చలికాలం ఇంకా ముగియలేదు. శివరాత్రి పండుగను మంగళవారం జరుపుకున్నారు. ఎండాకాలం ప్రారంభం కానేలేదు.
కర్నూలు(అగ్రికల్చర్) : చలికాలం ఇంకా ముగియలేదు. శివరాత్రి పండుగను మంగళవారం జరుపుకున్నారు. ఎండాకాలం ప్రారంభం కానేలేదు. అయినా సూర్యుడు భగ్గుమంటున్నాడు. ఫిబ్రవరి మూడవ వారంలోనే ఎండలు మండుతున్నాయి. అబ్బో.. ఎండలు ఇప్పుడే ఇంత తీవ్రంగా ఉన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఇంకెలా ఉంటాయోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
గత ఏడాది ఫిబ్రవరి ఇదే సమయంతో పోలిస్తే పగటి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పైగా పెరిగాయి. గత ఏడాది ఫిబ్రవరి నెల 18వ తేదీన 33.3 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఉష్ణోగ్రత 37.3 డిగ్రీలకు పెరిగింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడాన్ని చూస్తే ఏప్రిల్, మే నెలల్లో 50 డిగ్రీలకు చేరే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటీవల వరకు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేవి. ఇందువల్ల రాత్రిళ్లు చలి వాతావరణం ఉండేది. కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండల తీవ్రత పెరగడం వల్ల శీతల పానీయాలకు, కొబ్బరి బోండాంలకు, నీళ్ల ప్యాకెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. జనవరి నెలతో పోలిస్తే శీతల పానీయాల అమ్మకాలు 50 శాతంపైగా పెరిగాయి. 2014లో జిల్లాలో తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేదు.
భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ఇందువల్ల గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. ఇందువల్ల ఎండల తీవ్రత పెరుగుతోంది. గత ఏడాది ఫిబ్రవరి నెల 14 నుంచి 18వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు కేవలం 31 నుంచి 33.3 డిగ్రీల వరకే ఉన్నాయి. ఈనెల 14 నుంచి 18 వరకు 35.6 డిగ్రీల నుంచి 37.3 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎండల తీవ్రత వల్ల శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు వెళ్లినవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఉష్ణోగ్రతలు పెరిగితే స్వైన్‌ఫ్లూ అదుపులోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.