
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం భక్తులు పోటెత్తారు. గత శనివారంతో పెరటాశి శనివారాలు ముగిసినప్పటికీ ఈ శనివారం కూడా శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలి బాట మార్గాలు నడిచివచ్చే భక్తులతో కిక్కిరిసిపోయాయి. కాలిబాట భక్తులు, సర్వదర్శనం భక్తులతో నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లు నిండిపోయాయి.
తిరుమల కొండచరియల్ని పరిశీలించిన ఐఐటీ నిపుణులు
తిరుమల మొదటి, రెండో ఘాట్‌రోడ్లలో కొండచరియల్ని శనివారం చెన్నై ఐఐటి నిపుణులు ప్రొఫెసర్ కె.ఎస్.రావు నేతృత్వంలోని నిపుణుల బృందం పరిశీలించింది. కొంతకాలం నుంచి తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో తరచూ కొండచరియలు కూలుతున్నాయి. తాజాగా ఈనెల 13న కురిసిన వర్షానికి రెండోఘాట్‌తో పాటు మొదటి ఘాట్‌రోడ్డులోని అవ్వాచారి కోన ఎగువన భారీ స్థాయిలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీన్ని నివారించే చర్యల్లో భాగంగా టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు సూచనతో ఐఐటీ నిపుణులను ఆహ్వానించారు. ఆ మేరకు శనివారం నిపుణుల బృందం ఇంజనీర్లతో కలసి రెండు ఘాట్‌రోడ్లను పరిశీలించింది.