ఇంటింటికి నవరత్నాలు: గవర్నర్‌ నరసింహన్‌

Governor Narasimhan Speech In AP Assembly - Sakshi

ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌

సాక్షి, అమరావతి : నవరత్నాలను ప్రతీ ఇంటికి చేరుస్తామని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. కొత్తగా కొలువుతీరిన రాష్ట్ర శాసనసభ సభ్యులతో పాటు శాసనమండలి సభ్యులను ఉద్ధేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పరిపాలన లక్ష్యాలను, విధానాలను ప్రతిబింబించేలా ఆయన ప్రసంగం కొనసాగింది. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 2019 సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. నూతన ప్రభుత్వానికి తక్షణ సమస్యలపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సవాళ్లు అసంగతమైన నిర్వహణకు పర్యవసానాలుగా ఉన్నాయని, మానవ, భౌతిక వనరుల దుర్వినియోగపర్చడం రాష్ట్రం యొక్క దుస్థితిని మరింత తీవ్రతరం చేసిందని అభిప్రాయపడ్డారు. అవినీతి రహిత.. పారదర్శకతతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా గవర్నర్‌ ప్రసంగం ద్వారా స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలను, లక్ష్యాలను గవర్నర్‌ తన ప్రసంగం ద్వారా వివరించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో అసెంబ్లీ సమావేశాలు జూన్ 12న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనుండగా.. తొలి రోజు శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించగా.. రెండో రోజు స్పీకర్ ఎన్నిక నిర్వహించారు. మూడో రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం అనంతరం సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంతో పాటు శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఆహమ్మద్ మహమ్మద్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. (చదవండి: ఫిరాయింపులను ప్రోత్సహించం)

గవర్నర్‌ ప్రసంగం హైలైట్స్‌..
1. కొత్త ప్రభుత్వానికి నా అభినందనలు.
2. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం పనిచేయాలి.
3. కొత్త ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలి.
4. రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తాం.
5. టెండర్లపై జ్యూడీషియల్‌ కమిషన్‌ వేస్తాం.. అవసరమైతే రివర్స్‌ టెండరింగ్‌ విధానం తెస్తాం.
6. ప్రజా సేవకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
7. టెండర్ల ప్రక్రియలో జరిగిన లోపాలను సరిదిద్దుతాం.
8. విభజన హామీలను నెరవేర్చడం మా ప్రభుత్వ లక్ష్యం
9. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తాం.
10. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తాం. గ్రామ వాలంటీర్లను ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం.
11. నవరత్నాలే మా ప్రభుత్వ ప్రాధాన్యత. నవరత్నాలను ప్రతి ఇంటికీ చేరుస్తాం.
12. రైతుల సంక్షేమమే మా లక్ష్యం. రైతు భరోసా కింద రూ.12,500 అందజేస్తాం. అక్టోబర్‌ నుంచి రైతు భరోసా అమలు. రైతులకు వడ్డీ లేని రుణాలు, ఉచితంగా బోర్లు వేయిస్తాం. వైఎస్సార్‌ బీమా కింద రూ.7 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తాం. సహకార రంగాన్ని, పాడి పరిశ్రమ రంగాలను బలోపేతం చేస్తాం.
13. జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ కాలపరిమితిలో పూర్తి చేస్తాం. కిడ్నీ, తలసేమియ రోగులకు రూ. 10 వేల పెన్షన్‌ అందజేస్తాం. 
14. మద్యపానాన్ని దశలవారిగా నిషేధిస్తాం.
15. అమ్మఒడి కింద ప్రతి ఏటా రూ.15 వేలు అందిస్తాం.
16. నామినేటెడ్‌ పనులను బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు కేటాయిస్తాం.
17. కాపుల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం.
18. ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.
19. పెన్షనర్ల వయస్సును 65 నుంచి 60 కుదిస్తున్నాం.
20. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇల్లు కేటాయిస్తాం.
21. ప్రత్యేకహోదా కోసం మా పోరాటం కొనసాగిస్తాం.
22. సీపీఎస్‌ రద్దు కోసం కమిటీ ఏర్పాటు చేశాం.
23. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ అందజేస్తాం.
24. సాంకేతిక, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ప్రతి పేద విద్యార్థి మొత్తం ఫీజును మేమే భరిస్తాం.
25. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అదనంగా విద్యార్థి బోర్డింగ్‌ వసతి కోసం ఏడాదికి రూ. 20 వేలు సమకూరుస్తాం. 
26. వైఎస్సార్‌ చేయుత ద్వారా 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75 వేలు అందిస్తాం.
27. గిరిజిన సంక్షేమశాఖలో సామాజిక ఆరోగ్య కార్యకర్తల జీతాలను రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచాం.
28. అంగన్‌వాడి, హోంగార్డుల జీతాలను పెంచుతాం.
29. సుపరిపాలన అందించడానికి యాత్ర ఇప్పుడే మొదలైందని గవర్నర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top