అవినీతి, అక్రమాలకు పాల్పడితే ‘ఖాకీ’కి ఊస్టింగే!

IG Vineet Brijlal Said Who Commits Irregularities On Duty Will Take Serious Action - Sakshi

పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.. ప్రజలతో నిత్యం మమేకం కావాలి.. ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి.. ప్రజలతో స్నేహ సంబంధాలు కొనసాగించి శాంతిభద్రతలను  కాపాడాలి. ఇదీ పోలీసు కర్తవ్యం. పోలీసులది ఉద్యోగం కాదు బాధ్యత. అలాంటి వృత్తిలో ఉంటూ అడ్డదారులు తొక్కే ఖాకీలూ కొందరు ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు చేయని అరాచకాలు, అక్రమాలు, అవినీతి      వ్యవహారాలు లేవు. వీటన్నింటికీ కొందరు పోలీసులు పూర్తి సహాయ సహకారాలు అందించారు. మామూళ్లు దిగమింగి నోళ్లు మూసుకున్నారు. మరో వైపు కొందరు మహిళలను మోసగించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడారు. ఇలా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లేలా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఖాకీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఐజీ బ్రిజ్‌లాల్‌ దృష్టి సారించారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ చేయించి.. నేరం రుజువైన ఒక సీఐ, ఇద్దరు ఎస్‌ఐ సహా ఏడుగురిని ఉద్యోగాల నుంచి తొలగించాలని డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులకు కొమ్ముకాసిన పోలీసు అధికారుల   గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

సాక్షి, గుంటూరు: విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలకు పాల్పడటం, ప్రేమ, పెళ్లి పేరుతో మహిళలను మోసం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడితే ఖాకీ యూనిఫామ్‌ వదిలేసి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితులు రానున్నాయి. పోలీస్‌ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారి పట్ల రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ సీరియస్‌గా ఉన్నారు. ఆరోపణలపై పక్కా సాక్ష్యాధారాలతో నేరం రుజువైతే ఊస్టింగ్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  

ఏడుగురిని ఇంటికి పంపండి..
జిల్లాలో అవినీతి ఆరోపణలు, పెళ్లి, ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసిన, రెండో పెళ్లి చేసుకున్న, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఓ సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు సహా ఏడుగురిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ డీజీపీ ఆఫీస్‌కు సిఫార్సు చేసినట్టు సమాచారం. ఐజీ బ్రిజ్‌లాల్‌ ఇచ్చిన లిస్టులో పేరున్న సీఐ గతంలో అనేక అక్రమాలు, అరాచకాలకు పాల్పడి మావోయిస్టుల హిట్‌ లిస్టులో ఉండి, వారి దాడిలో త్రుటిలో తప్పించుకున్నారని పోలీస్‌ శాఖలో ప్రచారం ఉంది. ఈయనపై గత ప్రభుత్వ హయాంలో తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే టీడీపీ నాయకుల అండదండలు మెండుగా ఉండటంతో ఉన్నతాధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారు. మరో ఇద్దరు ఎస్‌ఐలు గతంలో పల్నాడు ప్రాంతంలో పని చేసిన ఓ డీఎస్పీ కనుసన్నల్లో క్రికెట్‌ బెట్టింగ్‌కు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. సదరు ఆరోపణల మేరకు కొనసాగిన శాఖపరమైన విచారణలో ఎస్‌ఐలు క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాకు సహకరించి భారీగా సంపాదించినట్టు సమాచారం. ఐజీ సిఫార్సు చేసిన మిగిలిన నలుగురిలో ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు తెలిసింది. వీరు కూడా క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాకు సహకరించడం, అవినీతికి పాల్పడటం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహా ఇతరత్రా నేరాలకు పాల్పడినట్టు రుజువు కావడంతో ఐజీ వీరందరిని ఉద్యోగాల నుంచి తొలగించాలని డీజీ ఆఫీస్‌కు నివేదించినట్టు తెలిసింది.  

కొనసాగుతున్న విచారణ
పల్నాడు ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు కొందరు పోలీస్‌ అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీరిపై విచారణ కొనసాగుతోంది. విచారణ ఎదుర్కొంటున్న వారిలో గురజాల టౌన్‌ సీఐగా పని చేసిన రామారావు, పిడుగురాళ్ల టౌన్‌ సీఐగా పని చేసిన వీరేంద్రబాబు ఉన్నారు. విచారణలో సదరు పోలీస్‌ అధికారులు తప్పు చేసినట్టు రుజువైతే వీరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని డీజీపీ ఆఫీస్‌కు ఐజీ నివేదిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top