నరకదారులు | In district roads are damaged very hugely | Sakshi
Sakshi News home page

నరకదారులు

Jan 6 2014 4:14 AM | Updated on Aug 30 2018 4:49 PM

జిల్లాలో రహదారులు అధ్వానంగా మారాయి. నాసిరకం నిర్మాణాల వల్ల ఏడాది గడవకముందే పాడైపోతున్నాయి. వీటి గుండా ప్రయాణించడానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో రహదారులు అధ్వానంగా మారాయి. నాసిరకం నిర్మాణాల వల్ల ఏడాది గడవకముందే పాడైపోతున్నాయి. వీటి గుండా ప్రయాణించడానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) పరిధిలో సుమారు 3,557 కిలోమీటర్లు పొడవున 190 రహదారులు ఉన్నాయి. అలాగే పంచాయతీరాజ్ ఆధీనంలో 10,750 కిలోమీటర్లు పొడవున 3,127 రోడ్లు ఉన్నాయి.
 
 ఇవి 63 మండలాల పరిధిలోని 3,339 గ్రామాలలో 90 శాతం గ్రామాలను కలుపుతున్నాయి. వీటి అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తున్నా... ఏడాది గడవకముందే యథాస్థితికి చేరుకుంటున్నాయి. కాంట్రాక్టర్లు నాసిరకం నిర్మాణాలు చేపడుతుండడమే ఇందుకు కారణం. వారు మండల ఏఈ నుంచి డీఈ, ఈఈ, ఎస్‌ఈ వరకూ ప్రతి ఒక్కరికీ  పర్సెంటేజీలు ముట్టజెప్పాల్సి వస్తోంది. ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులకు కూడా అంతోఇంతో సమర్పించుకోవాల్సి ఉంటోంది. వీరందరికీ ఇచ్చేది పోనూ కాంట్రాక్టర్లు కూడా నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. పని అంచనా వ్యయంలో 30-40 శాతం నిధులు పర్సెంటేజీల రూపంలోనే వెళ్లిపోతున్నాయి.

 ఫలితంగా పనుల నాణ్యత  ప్రశ్నార్థకంగా మారుతోంది. పైపై పూతలతోనే కానిచ్చేస్తున్నారు. జిల్లాలోని 13 నియోజకవర్గాలలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం ద్వారా రూ.142 కోట్లతో 162 రోడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. గత ఏడాది ఆగస్టు 15 నాటికే ప్రారంభానికి నోచుకోవాల్సిన ఈ పనులకు ఇటీవల టెండర్లు ఖరారయ్యాయి. పనులు నత్తనడకన సాగుతుండడంతో ఎప్పటికి పూర్తవుతాయో అర్థం కాని పరిస్థితి ఉంది. అలాగే ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలను ఏ మేరకు పాటిస్తారోనన్నది అనుమానమేనని ప్రజలు అంటున్నారు.
 
 నిధులన్నీ అమాత్యుల నియోజకవర్గాలకే
 జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. అయితే.. రహదారుల అభివృద్ధికి మంజూరవుతున్న నిధులన్నీ అమాత్యులు సొంత నియోజకవర్గాలకు తన్నుకుపోతున్నారు. ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణాభివృద్ధి పథకం కింద విడుదలైన రూ.18.62 కోట్ల నిధులను మంత్రులు రఘువీరా, శైలజానాథ్  సొంత నియోజకవర్గాలకు మళ్లించడమే ఇందుకు నిదర్శనం. మొత్తం నిధులలో కొత్తచెరువు మండలంలోని కోడూరు- కేశాపురం మధ్య చిత్రావతి నదిపై రోడ్డు నిర్మాణానికి రూ. 90 లక్షలు మినహా మిగిలినవన్నీ మంత్రుల నియోజకవర్గాలకే కేటాయించారు. ఇతర ప్రాంతాల్లోని రోడ్లు దారుణంగా ఉన్నప్పటికీ వాటికి పైసా కూడా ఇవ్వలేదు.
 ‘ఉపాధి’ నిధులకు బ్రేక్
 పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రహదారుల అభివృద్ధికి గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది రూపాయల నిధులు విడుదలయ్యేవి. 2009 నుంచి ఉపాధి హామీ ద్వారా రోడ్ల నిర్మాణాలను ప్రారంభించారు.
 
 ఇందుకోసం మొదటి సంవత్సరమే రూ.110 కోట్లు విడుదల చేశారు. ఆ తర్వాత 2011-12లో 789 ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో ఇంటర్నల్ రోడ్లకు రూ.143 కోట్లు, మొత్తం 156 గ్రామాలకు రోడ్లు వేయడానికి రూ. 40 కోట్ల నిధులను మంజూరు చేశారు. కూలీలకు ఏడాది పొడవునా పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిధులు మంజూరయ్యాయి. అయితే...అధికారులు వచ్చే రెండు మూడేళ్లకు సంబంధించిన నిధులను ముందే ఖర్చు చేశారు. ఈ  సాకుతో ప్రభుత్వం 2012 నుంచి నిధులు మంజూరు చేయడం లేదు. గతంలో మంజూరైన నిధులతోనే ప్రస్తుతం పనులు కొనసా..గుతున్నాయి. కొత్తగా నిధులు రాకపోవడంతో గ్రామీణ రహదారుల అభివృద్ధిపై ప్రభావం కన్పిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement