శనగ రైతుకు సాయం

Help to the peanut farmer - Sakshi

క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున సాయమందించేలా ఉత్తర్వులు జారీ 

ఒక్కో రైతుకు గరిష్టంగా రూ.45 వేల వరకు దక్కే అవకాశం 

రాష్ట్రంలో 75,000 మంది రైతులకు లబ్ధి.. రూ.333 కోట్లు విడుదల

రేపు రైతు దినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా నగదు సాయం

సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో అన్నదాతలకు ఇచ్చిన హామీకి కట్టుబడుతూ శనగ రైతులకు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున నగదు సాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఒక్కో శనగ రైతుకు గరిష్టంగా రూ.45 వేల వరకు నగదు సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇందుకోసం రూ.333 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిర్ణయంతో దాదాపు 75 వేల మంది రైతులకు మేలు చేకూరనుంది. సోమవారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో రైతు దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో శనగ రైతులకు నగదు అందచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. 

రుణాలు చెల్లించాలంటూ రైతులకు బ్యాంకుల నోటీసులు
రాయలసీమలోని కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాలతోపాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రైతులు ప్రధానంగా శనగ సాగు చేస్తున్నారు. టీడీపీ హయాంలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఈ పంట సాగువైపు మొగ్గు చూశారు. దీంతో సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2016–17లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం నాలుగు లక్షల హెక్టార్లు కాగా 2018–19లో 4.78 లక్షల హెక్టార్లకు పెరిగింది. రబీలో పండించే శనగలకు కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.4,620 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించింది. అయితే ఇది గిట్టుబాటు కాకపోవడంతో పలువురు రైతులు పంటను కోల్డు స్టోరేజీల్లో నిల్వ చేసుకుని బ్యాంకు రుణం తీసుకున్నారు. అయితే గిరాకీ లేదంటూ వ్యాపారులు పంట కొనుగోలు చేసేందుకు ముందుకు రావట్లేదు. మరోవైపు రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం కోసం శనగ రైతులు నెల రోజుల నుంచి ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి సానుకూల నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

రూ.333 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో దాదాపు 59 లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డు స్టోరేజీల్లో, 10 లక్షల క్వింటాళ్లు రైతుల వద్ద నిల్వ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నిల్వలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం రూ.333 కోట్లను విడుదల చేసింది. నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1,500 చొప్పున నగదు అందచేయనుంది. ఒక్కో రైతుకు ఎకరాకు గరిష్టంగా 6 క్వింటాళ్ల చొప్పున ఐదు ఎకరాల వరకు లేదా 30 క్వింటాళ్లకు ఈ నగదును ఆందచేస్తారు. ఫలితంగా ఒక్కో రైతుకు రూ.45 వేలు చొప్పున లబ్ధి చేకూరనుంది. 

ఈ–క్రాపింగ్‌ ద్వారా రైతుల వివరాల సేకరణ
కోల్టు స్టోరేజీ ప్లాంట్లలో నిల్వ చేసిన రైతులు 75 వేల మంది వరకు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం నుంచి ఆర్ధికసాయం అందనుంది. రైతు దినోత్సవం సందర్భంగా ఈనెల 8వ తేదీన వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో శనగ రైతులకు నగదు చెల్లింపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రైతులందరికీ నగదు అందించేలా వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు ఏర్పాట్లు ప్రారంభించాయి. గిడ్డంగుల్లో పంట నిల్వ చేసిన రైతుల వివరాలు, పంట సాగు చేసిన అన్నదాతల వివరాలను ఈ–క్రాపింగ్‌ ద్వారా గుర్తించి నగదు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధనరెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొందరు ఇక్కడి రైతుల నుంచి శనగలు కొనుగోలు చేసి వారి పేరుతో కోల్డు స్టోరేజీల్లో నిల్వ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని, అనర్హులకు నగదు సాయం అందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. 

రైతులకు అన్ని రకాలుగా భరోసా కల్పిస్తాం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టపోయిన వారిని ఆదుకుంటాం. ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలను ధరల స్ధిరీకరణ నిధితో ఆదుకుంటాం  
    – ఎన్నికల సమయంలో రైతులకు వైఎస్‌ జగన్‌ హామీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top