గెస్ట్‌ ఫ్యాకల్టీ ఇంటర్వ్యూలు రద్దు

Guest Faculty Interviews Are Cancelled In Etcherla  - Sakshi

సాక్షి, ఎచ్చెర్ల(శ్రీకాకుళం) : జిల్లా యూనిట్‌గా బాలయోగి గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ కోసం బుధవారం జరగాల్సిన ఇంటర్వ్యూలు రద్దు కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. వాస్తవానికి ఈ రద్దు ప్రకటన మంగళవారం విడుదల చేసినప్పటికీ అనేక మంది అభ్యర్థులు ఎచ్చెర్లలోని  ఇంటర్వ్యూ కేంద్రానికి హాజరయ్యారు. ఒక్కరోజు ముందు ఇంటర్వ్యూలు ఎలా రద్దు చేస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు.

గురుకులాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ కోసం ఏటా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లాలో బాలయోగి పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు 12 ఉన్నాయి. ఇందులో బాలికలు పాఠశాలలు 8, బాలుర పాఠశాలలు 4 ఉన్నాయి. మొత్తం 107 గెస్ట్‌ ఫ్యాకల్టీ(అతిథి బోధకులు) అవసరం. పాఠశాల స్థాయి బోధకులకు రూ.14 వేలు, జూనియర్‌ కళాశాల పరిధిలో పనిచేసే వారికి రూ.18 వేలు వేతనం ఇస్తారు.వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులకు ఖరారు చేస్తారు. వీరిని 10 నెలలు కొనసాగిస్తారు.ఈ ఏడాదికి సంబంధించి  జిల్లా బాలయోగి గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్టినేటర్‌ వై.యశోదలక్ష్మి ఇటీవల ప్రకటన విడుదల చేశారు.

జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఎచ్చెర్ల బాలయోగి గురుకుల పాఠశాలలో బుధవారం ఇంటర్వ్యూలు జరగాల్సి ఉంది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత వారినే కొనసాగించాలంటూ బాలయోగి గురుకుల రాష్ట్ర కార్యదర్శి రాములు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇంటర్వ్యూల రద్దు ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, టెక్కలితో పాటు విజయంనగరం జిల్లా నుంచి వందలాది మంది అభ్యర్థులు వచ్చారు. ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లు ముందు రోజు ఎలా ప్రకటిస్తారని స్థానిక ప్రిన్సిపాల్‌ ఉషారాణిని నిలదీశారు. కార్యదర్శి ఉత్తర్వుల మేరకు రద్దు చేసినట్లు ఆమె స్పష్టం చేయడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top