ప్రతి సీటు శానిటైజ్‌

A high level meeting was held by Thammineni Seetharam on Management of Budget meetings - Sakshi

ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సభ్యులందరికీ వైద్య పరీక్షలు: స్పీకర్‌ తమ్మినేని 

సమావేశాల నిర్వహణపై ఉన్నతస్థాయి భేటీలో చర్చించిన స్పీకర్‌

మీడియా పాయింట్‌ వద్ద కార్యకలాపాలు నిషిద్ధం

సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో శాసనసభ, శాసనమండలిలో అడుగడుగునా శానిటైజేషన్‌ చర్యలు చేపట్టారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా శాసనసభ ప్రాంగణం, లాబీల్లో రద్దీని బాగా తగ్గించాలని నిర్ణయించారు. కోవిడ్‌ నేపథ్యంలో అసెంబ్లీ, మండలిలో ప్రతి సీటును శానిటైజేషన్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ తెలిపారు. సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇతరులు ఎవరినీ అనుమతించరాదని నిర్ణయించినట్లు చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. బడ్జెట్‌ సమావేశాలను పురస్కరించుకుని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. శాసన మండలి ఛైర్మన్‌ ఎం.ఏ.షరీఫ్, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్రెడ్డి, విప్‌లు కొరుముట్ల శ్రీనివాసులు, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉభయ సభల నిర్వహణ, భద్రత, సభ్యుల ఆరోగ్యం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
అసెంబ్లీ ప్రాంగణంలో శానిటైజ్‌ చేస్తున్న సిబ్బంది 

తక్కువ రోజులే మేలు: బుగ్గన
ప్రస్తుత పరిస్థితుల్లో శాసనసభా సమావేశాలను వీలైనంత తక్కువ రోజులు నిర్వహించడమే శ్రేయస్కరమని భావిస్తున్నట్లు శాసనసభా వ్యవహారాలు, ఆర్థిక శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. శాసనసభ వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సమావేశాలను రెండు రోజులకు కుదించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున్నామని ఇలా జరగడం ఇదే తొలిసారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

అన్ని చానెళ్లకు లైవ్‌ ఫీడ్‌...
► శాసనసభా సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని మీడియా, పత్రికా ప్రతినిధులు తిలకించేందుకు వీలుగా సచివాలయంలోని మీడియా సెల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 
► అన్ని చానెళ్లకు లైవ్‌ ఫీడ్‌ కూడా ఇవ్వనున్నారు. పత్రికా విలేకరుల గ్యాలరీలోకి 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. మీడియా పాయింట్‌ వద్ద కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు. 
► మంత్రులు, క్యాబినెట్‌ హోదా ఉన్న వారికి ఇద్ద రు సహాయక సిబ్బందిని అనుమతిస్తున్నారు. 
► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహాయకులు, గన్‌మెన్లకు బయట ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 
► బడ్జెట్, పద్దుల వివరాలను పంపిణీ చేసే ఆర్థిక శాఖ సిబ్బంది కూడా త్వరగా పని ముగించుకుని వెళ్లి పోయే విధంగా ఏర్పాట్లు చేసి రద్దీని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు లెజిస్లేచర్‌ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు తెలిపారు.  

అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు
అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమీప ప్రాంతాల్లోనూ పోలీస్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. అసెంబ్లీ బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ సోమవారం సమీక్షించారు. పోలీస్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. 
► బందోబస్తు కోసం.. గుంటూరుతో పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిగోదావరి జిల్లాల నుంచి మొత్తం 3,080 మంది పోలీసులు, 105 మంది మార్షల్స్‌ అసెంబ్లీ ప్రాంతానికి చేరుకున్నారు. గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్‌ ఎస్పీల పర్యవేక్షణలో 17 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, 78 మంది ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 
► అసెంబ్లీ ఆవరణలోను, అసెంబ్లీకి వెళ్లే మార్గంలోను పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.  చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అనుమతి ఉన్న వాహనాలకే దారి ఇవ్వనున్నారు.
► అసెంబ్లీ ప్రాంతంలోను, సమీప ప్రాంతాల్లోను సెక్షన్‌ 144 అమలులోకి తెచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top