వైఎస్సార్‌ హయాంలో ఉద్యాన విప్లవం

Horticultural Revolution In YSR Period - Sakshi

 ‘ఫ్రూట్‌ బౌల్‌ ఏపీ’గా అనంత ఖ్యాతి

వ్యవసాయ నష్టాల నుంచి గట్టెక్కిన అన్నదాతలు

వైఎస్‌ పాలనకు ముందు ..   ఆ తర్వాత పడకేసిన ఉద్యానం

సాక్షి, అనంతపురం అగ్రికల్చర్‌: అనంతపురం జిల్లాకు ‘ప్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ ఏపీ’గా  పేరు వచ్చిందంటే అదంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ప్రోత్సాహమే.. అని జిల్లాలో ఏ రైతును అడిగినా చెబుతారు. కరువు కాటకాలకు నిలయమైన ‘అనంత’లో వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో పండ్లతోటల విప్లవమే కొనసాగింది. ఆయన ఐదేళ్ల హయాంలో పండ్లతోటల రైతులకు వివిధ రూపాల్లో రూ.80 కోట్ల వరకు రాయితీలు కల్పించారు. కొత్తగా 45 వేల హెక్టార్లలో ఉద్యాన తోటలు విస్తరించాయి. 

వైఎస్సార్‌ రాయితీలతో పండ్లతోటల విస్తరణ..
ఉద్యాన పంటలంటే పెద్దగా తెలియని రైతులు కూడా వైఎస్‌ కల్పించిన రాయితీలను ఉపయోగించుకోవడంతో  మారుమూల ప్రాంతాల్లో సైతం పండ్లతోటలు విస్తరించాయి. ఫలితంగా వేరుశనగ పంట నష్టాలతో వ్యవసాయ జూదంలో దారుణంగా దెబ్బతింటున్న రైతులు కోలుకున్నారు. వ్యవసాయ పంటల స్థానంలో పండ్లతోటల సాగుపై దృష్టి సారించారు. ఓ వైపు పండ్ల తోటలకు రాయితీలు ఇచ్చిన వైఎస్సార్‌ అదే సమయంలో సూక్ష్మసాగు కింద డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీకి పెద్దపీట వేశారు. ఎస్సీ ఎస్టీలకు 100 శాతం, మిగతా రైతులకు 90 శాతం రాయితీతో అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్, స్ప్రింక్లర్లు ఇవ్వడంతో ఉద్యానతోటలు మూడు పవ్వులు, ఆరు కాయలు మాదిరిగా విరాజిల్లాయి.  

2004కు ముందు కొన్ని ప్రాంతాలకే పరిమితం..
వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన 2004కు ముందు వరకు జిల్లాలో కేవలం కొన్ని ప్రాంతాలకే పండ్లతోటలు పరిమితమయ్యాయి. 1995 నుంచి 2003 వరకు తొమ్మిదేళ్లు చంద్రబాబునాయుడు పాలించారు. అయినా ఉద్యానతోటల జాడ కనిపించలేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చీనీ, అరటి లాంటి రెండు మూడు రకాల పండ్లు,కూరగాయలు, పూలతోటలు 15 నుంచి 20 వేల హెక్టార్ల వరకు సాగులో ఉన్నాయి. పండ్ల తోటలంటే ఏమిటి, వాటి వల్ల ప్రయోజనాలేమిటి? ఎలా సాగు చేయాలి..పథకాలేంటి..? అమ్ముకోవడం ఎలా అనే విషయాలు జిల్లా రైతులకు ఏ మాత్రం తెలియని పరిస్థితి ఉండేది.  వ్యవసాయం దండగగా మారిందంటూ  ఆసమయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూడా వ్యవసాయాన్ని చిన్నచూపు చూసింది. దీంతో    రైతులు అనేక కష్టాలు పడ్డారు.  

వైఎస్సార్‌ రాకతో పండ్ల తోటల విప్లవం 
2004లో ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ వెంటనే రైతు సంక్షేమంపై దృష్టి సారించారు. విద్యుత్‌ బిల్లుల మాఫీతో పాటు ఉచిత కరెంటుకు శ్రీకారం చుట్టారు. వేరుశనగ వల్ల నష్టపోతున్న రైతుల దృష్టి పండ్లతోటల వైపు మళ్లించారు. పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీలు ప్రకటించారు. సూక్ష్మసాగుకు పెద్దపీట వేశారు. ఫలితంగా కరువు కోరల్లో చిక్కుకున్న అనంత రైతులు మెల్ల మెల్లగా పండ్లతోటల సాగుకు అడుగులు వేశారు. ఏడాది తిరగకముందే జిల్లాలో పండ్లతోటల విప్లవం కొనసాగింది. సమస్యల సుడిగుండం నుంచి బయటపడే మార్గం చూపించడంతో పండ్లతోటలు జిల్లా నలుమూలలా విస్తరించాయి.

వైఎస్సార్‌ మరణం తర్వాత..  
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణంతో జిల్లాలో పండ్లతోటల రైతుల పరిస్థితి 2004కు ముందు పరిస్థితులు గుర్తుకు తెస్తున్నాయి. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు పండ్లతోటల రైతులకు ఇస్తున్న రాయితీలకు కోతలు పెట్టారు. బడ్జెట్‌ బాగా తగ్గించేశారు. ఆ తర్వాత 2014లో మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినా ఉద్యానంపై చిన్నచూపు చూశారు. బడ్జెట్, పథకాలు, రాయితీలు బాగా తగ్గించేశారు. ఫలితంగా రాయితీలు, మార్కెటింగ్‌ సదుపాయం లేక పండ్లతోటల రైతులు బాగా నష్టపోతున్నారు. 

జీవనాధారం దొరికింది 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా  ఉన్నప్పుడు ఉపాధిహామి పధకంలో భాగంగా మాకున్న 3.50 ఎకరాల్లో గుంతలు తవ్వించి మామిడి మొక్కలు, డ్రిప్‌ ఉచితంగా అందజేశారు. దీంతో పాటు మూడేళ్ల పాటు ఎరువులు, కంచె వేయడానికి, ఎండి మొక్కల స్థానంలో కొత్తవి నాటుకునేందుకు డబ్బ సాయం చేశారు. ఇప్పుడు ఆ మామిడి తోట నుంచి ఏటా రూ.2లక్షలు ఆదాయం వస్తోంది. మా కుటుంబానికి జీవనాధారం ఆ తోటే. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలువ వల్లే మా కుటుంబం సంతోషంగా ఉంది.

– నరసింహారెడ్డి, బొడినేపల్లి, నల్లచెరువు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top