ఇంధన పొదుపులో మహిళలు

Government Decided To Increase Women's Participation In Energy Savings - Sakshi

కోటి మందిని భాగస్వామ్యం చేసే ప్రణాళిక

నేడు రాష్ట్రస్థాయి మహిళా సదస్సు

సాక్షి, అమరావతి:  ఇంధన పొదుపులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాలకు చెందిన కోటి మంది మహిళలు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్ములనా సంస్థ (సెర్ప్‌) తో కలసి రాష్ట్ర ఇంధన శాఖ ఈనెల 16న విజయవాడలో రాష్ట్రస్థాయి మహిళా సదస్సు నిర్వహించనుంది. క్షేత్రస్థాయి నుంచి ఇంధన భద్రతను పటిష్టం చేయడం దీని ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ఇంధన పొదుపు విభాగం అధికారి చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు.

ఈ సందర్భంగా విద్యుత్‌ పొదుపు–మహిళల పాత్రకు సంబంధించి రాష్ట్రస్థాయి మహిళా సదస్సు పోస్టర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంధన సామర్థ్య రంగంలో మహిళల భాగస్వామ్యం దేశానికే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందని మంత్రి అన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషిఎన్సీ సంస్థను కొనియాడారు.

ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం), రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో సెర్ప్‌ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇంధన సామర్థ్య కార్యకలాపాలలో స్వయం సహాయక సంఘాలు భాగస్వాములయ్యేలా ఒక దీర్ఘకాలిక అమలు ప్రణాళిక రూపొందించాల్సిందిగా పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేదిని, సెర్ప్‌ సీఈవో పి.రాజబాబును మంత్రి ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top