పింఛన్ల పండుగ.. ప్రాణం మీదకొచ్చింది 

Handicap Problems Pension Distribution Prakasam - Sakshi

ఒంగోలు టౌన్‌/కంభం: పండుగ పింఛన్‌దారుల ప్రాణం మీదకు వచ్చింది. ఇప్పటివరకు అందుకుంటున్న పింఛన్ల మొత్తాన్ని పెంచిన ప్రభుత్వం వారి ఇళ్ల వద్ద ఇవ్వకుండా అందరినీ ఒకచోటకు రప్పించి పండుగ పేరుతో ఇవ్వాలన్న ప్రయత్నం లబ్ధిదారుల ప్రాణం మీదకు తెచ్చిపెట్టింది. ఇప్పటివరకు ఇళ్ల వద్ద ప్రశాంతంగా అందుకుంటున్న పింఛన్లను గుంపులు గుంపులుగా ఒక్కచోట చేర్చారు. ఒంగోలు మినీ స్టేడియం వద్దకు పిలిపించిన యంత్రాంగం అక్కడ ప్రసంగాలు జరిగేలోపు పండుటాకులు నీరసపడిపోయారు.

కొందరు పింఛన్ల పెంపు మొత్తాన్ని అందుకోకుండానే స్పృహ తప్పి పడిపోయి ఆస్పత్రి పాలయ్యారు. ఒక వృద్ధురాలు తలకు గాయం కూడా అయింది. ఇవేమీ పట్టించుకోని యంత్రాంగం వరుసపెట్టి ప్రసంగాలు చేసుకుంటూ వెళుతూ పింఛన్‌దారులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను వారిపాటికి వారిని వదిలేశారు. దీంతో అనేకమంది పింఛన్‌దారుల్లో తాము రెట్టింపు పింఛన్‌ పొందామన్న ఆనందం కంటే ప్రాణాలమీదకు తెచ్చుకున్నామన్న ఆవేదనే కనిపించింది.

జన జాతర..
సామాజిక భద్రతా పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. వృద్దాప్య, వితంతు, దివ్యాంగులతోపాటు ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, హిజ్రాలందరినీ ఒకేచోటకు తీసుకువచ్చి వారికి పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో పొదుపు గ్రూపు మహిళలకు పసుపు, కుంకుమ కింద ప్రతి గ్రూపు సభ్యురాలుకు పదివేల రూపాయల చొప్పున దశలవారీగా ఇస్తామని ప్రకటించి వారిని కూడా ఒకేచోటకు తరలించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒంగోలు నగర పాలక సంస్థ పింఛన్‌దారులను, మెప్మా పొదుపు గ్రూపు సభ్యులను తరలించే బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు.

శనివారం నుండి సోమవారం వరకు పింఛన్లు, పొదుపు గ్రూపు మహిళలకు నగదును అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలిరోజైన శనివారం 1æ నుంచి 16 డివిజన్ల వరకు పింఛన్లు, పొదుపు గ్రూపు మహిళలను మినీ స్టేడియంకు తరలించారు.  ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేశారు. డివిజన్‌ కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పింఛన్‌దారులు, పొదుపు గ్రూపు మహిళల తరలింపు కార్యక్రమం చేపట్టారు. ఉదయం ఎనిమిది గంటలకే పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు మినీ స్టేడియంకు వచ్చారు. ముఖ్యమంత్రి సభను తలపించే విధంగా మినీ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు.

అంతా గందరగోళం..
పింఛన్ల కోసం వేలాదిగా మినీ స్టేడియానికి చేరుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌కు సంబంధించిన వ్యక్తిగత ప్రచార ఫెక్సీలే అధికంగా ఉన్నాయి. ప్రాంగణమంతా మహిళలతో నిండి ఉండటంతో ఎవరు ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వారిని సరిగా గైడ్‌ చేసేవారు లేకపోవడంతో బారికేడ్లకు అటూ ఇటూ తిరగడానికి ఎక్కువ సమయం పట్టింది. చివరకు తమకు కేటాయించిన కౌంటర్ల వద్దకు వెళ్లేసరికి అక్కడ గుంపులు గుంపులుగా ఉండటంతో ఆ రద్దీని తట్టుకోవడం అనేక మందికి ఇబ్బంది కలిగించింది. ముఖ్యంగా పింఛన్ల కోసం వచ్చిన వారిలో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 

స్పృహ తప్పి తలకు గాయమై..
ముక్తినూతలపాడుకు చెందిన మాణిక్యమ్మ వృద్ధాప్య పింఛన్‌ తీసుకునేందుకు వచ్చింది. ఉదయం తొమ్మిది గంటలకల్లా ఒంగోలు మినీ స్టేడియానికి చేరుకొంది.  పింఛన్‌ తీసుకునేందుకు అటూ ఇటూ తిరగడంతో స్పృహ తప్పి పడిపోయింది. చివరకు తలకు గాయమైంది.

108వాహనంలో రిమ్స్‌కు
పింఛన్లు పొందేందుకు వచ్చిన వారిలో కొంతమంది వృద్ధులు స్పృహ తప్పి పడిపోయారు. అక్కడ వైద్య బృందానికి ఈ సమాచారం చేరవేయడంతో హుటాహుటిన 108ను రప్పించి రిమ్స్‌కు తరలించారు. కాపు కళ్యాణ మండపం వద్ద నివసిస్తున్న దానమ్మ, ముక్తినూతలపాడుకు చెందిన వరికూటి వెంకాయమ్మ, గోపాలనగర్‌కు చెందిన సుబ్బరావమ్మలు స్పృహ తప్పి కింద పడటంతో వారిని రిమ్స్‌కు తరలించారు.

‘భోజన’ పాట్లు
పిం
ఛన్లు పొందేందుకు, పసుపు కుంకుమ కింద నగదు తీసుకునేందుకు వేలాది మంది మహిళలు మినీ స్టేడియం వద్దకు చేరుకున్నారు. అయితే వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసినట్లు నగర పాలక సంస్థ కమీషనర్‌ ప్రకటించారు. మినీ స్టేడియం పక్కనే ఉన్న స్థలంలో షామియానాలు ఏర్పాటుచేసి భోజనాలు పెట్టారు. వందలాది మంది రావడంతో భోజనాలకు ఇబ్బంది పడ్డారు. చివరకు భోజనం ప్లేట్ల కోసం ఎగబడాల్సిన దుస్థితి నెలకొంది. చివర్లో వచ్చిన వారికి పెరుగుతో సరిపుచ్చారు. ఎన్‌సీసీ క్యాడెట్లు, నర్సింగ్‌ స్టూడెంట్లను ఈ కార్యక్రమానికి వినియోగించుకున్నారు. అయితే ఎన్‌సీసీ క్యాడెట్ల చేత దామచర్ల జనార్ధన్‌రావు పేరుతో తెలుగుదేశం పార్టీ తరపున ముద్రించిన క్యాలెండర్లను మహిళలకు పంపిణీ చేయించడంపట్ల విమర్శలు వినిపించాయి. కార్యక్రమానికి హాజరైన మహిళల నుదుటున కుంకుమతోపాటు గంధం పూశారు.

పని పోగొట్టుకొని వచ్చా:  లాజర్‌
చిన్న తనం నుంచే తన కుమారుడు నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. మంచానికే పరిమితమైన తన కుమారుడికి పింఛన్‌ ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడకు వచ్చి పింఛన్‌ తీసుకోకుంటే ఇవ్వమని చెప్పారు. దాంతో తాను పని పోగొట్టుకొని తన కుమారుడిని తీసుకువచ్చాను. ఇక్కడ గంటల తరబడి ఉన్నా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. పెరిగిన పింఛన్‌ కోసం కనిపించిన ప్రతి ఒక్కరినీ అడిగాను. అయినప్పటికీ పట్టించుకోలేదు. పెంచిన పింఛన్‌ ఇళ్ల వద్ద ఇస్తే బాగుంటుంది. ఇలా ఇక్కడకు తీసుకువచ్చి ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నాడు కేశవరాజుగుంటకు చెందిన గద్దల లాజర్‌.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top