బోటును ఒడ్డుకు తీసుకురాలేం: కలెక్టర్‌

Godavari Boat Accident:Rescue Operation Continues  - Sakshi

సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన బోటును బయటకు తీసేందుకు నిపుణుల బృందం ప్రయత్నిస్తోందని జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి తెలిపారు. ఇక గోదావరిలో మునిగిపోయిన లాంచీని బయటకు తీసేందుకు..రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గతంలో బలిమెల రిజర్వాయర్‌తో పాటు నాగార్జున సాగర్‌లో మునిగిపోయిన బోటును వెలికి తీసిన టీమ్‌ను ఇందుకోసం రప్పించారు.  

ముంబై నుంచి వచ్చిన నిపుణుల బృందం అదే పనిలో ఉన్నట్లు చెప్పారు. బరువు అధికంగా ఉండటంతో బోటును ఒడ్డుకు తీసుకు రాలేమని, ఏదైనా సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో 700మంది సిబ్బంది పని చేస్తున్నారని, ఇప్పటివరకూ 34 మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. ప్రమాదానికి గురైన ప్రైవేట్‌ పర్యాటక బోటు రాయల్‌ వశిష్ట పున్నమి-2 ఆచూకీ లభించింది. కచ్చులూరు మందం గ్రామం వద్ద గోదావరిలో 214 అడుగుల లోతున బోటు ఉన్నట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గుర్తించాయి. 

కాగా మునిగిపోయిన బోటులో మొత్తం 73మంది ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ప్రమాదం జరిగిన రోజే బోటు నుంచి 26మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మరోవైపు లాంచీ ప్రమాద ఘటనలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌, నేవీ బృందాలు గోదావరిని జల్లెడ పడుతున్నాయి. బుధవారం ఆరు మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించారు. 

సహాయక చర్యలపై సీఎం జగన్‌ ఆరా
రెస్క్యూ ఆపరేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నారని మంత్రి విశ్వరూప్‌ తెలిపారు. ఇప్పటివరకూ 34 మృతదేహాలు లభ్యమయ్యాయని, గల్లంతు అయిన 13మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. గుర్తుపట్టలేని మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించైనా సంబంధిత కుటుంబీకులకు అప్పగిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top