా కార్యక్రమాల్లో ఎన్టీపీసీ డెరైక్టర్ టెక్నికల్ ఏకే.ఝా, దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.వెంకటేశ్వరన్, రామగుండం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సుభాషిస్‌ఘోష్, సదరన్ రీజియన్ హెచ్‌ఆర్ జనరల్ మేనేజర్ పి.గోపాలరావు, రామగుండం ప్లాంట్ జీఎంలు రామ్‌కుబేర్, ఎన్ కే. సిన్హా, ఆర్‌ఎం రాధాకృష్ణన్, రైనా, ఆర్.హరికుమార్, సోమా ఘోష్ ఉన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top