కష్టపడ్డారు..కొలువు పట్టారు!

Grama Secretariat Jobs For 23 Students At Palamaneru Government Junior College - Sakshi

రికార్డు సృష్టించిన పలమనేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

అందరూ ఒకేషనల్‌ సెరికల్చర్‌కోర్సు చదివినవారే... 

ఎంటెక్, బీటెక్‌ చదివినవారికి దక్కని అవకాశం ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు దక్కింది. పలమనేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలో వృత్తి విద్యా కోర్సుగా సెరికల్చర్‌ పూర్తి చేసిన 23 మందికి సచివాలయ పోస్టుల్లో ఉద్యోగాలొచ్చాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఓ కోర్సు చదివి ఒకే కళాశాలకు చెందిన ఇంతమందికి ప్రభుత్వ కొలువులు వరించడం నిజంగా ఓ రికార్డే. 

సాక్షి, పలమనేరు : పలమనేరు పట్టణంలోని తీర్థం కృష్ణయ్యశెట్టి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సెరికల్చర్‌ కోర్సు పూర్తి చేసిన 23మందికి సచివాలయ ఉద్యోగాలు లభించాయి. ఒకేషనల్‌ కోర్సులో చేరేందుకే ఆసక్తి చూపని నేటి రోజుల్లో అవే కోర్సులు వీరికి కొలువులు తెప్పించాయి. దీంతో కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారంతా కళాశాలకెళ్లి అధ్యాపకులు, ప్రిన్సిపల్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. అధ్యాపక బృందం  వారిని అభినందించారు. తొలినుంచి ఈ కళాశాలకు మంచి పేరుంది. సంప్రదాయ కోర్సులతోపాటు ఇక్కడ తొమ్మిది రకాల వృత్తి విద్యా కోర్సులు అన్ని వసతులతో ఉన్నాయి. ఈ కోర్సుల్లో సెరికల్చర్‌కి సంబంధించి ఏటా 20మంది విద్యార్థులు ఈ కోర్సులో విద్యనభ్యసించే అవకాశం ఉంది. గత పదేళ్లుగా ఇక్కడ సెరికల్చర్‌ కోర్సును పూర్తి చేసుకున్నవారు వందమంది వరకు ఉన్నారు. వీరిలో పలువురు పట్టుపరిశ్రమ శాఖకు సంబంధించి ప్రైవేటు రంగంలో ఉపాధి పొందుతున్నారు.

మరికొందరు సొంతంగా మల్బరీని సాగుచేసి పట్టుగూళ్ల పెంపకం సాగిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు అవకాశం కల్పించింది. దీంతో తాజాగా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సెరికల్చ ర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. సమయం తక్కువగా ఉండడం, కనీసం సిలబస్‌ ఎలా ఉంటుందో తెలియక, ఈ కోర్సుకు సంబంధించిన మెటీరియల్‌ కూడా దొరక్క ఇబ్బందులు పడ్డారు. ఈసమయంలో ఈ కళాశాలలో సెరికల్చర్‌ అధ్యాపకురాలిగా ఎంతో అనుభవం కలిగిన రాజేశ్వరి ప్రత్యేక చొరవచూపారు. ఆమె ఈ పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను తయారు చేసి విద్యార్థులకు పంపి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. సచివాలయ పరీక్షల్లో ఈ కళాశాలకు చెందిన 23మంది ఉద్యోగాలకు ఎంపిౖకై రికార్డు సృష్టించారు. 

చాలా ఆనందంగా ఉంది..
నేను అధ్యాపకురాలిగా ఇక్కడ 29 ఏళ్లుగా పనిచేస్తున్నా. సిరికల్చర్‌ కోర్సు చేసిన పూర్వ విద్యార్థులు, తాజాగా కోర్సు చేసిన వారు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నన్ను సంప్రదించారు. ఎలా చదవాలి, సిలబస్, మెటీరియల్‌ అందుబాటులో లేదన్నారు. దీంతో నేనే తయారు చేసిచ్చా. 23మంది నా వద్ద శిక్షణ పొందిన పిల్లలకు ఉద్యోగాలు రావడం చాలా ఆనందంగా ఉంది.       
–రాజేశ్వరి, సెరికల్చర్‌ అధ్యాపకురాలు, పలమనేరు

రాష్ట్రంలోనే రికార్డేమో.. 
ఇక్కడి ప్రభుత్వ కళాశాలలో ఒకే కోర్సు చదివిన 23మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం రాష్ట్రంలోనే ఓ రికార్డుని నేననుకుంటున్నా. చాలా సంతృప్తిగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా ఉద్యోగాలివ్వడంతోనే మా వద్ద శిక్షణ పొందిన వారు ఎంపికయ్యారు.  
–రామప్ప, సెరికల్చర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌

సెరికల్చర్‌ కోర్సు జీవితాన్ని మార్చేసింది
నేను ఇక్కడ 2011లో సెరికల్చర్‌ కోర్సు పూర్తి చేశా. ఈ కోర్సుకు ఇంటర్‌ క్వాలిఫికేషన్‌తో ఏం ఉద్యోగాలు వస్తాయిలేనని ఆశలు వదులుకున్నా. కానీ ఈ ప్రభుత్వ నిర్ణయంతో నాకు గవర్నమెంటు ఉద్యోగం దక్కింది. నా ఫ్రెండ్స్‌ అప్పట్లో బైపీసీ, ఎంపీసీ చేరితే నేను సెరికల్చర్‌ చేరా. ఇప్పుడు అదే కోర్సు నా జీవితాన్ని మార్చేసింది.
–మునీశ్వరి, గ్రామ సచివాలయ ఉద్యోగి

నిజంగా నమ్మలేకున్నా.. 
సెరికల్చర్‌ అసిస్టెంట్‌గా ఎంపికై ఇటీవల పోస్టింగ్‌లో చేరా. స్థానికంగానే ఉద్యోగం దొరికింది. మా కళాశాలలో చదువుకున్న వారికి 23మందికి నిజంగా అదృష్టమే. సెరికల్చర్‌ చదివితే ఏం ఉద్యోగవకాశాలుంటాయనుకొనే వారికి మేమే సాక్ష్యం. చాలా హ్యాపీగా ఉంది. ఇందుకు కారణమైన మా అధ్యాపకులకు ఎన్నటికీ మరువం.
–వై.శ్రీనివాసులు. గ్రామసచివాలయ ఉద్యోగి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top