మగువ ముంగిట్లోకి సాంకేతిక విద్య | government permissions granted to polytechnic college | Sakshi
Sakshi News home page

మగువ ముంగిట్లోకి సాంకేతిక విద్య

Mar 2 2014 12:01 AM | Updated on Sep 2 2017 4:14 AM

గత ఏడాది మంజూరైన పాలిటెక్నిక్ కళాశాలకు అనుసంధానంగా వచ్చే విద్యా సంవత్సరం (2014-15) నుంచి సిద్దిపేటలో మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్:  సిద్దిపేట చదువుల తల్లి మణిహారంలో మరో ముత్యం వచ్చి చేరింది. గత ఏడాది మంజూరైన పాలిటెక్నిక్ కళాశాలకు అనుసంధానంగా వచ్చే విద్యా సంవత్సరం(2014-15) నుంచి సిద్దిపేటలో మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా జీఓ నం. 19 విడుదల చేశారు. దీంతో సిద్దిపేట పరిసర ప్రాంత మహిళలకు  సాంకేతిక విద్య ముంగిట్లోకి రానుంది.  

 ఏడాదికో కళాశాల
 విద్యాపరంగా దినదినాభివృద్ధి చెందుతున్న సిద్దిపేటకు గత ఏడాది బాలుర పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది. కొంతకాలంగా తాత్కాలిక భవనంలో కొనసాగిన ఈ పాలిటెక్నిక్ కళాశాల, ఇటీవలే రాజగోపాల్‌పేటలో నిర్మించిన సొంత భవనంలోకి మారింది. ఈక్రమంలోనే సిద్దిపేటలో మహిళా పాలిటెక్నిక్ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే హరీష్‌రావు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదలను పరిశీలించిన సాంకేతిక విద్యాశాఖ, ఏఐసీటీఈ నిబంధనల మేరకు నూతన కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా సిద్దిపేటలో మహిళా పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేస్తూ జీఓ జారీ చేశారు. అంతేకాకుండా కళాశాల ఏర్పాటుకు రూ.5.44 కోట్ల ప్రతిపాదనలతో ప్రణాళికను రూపొందించి, తొలి విడతలో రూ. 77 లక్షలు మంజూరు చేశారు.

 సివిల్, ఎలక్ట్రికల్ కోర్సులు..120 సీట్లు
 2014-15 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న సిద్దిపేట మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్, ఎలక్ట్రికల్ కోర్సులుంటాయి. ప్రస్తుతం ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున మొత్తం 120 సీట్లకు ఉన్నతవిద్యాశాఖ అనుమతులు తెలిపింది. కళాశాలకు సంబంధించి బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి మరోవారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిద్దిపేటలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలోని ఓ భవనాన్ని తాత్కాలికంగా మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు కేటాయించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement