కళాఖ్యాతి.. గడప దాటి

Gudipalli Somashekhar Excels In Fine Arts - Sakshi

100 గ్రామాల్లో 250పైగా చిత్రాలతో చైతన్యం 

ఆంధ్ర–కర్నాటకలో కరోనాపై చైతన్య కార్యక్రమాలు 

వైవీయూ విద్యార్థి సోమశేఖర్‌ ‘కళా’త్మక సేవ 

అభినందించిన కేంద్రమంత్రి, వైవీయూ అధికారులు 

యోగివేమన విశ్వవిద్యాలయం లలితకళల విభాగం విద్యార్థి గుడిపల్లి సోమశేఖర్‌  తాను అభ్యసించిన లలిత‘కళ’ను సమాజ హితానికి వినియోగిస్తున్నాడు.. కరోనా సమయంలో ప్రజల్లో కోవిడ్‌–19 నియంత్రణ పట్ల అవగాహన పెంపొందించాల నుకున్నాడు. అనుకున్నట్లే తన కుంచెకు ప్రాణం పోశాడు. అనంతపురం జిల్లాలో తన పెయింటింగ్స్‌ ద్వారా కరోనాపై అవగాహన కల్పించేలా మాస్క్‌ ధరించాలంటూ చిత్రాలతో సందేశం ప్రారంభించాడు. ఈయనకు కలిగిన ఆలోచనకు విశ్వవిద్యాలయ అధికారులు ప్రోత్సాహం అందించడంతో తన కుంచెతో కర్నాటక రాష్ట్రం వరకు చైతన్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు.. ఈయన సేవలను గుర్తించిన కేంద్ర క్రీడలు, యువజనశాఖ మంత్రి కిరణ్‌ రిజీజు సోషల్‌మీడియా వేదికగా సోమశేఖర్‌ను అభినందించాడు. 

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయంలో లలితకళల విభాగంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ ఫైనలియర్‌ చదువుతున్న గుడిపల్లి సోమశేఖర్‌ లలితకళల్లో రాణిస్తున్నాడు. గతంలో పలు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ఎన్నో బహుమతులు, పతకాలు సాధించాడు. కరోనా మహమ్మారి విజృంభించడంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీంతో విశ్వవిద్యాలయం నుంచి తన స్వగ్రామం అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి గ్రామానికి వెళ్లాడు. ప్రజల్లో కరోనా పట్ల అవగాహన పెంపొందించాలన్న ఆలోచన మెదిలింది. దీంతో తన సొంత ఖర్చులతో తొలుత గ్రామాల్లోకి వెళ్లి మాస్క్‌ ధరించాలని చెబుతూ అక్కడి గ్రామస్తులు మాస్క్‌ ధరించి ఉన్న చిత్రాలను వేస్తూ వారిలో చైతన్యం తీసుకువచ్చారు. ఇలా ఏప్రిల్‌ నెలలో ప్రారంభించిన ఈ చైతన్య కార్యక్రమం నేటికీ కొనసాగుతుండటం విశేషం.

వైవీయూ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎ. మధుసూదన్‌రెడ్డి ‘‘నీవు చేస్తున్న సేవలను విస్తరించమని’’చెబుతూ ప్రోత్సహించారు. దీంతో అనంతపురం జిల్లాలోని పలు గ్రామాలకు తన బైక్‌పైన వెళ్లడం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే చిత్రాలు వేస్తూ అక్కడి ప్రజల్లో కోవిడ్‌–19పై అవగాహన కలి్పస్తూ వచ్చారు. ఇలా ఒక్కో గ్రామం దాటుకుంటూ కర్నాటక రాష్ట్రంలో సైతం ఇదే చైతన్య ప్రక్రియను కొనసాగించారు. ఈయన చిత్రాలు అందరినీ ఆలోచింపచేస్తుండటంతో పలువురు గ్రామప్రజలు మా గ్రామాలకు వచ్చి వేయాలంటూ ఆహ్వానించడం విశేషం. ఇలా ఇప్పటి వరకు కర్నాటక రాష్ట్రంలో 48 గ్రామాల్లో చిత్రాలు వేశాడు.  

ప్రశంసల వర్షం 
సోమశేఖర్‌ సేవలను ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు కొనియాడారు. వైవీయూ విద్యార్థి తన కళ ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ విశ్వవిద్యాలయ ఖ్యాతిని చాటిచెప్పడం పట్ల విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజి్రస్టార్‌ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్, ప్రిన్సిపాల్‌ ఆచార్య జి. సాంబశివారెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎ. మధుసూధన్‌రెడ్డి, లలితకళల విభాగం అధ్యాపకులు డాక్టర్‌ మూల మల్లికార్జునరెడ్డి, కోట మృత్యుంజయరావు తదితరులు అభినందనలు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top