వ్యవసాయశాఖలో రూ. 3.8 లక్షలు స్వాహా

Government Employee Stole Three Lakh Rupees In Agricultural Office - Sakshi

సాక్షి, కడప : వ్యవసాయశాఖలో పనిచేసే ఓ ఉద్యోగి ప్రభుత్వ సొమ్మును మెక్కేశాడు. మొత్తం రూ.3 లక్షల 80 వేలు తన సొంత ఖాతాలోకి మార్చుకుని ఏమీ తెలియనట్లు నటించాడు. బ్యాంకు అకౌంట్లను తనిఖీ చేయగా విషయం బయటపడింది. దీంతో ఆ ఉద్యోగి కార్యాలయం నుంచి పరారయ్యాడు.. వివరాల్లోకి వెళితే జిల్లా వ్యవసాయశాఖలో పనిచేస్తున్న ప్రధాన ఉద్యోగి తనకున్న అధికారాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ సొమ్మును సొంతానికి వాడుకున్నాడు. వ్యవసాయశాఖలో ఐటీసెల్‌ విభాగంలో ఖర్చులు చెల్లిస్తుంటారు.

ఇందులో అధికారుల ఫోన్‌ బిల్లులు, ట్యాబ్‌లకు ఉపయోగించే సిమ్‌ కార్డులకు బిల్లులు చెల్లిస్తుంటారు. ఈ నిధులు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం పథకం నుంచి వాడుకునే విధంగా రాష్ట్ర వ్యవసాయశాఖ వీలు కల్పించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న సదరు అధికారి అనుకూలంగా మలుచుకుని రూ.3.80 లక్షలు వాడుకున్నాడు. ఈ బిల్లులు మూడు నెలలకు ఒకసారి బ్యాంకుకు చెల్లిస్తుంటారు. ఈ కోణంలో మొత్తం రూ.11.20 లక్షలు గతనెల 29వ తేదీన చెక్కులు బ్యాంకుకు అందజేశారు. జేడీ అకౌంట్‌లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా బిల్లులను ట్రెజరీలో సమర్పిస్తారు.

ఆ బిల్లులకు సంబంధించిన చెక్కులు బ్యాంకుకు వెళ్లాయి. ఆ బ్యాంకు మేనేజర్‌ డీడీఓ ఖాతాను పరిశీలించగా రూ.7.40 లక్షలు మాత్రమే చూపిస్తోందని జేడీ కార్యాలయ ఉద్యోగికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. వెంటనే సంబంధిత ఉద్యోగులు బ్యాంకుకు వెళ్లి చూడగా కార్యాలయ ప్రధాన ఉద్యోగి ఖాతాకు రూ.3.80 లక్షలు మళ్లించినట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయశాఖ జేడీకి వివరించారు. ఆయన స్పందించి సదరు ప్రధాన ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు జరిగిన విషయాన్ని నివేదిక రూపంలో పంపించారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణను వివరణ కోరగా సదరు ఉద్యోగినే జీతాల బిల్లులు ఇతరత్రా ఖర్చుల బిల్లులు తయారుచేసి ట్రెజరీకి పంపుతుంటారన్నారు. దీనికి సంబంధించి కార్యాలయ ఉద్యోగులు కనుగొని చెప్పడంతో అతనిపై చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేశామని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top