
శాంతి భద్రతలకు పెద్దపీట
పట్టణంలో నేరాలను అదుపు చేసి శాంతి భద్రతలను కాపాడేందుకు రూ.20 లక్షలతో సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలిపారు.
నంద్యాల టౌన్: పట్టణంలో నేరాలను అదుపు చేసి శాంతి భద్రతలను కాపాడేందుకు రూ.20 లక్షలతో సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలిపారు. భూమా శోభా మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన పట్టణ నిఘా నేత్ర పర్యవేక్షణ కేంద్రాన్ని సోమవారం ఆయన స్థానిక ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో ప్రారంభించారు. అనంతరం సీసీ కెమెరాలను ఇన్‌చార్జి డీఎస్పీ రామాంజనేయులురెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి జ్ఞాపకార్థం చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా నిఘా విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
పట్టణంలోని పలు సెంటర్లలో 20 కెమెరాలను అమర్చామని.. వీటిని కేబుల్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించి ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో కంట్రోల్ పాయింట్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి నుండే పోలీసు అధికారులు సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను పర్యవేక్షించవచ్చన్నారు. అవసరమైతే అదనపు పరికరాలను అందజేస్తామన్నారు. హైదరాబాద్ తర్వాత నంద్యాలలోనే ఇలాంటి నిఘా వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. పోలీసులు ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. డీఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా చైన్ స్నాచింగ్, చిల్లర దొంగతనాలతో పాటు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
సీసీ కెమెరాలు నిరంతరం దృశ్యాలను చిత్రీకరిస్తుంటాయని.. వీటి ద్వారా ఫొటోలు కూడా తీయవచ్చన్నారు. ఆర్డీఓ నరసింహులు మాట్లాడుతూ పలు కేసుల్లో పోలీసులకు ఈ సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమన్నారు. పట్టణంలో ఏమి జరుగుతుందనే విషయాలను ఆ శాఖ ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందన్నారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి పేరిట సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. వీటి వల్ల ఆమె పేరు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో కేబుల్ నెట్‌వర్క్ మేనేజర్ జయచంద్రారెడ్డి, సీఐ జయరాముడు, ఎస్‌ఐలు రాము, సూర్యమౌళి, అశోక్, పుల్లయ్య, కౌన్సిలర్లు కొండారెడ్డి, ముర్తుజా, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.