అకాల వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా అకాల వర్షాలు పడుతున్నా యి.
మొయినాబాద్, న్యూస్‌లైన్: అకాల వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా అకాల వర్షాలు పడుతున్నా యి. శుక్రవారం సాయంత్రం మొయినాబాద్‌లో భారీ వర్షం పడింది. మండల కేంద్రంతోపాటు అమీర్‌గూడ, పెద్దమంగళారం, చిలుకూరు, హిమాయత్‌నగర్, ఎనికేపల్లి, అజీజ్‌నగర్ తదితర గ్రామాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మండల పరిధిలోని నాగిరెడ్డిగూడలో కూరగాయ పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి.
వర్షంతోపాటు ఈదురుగాలులు వీయడంతో మండల కేంద్రంలో హైదరాబాద్-బీజాపూర్ రహదారి పక్కన ఓ వేపచెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడింది. దాంతో రెండు కరెంట్ స్తంభాలు విరిగాయి. సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో పాఠశాలలు, కళాశాలల నుంచి ఇళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై నీళ్లు నిలువడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మరోవైపు అకాల వర్షాలతో గ్రామాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జలమయమైన రహదారులు
శంషాబాద్: రహదారులు జలమయమయ్యాయి... రాకపోకలు స్తంభించాయి.. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల శంషాబాద్ పట్టణంలో జనజీవనం స్తంభించింది. పట్టణంలోని మధురానగర్, ఆర్బీనగర్, పాతపోలీస్‌స్టేషన్ ప్రాంతాల్లో వాననీటితో రోడ్లన్నీ నిండిపోయాయి. బస్టాండ్‌లోరి భారీగా వరదనీరు చేరింది. టాప్‌బేకరి చౌరస్తా నుంచి డ్రెయినేజీ నీళ్లు భయటికి పొంగడంతో నడుచుకుంటూ వెళ్లే వారు నరకయాతన అనుభవించారు. రాళ్లగూడ రహదారిలో కూడా డ్రెయినేజీ నీరు పొంగి ప్రవహించింది. దేనా బ్యాంకు సమీపంలో చెట్లకొమ్మలు నెలకొరిగాయి. గాలులతో కూడిన వర్ష రావడంతో హోర్డింగులపై ఉన్న బొమ్మలు చెల్లాచెదురయ్యాయి.
రోడ్లన్నీ జలమయం
ఇబ్రహీంపట్నం: పట్నంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం పడింది. దీంతో పలు బస్తీల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మండల పరిధిలోని పలు గ్రామాల్లో కూడా వర్షం పడటంతో పాటుఈదురు గాలులు వీచాయి.
వర్షంతో కాంగ్రెస్ ధూం ధాం రద్దు
భారీ వర్షం పడటంతో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలో నిర్వహించ తలపెట్టిన ధూం ధాం కార్యక్రమం కాస్తా రద్దయ్యింది. మండల కేంద్రంలోని ఓసీ కమ్యూనిటీ హాలు ఆవరణలో కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ వర్షం ంతో ధూంధాం కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు రద్దు చేసుకున్నారు. వర్షం వల్ల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి రాలేకపోయారు.