అడుగున్నర మట్టికట్టపై ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిన్నారులు ప్రాణాలు పణంగా పెట్టి పాఠశాలకు వెళుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘సాక్షి’ కథనంపై స్పందించిన మానవ హక్కుల కమిషన్
సాక్షి, హైదరాబాద్: అడుగున్నర మట్టికట్టపై ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిన్నారులు ప్రాణాలు పణంగా పెట్టి పాఠశాలకు వెళుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఉప్పుటేరు మధ్యలో ఉండే పూడిలంక గ్రామస్తుల వ్యథపై రామా...ఏమి ‘సేతువు’రా...! శీర్షికన శనివారం ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన కమిషన్.. ఆర్డీవోతోపాటు పంచాయతీ, రోడ్లు, భవనాల శాఖ అధికారులను వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి, వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తీసుకున్న చర్యలను వివరిస్తూ మార్చి 3లోగా నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.