తాడిపత్రిలో ‘లగాన్‌ గ్యాంగ్‌’

Granite smuggling halchal in anantapur district - Sakshi

గ్రానైట్‌ అక్రమ రవాణాలో కీలక పాత్ర  

ఏటా రూ.కోట్లలో ధనార్జన

స్థానిక పెద్ద మనుషుల అండదండలు 

అడ్డొస్తే బెదిరింపుల పర్వం

కన్నెత్తి చూడని అధికారులు    

యథేచ్ఛగా సాగుతున్న దందా

అనగనగా ఓ పెద్దమనిషి. ఆయన వద్ద ఓ పెద్ద కోటరీ. తన ప్రాంతంలో ఎవరు ఏ పెద్ద వ్యాపారం చేయాలన్నా.. ఆయనకు కప్పం కట్టాలి. కాదు.. కూడదు అంటే ఊరుదాటాలి. దారికి రాని వారిని దెబ్బతీయడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. ఆ ప్రాంతంలో పోస్టింగ్‌ కావాలన్నా ఆశీస్సులు తప్పనిసరి. వచ్చిన తర్వాత ‘జీ..హుజూర్‌’ అనకపోతే హూస్టింగ్‌కు సిద్ధం కావాల్సిందే. ఇప్పుడంతా అక్కడ ఆయన కనుసన్నల్లోనే వ్యవహారం సాగుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. గ్రానైట్‌ అక్రమ రవాణా సదరు పెద్దాయనకు కాసులు కురిపిస్తోంది. ఆయన చాటున.. ‘లగాన్‌ గ్యాంగ్‌’ దందా అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది.

సాక్షి, అనంతపురం: తాడిపత్రి చుట్టుపక్కల ఎక్కడా క్వారీలు లేవు. చిత్తూరు, ఒంగోలు, పొదిలి, కనిగిరి, కృష్ణగిరి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఒక లోడు గ్రానైట్‌ బండలు క్వారీ నుంచి తాడిపత్రి చేరాలంటే రూ.45వేల నుంచి రూ.50వేల వరకు రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే లగాన్‌ గ్యాంగ్‌ రాయల్టీ లేకుండా రవాణా చేస్తామని క్వారీ, పాలిష్‌ మిషన్‌ వ్యాపారులతో ఒప్పందం చేసుకుంటోంది. 

గ్రానైట్‌ లారీ క్వారీ నుంచి.. తాడిపత్రి నుంచి పాలిష్‌ గ్రానైట్‌ బండల లారీలు బయలుదేరగానే నాలుగు పైలెట్‌ వాహనాలు బరిలోకి దిగుతాయి. దారిలో చెక్‌ పోస్టులు, అధికారులు ఎవరు ఆపినా ఈ గ్యాంగ్‌ ‘కార్యం’ చక్కబెడుతుంది. లోడును గమ్యం చేర్చినందుకు రూ.20వేల నుంచి రూ.30వేలు వసూలు చేస్తారు. రాయల్టీతో పోలిస్తే తక్కువ మొత్తానికి పని జరుగుతుండటంతో వ్యాపారులు ‘జీరో’ వైపునకు మొగ్గు చూపుతున్నారు.

విజిలెన్స్‌ కళ్లుగప్పి అక్రమ రవాణా
విజిలెన్స్‌ అధికారులు వస్తే అప్రమత్తమై వారి నుంచి దారి తప్పించే చర్యలకు ‘పైలెట్లు’ ఉపక్రమిస్తారు. అలాగే లారీలో ఉన్న గ్రానైట్‌ పరిమాణానికి బిల్లులో తక్కువ చూపించి రవాణా చేస్తారు. ఒకే బిల్లుతో 5–6లోడ్లు తరలిస్తారు. ఈ మొత్తం తతంగంలో అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి బాగోగులు చూసుకుంటారు. జోరో బిజినెస్‌ చేసేందుకు క్వారీ, మిషన్‌ వ్యాపారులతో బేరం కుదుర్చుకుని ఆ డబ్బును ‘తాడిపత్రి పెద్దమనిషి’కి కప్పం రూపంలో ముట్టజెబుతారు. ఆయన తన పీఏ ద్వారా ‘గ్రానైట్‌ మాఫియా’కు కొద్దిమేర చిల్లర విదిల్చి తక్కిన డబ్బు వేనకేసుకుంటున్నారు. ఇలా రోజూ లక్షల రూపాయలను అప్పనంగా ఆర్జిస్తున్నారు.

