
రేణిగుంట రైల్వే స్టేషన్‌లో స్వాగతం పలుకుతున్న అభిమానులకు అభివాదం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. రామచంద్ర పుష్కరిణి వద్ద జగన్ కాన్వాయ్‌పై పుష్పవర్షం
సాక్షి, తిరుపతి: పాదయాత్ర ముగించి శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్థానిక ప్రజలు, నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. గురువారం ఉదయం 10.10 గంటలకు రేణిగుంట రైల్వేస్టేషన్‌లో వైఎస్ జగన్ అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన తిరుమల చేరే వరకు.. అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. ఆయన్ను చూడటానికి, చేయి కలపడానికి, అభివాదం చేయడానికి జనం పోటీపడ్డారు. జగన్‌కు స్వాగతం పలకడానికి వచ్చిన వారితో రేణిగుంట రైల్వేస్టేషన్‌కు కిక్కిరిసిపోయింది. జగన్‌ను వాహనం వద్దకు తీసుకురావడానికి భద్రతా సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. జై జగన్ నినాదాలతో స్టేషన్ ప్రాంగణం మార్మోగింది. అక్కడ నుంచి తిరుపతికి జగన్ రోడ్డుమార్గంలో బయలుదేరారు. రేణిగుంట రైల్వేస్టేషన్, కేఎస్‌ఎం ఆసుపత్రి కూడలిలో శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.
శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వద్ద అభిమాన సందోహం మధ్య వైఎస్ జగన్
చంద్రగిరి నియోజకవర్గంలో ప్రవేశించిన జననేతకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న మహిళలు, యువకులు గుమ్మడికాయలపై కర్పూరం వెలిగించి వైఎస్ జగన్‌కు దిష్టితీశారు. ఆ రోడ్డులో బస్సుల్లో, ఇతర వాహనాల్లో వెళ్తున్నవారు కూడా ఆగి జగన్‌కు అభివాదం చేశారు. రేణిగుంట నుంచి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సమీపంలోని పద్మావతి అతిథి గృహం చేరుకొనే వరకు.. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తర్వాత పద్మావతి అతిథి గృహం నుంచి అలిపిరికి చేరుకోనే మార్గం మొత్తం జనంతో నిండిపోయింది. జగన్ కాన్వాయ్ తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావ్ పూలే సర్కిల్‌కు చేరుకోగానే యువ నాయకుడు భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది అభిమానులు, నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చుతూ ఘన స్వాగతం పలికారు. దివ్యాంగులు సైతం తమ అభిమాననేతకు స్వాగతం పలకడానికి వచ్చారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు ప్రతిపక్ష నేతపై పూలవర్షం కురిపించారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ జననేత ముందుకు కదిలారు.
మెట్ల మార్గంలో భక్తులకు అభివాదం చేస్తూ...
నడకదారిలో అనుసరించిన వేలాది మంది..
అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలినడక దారిలో కిలోమీటరు మేర జనంతో నిండిపోయింది. తిరుమలకు వెళుతున్న భక్తులు కూడా జగన్ వస్తున్నారనే సమాచారంలో కాలినడక బాటలో నిలబడి ఎదురుచూశారు. ఆయనతో కలిసి నడవడానికి ఉత్సాహపడ్డారు. జగన్ వెంట.. గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు అడుగులు వేశారు. జగన్ మెట్ల మార్గంలో నడవటం, సామాన్య భక్తుడిలా దివ్యదర్శనం టోకెన్లు తీసుకోవడం, దివ్యదర్శనానికి అందరితోపాటు క్యూలైన్‌లో వచ్చి గుర్తింపు కార్డు చూపించి ఫింగర్ ప్రింట్స్ వేయడాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. తమలో ఒకడిగా కలిసి శ్రీవారి దర్శనానికి ఆయన రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాలిబాటలో జగన్ నడిచిన వేగాన్ని అందుకోలేక కొంతమంది వెనుకబడిపోవడం కనిపించింది. తమవాడే తమతో కలసి నడిచినట్లుగా ఉందని జగన్‌తో నడిచిన భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
సంప్రదాయ పంచెకట్టుతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న వైఎస్ జగన్
అలిపిరి మార్గంలోని రాధాకృష్ణ ఆలయంలో హారతి తీసుకుంటున్న వైఎస్ జగన్