ఇల్లే వేదిక.. సమస్య లేదిక! | Going High Tech In Spandana | Sakshi
Sakshi News home page

ఇల్లే వేదిక.. సమస్య లేదిక!

Sep 19 2019 10:44 AM | Updated on Sep 19 2019 10:44 AM

Going High Tech In Spandana - Sakshi

సాక్షి, చీరాల రూరల్‌: సామాన్యుల సమస్యలను పరిష్కరించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా సేవలను మరింత దగ్గరకు చేర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. తమ సమస్యలను ప్రభుత్వాధికారుకు విన్నవించుకునేందుకు ప్రజలు కార్యాలయాలకు వచ్చి గంటలు తరబడి క్యూలైన్లలో నిలబడకుండా ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం ఓ యాప్‌ను రూపొందించింది. స్పందన–ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఏ శాఖకు సంబంధించిన సమస్య అయితే ఆ శాఖకు పంపించవచ్చు. వెంటనే సంబంధిత అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక 1800–425–4440 (టోల్‌ ఫ్రీ) నంబర్‌కు ఎవరైనా ఎప్పుడైనా కాల్‌చేసి తమ అర్జీల గురించి తెలుసుకోవచ్చు.

ముఖ్యమంత్రి శ్రీకారం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కరించేందుకు స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా, సబ్‌ డివిజన్, నియోజకవర్గ, మండల స్థాయిల్లో అన్ని శాఖల అధికారులు ప్రతి సోమవారం ఆయా ప్రభుత్వ కార్యాలయాలలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను అధికారులు పరిశీలించి చకచకా పరిష్కరిస్తున్నారు.

అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్న పోలీసులు 
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి పోలీసులు అత్యాధునికమైన సాంకేతికతను వినియోగిస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేస్తున్న స్పందన కార్యక్రమానికి జిల్లాలో భారీగా స్పందన వస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖాధికారులతో పాటు పోలీసులు కూడా ప్రతి సోమవారం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు క్రమం తప్పకుండా స్పందనకు హాజరవుతున్నారు. పోలీసు శాఖ ఓ అడుగు ముందుకేసి అత్యాధునిక సాంకేతికను వినియోగించుకుంటోంది. అందులో భాగంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్లలో కంప్యూటర్లు ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ కార్యాలయానికి అనుసంధానం చేశారు.

ఆయా కంప్యూటర్లకు వీడియో కాలింగ్‌ ఏర్పాటు చేయడం ద్వారా నేరుగా ఫిర్యాదుదారులు జిల్లా ఎస్పీకి తమ విన్నపాన్ని తెలుపుకోవచ్చు. తద్వారా బాధితులకు సత్వరమే సమస్యలపై ఉపశమనం పొందే అవకాశం ఉంది. అంతేకాక జిల్లా ఉన్నతాధికారితో నేరుగా ఫిర్యాదుదారుడు మాట్లాడినట్లయితే కిందిస్థాయి అధికారుల్లో జవాబుదారీతనం పెరిగే అవకాశం ఉంది. తప్పులుదొర్లే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చీరాలలోని ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఇప్పటి వరకు 54 అర్జీలు అందగా 52 అర్జీలను పోలీసు అధికారులు పరిస్కరించారంటే స్పందనపై ప్రజలకు ఏవిధమైన నమ్మకం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

గూగుల్‌ యాప్‌తో సమస్యలకు చెక్‌ పెట్టనున్న అధికారులు 
సమస్యలపై కార్యాలయాలకు వచ్చి అర్జీలు అందించేందుకు ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటాన్ని ప్రభుత్వం గుర్తించింది. వీటికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఎక్కడి నుంచైనా సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా స్పందనలో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్‌ను అరచేతిలో పెట్టుకుని సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఓ యాప్‌ను రూపొందించింది. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో గూగుల్‌ సెర్చ్‌ ఓపెన్‌ చేసి అక్కడ ఏపీ స్పందన అని టైప్‌చేస్తే పోర్టల్‌ ఓపెన్‌ అవుతుంది. అక్కడ యూసర్‌ లాగిన్‌ అనే విండో ఉంటుంది. ఆ ప్రదేశంలో ఆధార్‌ నంబర్‌ నమోదు చేస్తే ఈ–కేవైసీ ఓటీపీ(ఆరు అంకెల నంబర్‌) ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. వెనువెంటనే ఓటీపీ ఎంటర్‌ చేస్తే పోర్టల్‌ ఓపెన్‌ అవుతుంది. అర్జీ నమోదు, అర్జీ నకలు జతపరచండి అనే అంశాలు ఉంటాయి.

అర్జీ నమోదు చేయగానే పర్సనల్‌ వివరాలు, కుటుంబ గ్రీవెన్స్‌ వివరాలు, ప్రొవైడ్‌ గ్రీవెన్స్‌ అడ్రస్, రిమార్కులు/ఇతర వివరాలు ఉంటాయి. అక్కడ అన్ని శాఖల వివరాలు స్పష్టంగా ఉంటాయి. అందులో మనం ఏ శాఖకు సంబంధించిన సమస్య చెబుతున్నామో ఎంపిక చేసుకుని ధరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడే సెల్‌ఫోన్‌లోనూ వివరాలు నమోదు చేసుకునేందుకు ప్లేస్టోర్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీంతో ప్రజలు ఇచ్చే ప్రతి అర్జీ ఆయా శాఖలకు చేరుతుంది. అధికారులు గడువులోగా వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది. ఇక్కడే దరఖాస్తుల స్థితిగతుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అనేక మంది తమ సమస్యల పరిష్కారం కోసం ఇంట్లో నుంచే అధికారులకు అర్జీలు అందించి ఉపశమనం పొందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement