గ్రానైట్‌ వాణిజ్యంతో ఖజానాకు గండి | Granite Business Gives Damage To Government Treasure | Sakshi
Sakshi News home page

గ్రానైట్‌ వాణిజ్యంతో ఖజానాకు గండి

Aug 29 2019 11:34 AM | Updated on Aug 29 2019 11:34 AM

Granite Business Gives Damage To Government Treasure - Sakshi

సాక్షి, విజయవాడ: వాణిజ్యపన్నులశాఖలో క్రిందస్థాయి సిబ్బంది చేతివాటం ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. రాజధాని ప్రాంతంలో వసూలు కావాల్సిన లక్షలాది రూపాయలు పక్కదారి పడుతున్నాయి. నగరం మీదగా వెళ్లే లారీలను తనిఖీ చేసి వేబిల్లులు సరిగా లేని, పన్నుల చెల్లించని లారీలపై కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు వేసేందుకు అధికారులు ప్రయత్నింస్తుంటే.. తమకున్న అనుభవంతో అధికారుల కళ్లు కప్పి లారీలను ఈశాఖలో పనిచేసే డ్రైవర్లు, అటెండర్లు తప్పిస్తున్నారు.

రూ. 6 లక్షల గ్రానైట్‌ ఎగుమతి
ఒంగోలు నుంచి మహారాష్ట్రకు గ్రానైట్‌ భారీగా ఎగుమతి అవుతుంది. ప్రతి నిత్యం పది నుంచి 15 లారీల్లో గ్రానైట్‌ రవాణా జరుగుతుంది. ఒక్కో లారీలో కనీసం రూ.6 లక్షలు విలువైన గ్రానైట్‌ రాళ్లు ఎగుమతి జరుగుతాయి. గ్రానైట్‌పై జీఎస్టీ 18శాతం. ఈ లెక్కన కనీసం ఒక్కో లారీకి రూ.లక్ష వరకు పన్ను వసూలు కావాలి . అయితే అంత పన్ను చెల్లించడానికి డీలర్లు సుముఖంగా వుండటం లేదు. దీంతో దొడ్డిదారిలో సరుకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అధికారులు స్వాధీనం చేసుకున్న గ్రానైట్‌ లారీలు (ఫైల్‌)

‘కోటీ’శ్వరుడు తలుచుకుంటే....
వాణిజ్యపన్నులశాఖలో అధికారులు వద్ద ఒక డ్రైవర్‌ ఎంతోకాలంగా పనిచేస్తున్నాడు. ఆయన డిపార్టుమెంట్‌లో తాత్కాలిక ఉద్యోగులు, డ్రైవర్లు, అటెండర్లతో ఒక టీమ్‌ను తయారు చేశారు. ఈ కోటీశ్వరుడు తలుచుకుంటే చాలు... గ్రానైట్‌ తో పాటు ఏ సరుకు రవాణా చేసే లారీనైనా సురక్షితంగా జిల్లాను దాటిస్తారని డీలర్ల నమ్మకం. ఒంగోలు, గుంటూరు మీదగా తాడేపల్లికి వచ్చే లారీల డ్రైవర్లు ముందుగా ఈ టీమ్‌లోని వారి సమాచారం అందిస్తారు. వారి ద్వారా  టీమ్‌ లీడర్‌కు సమాచారం అందుతుంది. ఆ రోజు ఏ అధికారి ఎక్కడ వాహనాలు తనిఖీ (వీటీ) చేస్తున్నారో తెలుసుకుని ఆ మార్గంలో కాకుండా మరోక మార్గంలో లారీలను కంచికచర్ల, పెనుగంచిప్రోలు వరకు తప్పిస్తారు. 

అక్కడ నుంచి హైదరాబాద్‌ రూట్‌లో మహారాష్ట్ర వెళ్లేలా ఏర్పాటు చేస్తారు.  తాడేపల్లి నుంచి ఒక్కక్క లారీని కాకుండా ఆరేడు లారీలను ఒకేసారి తీసుకువచ్చి తప్పిస్తారని ఆశాఖలోనే చర్చించుకుంటున్నారు. కాగా అధికారులు అనుమానం రాకుండా ఒకటి రెండు లారీలను ఈ రూట్‌లోకి పంపుతారు. మిగిలిన వాటిని మరో మార్గంలో తప్పిస్తారు. గతంలో ఇదే తరహాలో పట్టుకున్న వ్యాన్‌ను తప్పించగా.. ఆగ్రహించిన డీసీటీవో ఒకరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులు కన్ను గప్పి తప్పిపోయిన వ్యాన్‌ను వెంటనే వెనక్కు రప్పించిన ఘనత ఈటీమ్‌ నాయకుడుకు ఉంది. లారీ యజమానులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చి లారీని పట్టిస్తారని, అలాగే తప్పిస్తారని చెబుతున్నారు. 

ప్రతిదానికీ ఒకో రేటు
ఒక్కో గ్రానైట్‌ లారీని సురక్షితంగా తప్పిస్తే రూ.5వేలు వరకు వసూలు చేస్తారు. ఈ విధంగా ఆ డ్రైవర్‌ ‘కోటీశ్వరుడు’ అయ్యారని వాణిజ్యపన్నులశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తన వద్ద టీమ్‌ను మెయిటెన్‌ చేస్తూ రోజుకు ఐదు నుంచి 8 లారీల వరకు తప్పిస్తారని చెబుతున్నారు. కేవలం గ్రానైట్‌ కాకుండా నగరానికి వచ్చే రెడీమేడ్, ఎలక్రిక్టల్, ఎలక్ట్రానిక్‌ వంటి వస్తువుల లారీలను తప్పిస్తారు. అయితే ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. లారీలను అధికారులు పట్టుకున్నప్పుడు తక్కువ జరిమానాతో బయట పడే మార్గాన్ని చెబుతారని సమాచారం. 

తానే వీటీలు చేయిస్తూ....
అధికారులు అప్రమత్తంగా లేని సమయంలోనూ, నగరంలో వాహనాలు తనిఖీ(వీటీ)లు జరగనప్పడు ఆయనే ఒక మహిళను ఒక కారులో కూర్చుబోట్టి డీసీటీఓగా కారులో ఉన్నారంటూ లారీలను ఆపి తనిఖీలు చేసి వారి వద్ద మామూళ్లు తీసుకుని వదిలివేస్తారని సమాచారం. కాగా ఈ టీమ్‌లోని సభ్యుల ఫోన్‌ నెంబర్లు ట్రాకింగ్‌పెడితే అనేక వాస్తవాలు వెల్లడవుతాయని ఆశాఖ సిబ్బందే చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement