ఘనంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం

Huge Crowd For YS Jagan Swearing-in Ceremony - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్‌ నరసింహన్‌ వైఎస్‌ జగన్‌ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భారీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి తరలించారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడటం కోసం విజయవాడ రాలేకపోయినవారు టీవీలో వీక్షించారు. వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభ ప్రాగంణం మొత్తం వైఎస్‌ జగన్‌ నినాదాలతో మారుమోగింది. వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. మరోవైపు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతు చేపట్టడాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన అప్‌డేట్స్‌..

గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన కేసీఆర్‌, స్టాలిన్
తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌ తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన కేసీఆర్‌, స్టాలిన్‌లు ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత తాడేపల్లిలో వైఎస్‌ జగన్‌ నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే.

కేసీఆర్‌, స్టాలిన్‌లకు వైఎస్‌ జగన్‌ విందు..
తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన కేసీఆర్‌, స్టాలిన్‌లకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అతిథి మర్యాదలు చేశారు. తన నివాసానికి వారిని ఆహ్వానించిన వైఎస్‌ జగన్‌.. వారికి విందు ఏర్పాటు చేశారు.

వైఎస్‌ జగన్‌కు రాష్ట్రపతి అభినందనలు..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అభినందనలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చాలని  ఆయన ఆకాక్షించారు.

వైఎస్‌ జగన్‌ నివాసానికి కేసీఆర్‌, స్టాలిన్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. అనంతరం వైఎస్‌ జగన్‌తో పాటు కేసీఆర్‌, స్టాలిన్‌లు తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ వారికి పుష్పగుచ్ఛాలు అందజేసిన వైఎస్‌ జగన్‌ వారిని సాదారంగా ఇంటిలోనికి ఆహ్వానించారు. కేసీఆర్‌ వెంట తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు కూడా అక్కడికి వెళ్లారు.

ఉద్వేగానికి లోనైన వైఎస్‌ విజయమ్మ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ‘నన్ను దీవించిన రాష్ట్ర ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆశీర్వదించిన దేవునికి, పైనున్న నాన్నగారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాధాభివందనం చేస్తున్నాన’ని తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలకు అభివాదం చేసిన వైఎస్‌ విజయమ్మ.. కాసింత ఉద్వేగానికి లోనయ్యారు. తన తనయున్ని అక్కున చేర్చుకున్నారు.  

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అవ్వతాతల పెన్షన్ పెంపుదలపై వైఎస్‌ జగన్‌ మొదటి సంతకం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అవ్వతాతల పెన్షన్‌ పెంపుదలపై తొలి సంతకం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ పెన్షన్‌ కింద వృద్దుల పెన్షన్‌ను రూ. 2000 నుంచి రూ. 2250కి పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇకపై వారి పెన్షన్‌ను ప్రతి ఏటా రూ. 250 పెంచుకుంటూ రూ. 3000 అందిస్తామని వెల్లడించారు. అదే విధంగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్‌, తమిళనాడు నేత, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, ఇతర పెద్దలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని కులమత వర్గాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి అందేలా చూస్తామని పేర్కొన్నారు. 

జగన్‌ చరిత్రలో నిలిచిపోవాలి: కేసీఆర్‌
ప్రమాణ స్వీకార వేదికపై నుంచి ప్రసంగించిన కేసీఆర్‌.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి తన పక్షాన, తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలని ఆయన ఆకాక్షించారు. వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో గోదావరి జలాల సంపూర్ణ వినియోగం వంద శాతం జరిగి తీరాలని కేసీఆర్‌ అన్నారు. కృష్ణా జలాలను సమస్యలను పరిష్కరించుకుని ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగన్‌ వయసు చిన్నది, బాధ్యత పెద్దదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి పేరు నిలబెట్టాలని వైఎస్‌ జగన్‌కు సూచించారు. చరిత్రలో నిలిచిపోయేవిధంగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. మూడు, నాలుగు టర్మ్‌ల వరకు వైఎస్‌ జగన్‌ పాలన కొనసాగాలని కేసీఆర్‌ కోరుకున్నారు.

తండ్రి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను : స్టాలిన్‌
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార వేదికపై ప్రసంగించిన స్టాలిన్ ఆయనకు అభినందనలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ తన తండ్రి దివంగత మహానేత వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నానని తెలిపారు.

