కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డికి ఊరట

High Court suspended two CBI cases on contractor Shekhar Reddy - Sakshi

రెండు సీబీఐ కేసులను కొట్టేసిన హైకోర్టు

సాక్షి ప్రతినిధి, చెన్నై: చట్ట విరుద్ధంగా నగదు చెలామణీ నెపంతో సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యుడు, ఇసుక కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డికి విముక్తి లభించింది. రెండు కేసులను మద్రాసు హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ‘మొదటి ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలు, అందులో చేసిన ఆరోపణలు, పెట్టిన సెక్షన్లనే ఆ తర్వాత నమోదు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌లలో కూడా పేర్కొన్నారు కాబట్టి, ఎలాంటి కొత్త అంశాలు లేవు కాబట్టి ఆ రెండు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేస్తున్నా’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఐటీ శాఖ ఇచ్చిన వివరాల ఆధారంగానే సీబీఐ కేసులు పెట్టింది తప్ప కొత్త ఆధారాలేవీ సేకరించలేదని వ్యాఖ్యానించారు.  శేఖర్‌రెడ్డి తదితరులపై రూ.34 కోట్ల కేసు మాత్రమే విచారణలో ఉంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో 2016 నవంబర్‌లో ఐటీ అధికారులు శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలలోనూ, అప్పటి సీఎస్‌ రామమోహన్‌రావు ఇంట్లోనూ సోదాలు జరిపారు.  శేఖర్‌రెడ్డి వ్యాపార భాగస్వాములైన శ్రీనివాసులు, ప్రేమ్‌కుమార్, దిండుగల్లు రత్నం, ముత్తుపేట్టై రామచంద్రన్‌లను అరెస్ట్‌ చేశారు. సీబీఐ, ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్‌ అధికారులు మూడు వేర్వేరు కేసులు పెట్టారు. ఒకే నేరంపై మూడు కేసులు పెట్టడాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో 2 కేసులను కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top