రెండేళ్లు బ్రేక్‌.. మళ్లీ యథేచ్ఛగా దందా
భూగర్భ గనుల శాఖ విజిలెన్స్‌ ఏడీగా ప్రతాప్‌రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలో సాగుతున్న అక్రమాలను చూసి నివ్వెరపోయారు. లారీలను ఆపి బిల్లులు అడిగితే లేవని చెప్పేవారు. దీంతో పెనాల్టీ రాయడం మొదలుపెట్టారు. అయితే ఆ వెంటనే ‘పెద్దమనిషి పీఏ’ నుంచి ఏడీకి ఫోన్‌ వచ్చేది. ‘తాడిపత్రి వెహికల్స్‌పై స్టిక్కర్‌ చూడలేదా? అవి ఎవరివో తెలియదా? పెనాల్టీ వేశావు, నువ్వే చెల్లించి రశీదు తీసుకో!’ అని దబాయించేవారు. అయినప్పటికీ విజిలెన్స్‌ ఏడీ బెదరకుండా వాహనాలను సీజ్‌ చేశారు. ఇలా రెండేళ్లలో గ్రానైట్‌ అక్రమదందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా కోటి రూపాయలు పెనాల్టీ రూపంలో వసూలయ్యేది. 2015–16లో రూ.5.40కోట్లు, 2016–17లో రూ.5.55కోట్లు రాబట్టారు. దీంతో ప్రతాప్‌రెడ్డిని మొదట దారికి తెచ్చుకోవాలని చూశారు. ఆ తర్వాత బెదిరించారు. చివరకు అవినీతి మరకలంటించేందుకు డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు వచ్చి ఇతనికి క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై భౌతిక దాడులకు యత్నించారు. 

తెలిసినా.. కన్నెత్తి చూడని అధికారులు
తాడిపత్రిలో గ్రానైట్‌ మాఫియా సాగిస్తోన్న అక్రమ దందా భూగర్భ గనుల శాఖ అధికారులకు తెలియనిది కాదు. అయితే ‘లగాన్‌ గ్యాంగ్‌’తో సత్సంబంధాలు ఉండటంతో వారంతా చూసీచూడనట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రతాప్‌రెడ్డి అడ్డుపడి కొరకరానికి కొయ్యగా తయారైతే అనంతపురంలోని గనులశాఖ అధికారులు ప్రతాప్‌రెడ్డికి కాకుండా ‘మాఫియా’కు మద్దతుగా నిలిచారు. ఇదంతా కోట్లాది రూపాయల అక్రమాదాయం వల్లేననే విషయం రాష్ట్రస్థాయి అధికారులకు కూడా స్పష్టంగా తెలుసు. గ్రానైట్‌ వ్యాపారులను గుప్పిట్లో పెట్టుకుని సదరు పెద్దమనిషి కోట్ల రూపాయలు గడిస్తూ రాజకీయాల్లో మునిగితేలుతున్నారు. కానీ ఏ ఒక్క అధికారి కూడా తాడిపత్రి వైపు, ఇక్కడి అక్రమ వ్యాపారం వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. 

ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన ప్రతాప్‌రెడ్డి
తాడిపత్రి గ్రానైట్‌ మాఫియాతో తనకు ప్రాణహాని ఉందని గుత్తి విజిలెన్స్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి ఆగస్టు 2న భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌కు లేఖ రాశారు. అందులో ఐదుగురి పేర్లు పొందుపరిచారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రారెడ్డిని నంబర్‌–1గా పేర్కొన్నారు. తాడిపత్రి గ్రానైట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు, సూర్యముని, ఎం.సుబ్బారావు అనే వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉన్నట్లు వెల్లడించారు. వీరందరిపై కేసులు ఉన్నాయని కూడా ఫిర్యాదులో వివరించారు. గత రెండేళ్లుగా గ్రానైట్‌ అక్రమ రవాణాకు ప్రతాప్‌రెడ్డి కొద్దిమేర బ్రేక్‌ వేశారు. ఈ క్రమంలో ‘గ్రానైట్‌ మాఫియా’ పెద్దమనిషి వద్దకు వెళ్లి అతన్ని బదిలీ చేయించాలని పట్టుబట్టింది. గ్రానైట్‌ ద్వారా వచ్చే ఆదాయం భారీగా ఉండటంతో భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావుకు చెప్పి ప్రతాప్‌రెడ్డిని 2017 అక్టోబర్‌ మూడోవారంలో బదిలీ చేయించారు. ఆయన బదిలీ తర్వాత దందా యథేచ్ఛగా సాగుతోంది.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top