వేదికపై వైఎస్‌ జగన్‌కు మత పెద్దల అశీర్వచనాలు
వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకార వేదికపై సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మత పెద్దలు అశీర్వచనాలు ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌, స్టాలిన్‌ అభినందనలు
ఆంధ్రప్రదేవ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌లు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ వైఎస్‌ జగన్‌ను శాలువతో సత్కరించారు.

వైఎస్‌ జగన్‌ కుటుంబసభ్యులకు గవర్నర్‌ శుభాకాంక్షలు
వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం గవర్నర్‌ అక్కడి విచ్చేసిన ఆయన కుటుంబసభ్యులను అప్యాయంగా పలకరించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ప్రమాణ స్వీకారోత్సవానికి అథితులుగా వచ్చిన కేసీఆర్‌, స్టాలిన్‌లను కూడా గవర్నరు పలకరించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ గవర్నర్‌కు వీడ్కోలు పలికారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వైఎస్‌ జగన్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేశారు. తొలుత జాతీయ గీతంతో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం గవర్నర్‌ ఆయ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్‌ నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాభినందనలు తెలిపారు. 

ప్రమాణ స్వీకార ప్రాగంణానికి చేరుకున్న గవర్నర్‌
గవర్నర్‌ నరసింహన్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార సభా ప్రాగంణానికి చేరుకున్నారు. 

ప్రమాణ స్వీకార వేదికపైకి చేరుకున్న వైఎస్‌ జగన్‌
సభా ప్రాగంణానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌ తొలుత ప్రత్యేక వాహనంలో స్టేడియంలో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ఆయన వేదికపైకి చేరుకున్నారు. 

సభా ప్రాంగణానికి చేరుకున్న కేసీఆర్‌, స్టాలిన్‌
కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. కేసీఆర్‌ వెంట తెలంగాణ మంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ సంతోష్‌లు ఉన్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అంతకు ముందే ప్రాంగణానికి చేరుకున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్‌ కూడా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. వేదికపై కేసీఆర్‌, స్టాలిన్‌లు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.

ఇంటి నుంచి బయలుదేరిన వైఎస్‌ జగన్‌
జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియానికి బయలుదేరారు. తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక కాన్వాయ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకార ప్రాంగణానికి పయనమయ్యారు. వైఎస్‌ జగన్‌ వెంబడి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, షర్మిల ఉన్నారు. మధ్యాహ్నం 12.23 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ వైఎస్‌ జగన్‌ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వేదిక వద్దకు కటుంబసమేతంగా కేవీపీ..
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆప్త మిత్రుడు కేవీపీ రామచంద్రరావు తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగే ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి చేరుకున్నారు.

వేదిక వద్దకు బయలుదేరిన వైఎస్‌ కుటుంబ సభ్యులు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వైఎస్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి బయలుదేరారు. 

విజయవాడ చేరుకున్న పుదుచ్చేరి మంత్రి మల్లాడి
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావడానికి పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున అధికారులు స్వాగతం పలికారు. ప్రముఖ చిత్రకారుడు బీఎస్వీ ప్రసాద్‌చే ప్రత్యేకంగా తయారు చేయించిన దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆయన వైఎస్‌ జగన్‌కు అందజేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం మొదటగా కేసీఆర్‌, మల్లాడి, స్టాలిన్‌లు వైఎస్‌ జగన్‌ను సత్కరించనున్నారు. 

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న స్టాలిన్‌..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం కోసం డీఎంకే అధినేత స్టాలిన్‌ గన్నవరం విమానశ్రయం చేరుకున్నారు. అక్కడ ఆయనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వాగం పలికారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రమాణ స్వీకారోత్సవానికి వీలైనంత త్వరగా వెళ్లాలని అభిమానులు భావించడంతో ఉదయం నుంచే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కిటకిటలాడుతోంది. స్టేడియం మొత్తం జగన్‌ నినాదాలతో మారుమోగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమకు కేటాయించిన గ్యాలరీల్లోకి చేరుకుంటున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావులతో పాటు పలు రాజకీయ పార్టీల ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. 

మరోవైపు తమ అభిమాన నాయకుడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడటానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయవాడ రాలేని వారు టీవీల్లో ఈ వేడుకను చూసేందుకు సిద్దమవుతున్నారు. ఉదయం నుంచే సామాన్య ప్రజలు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు భారీగా చేరుకోవడంతో 8 గంటల వరకే గ్యాలరీలు నిండిపోయాయి. గ్యాలరీల్లో ఉన్నవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం బయట కూడా ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top