నేరగాళ్ల చరిత్ర విప్పే నిఘా నేత్రాలు | CCTV Camera System At Railway Stations, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

నేరగాళ్ల చరిత్ర విప్పే నిఘా నేత్రాలు

Aug 1 2025 2:00 AM | Updated on Aug 1 2025 12:24 PM

CCTV camera system at railway stations

రైల్వే స్టేషన్‌లలో సీసీటీవీ కెమెరా వ్యవస్థ  

అత్యాధునిక ‘ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు’ 

రియల్‌టైమ్‌లో స్పష్టమైనచిత్రాలు, నేర చరిత్ర 

మహిళలపై నేరాలకట్టడికి వినూత్న ప్రాజెక్టు  

రూ.250 కోట్లతోఏర్పాటుచేస్తున్న కేంద్రం 

పైలట్‌ ప్రాజెక్టుగా సికింద్రాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 8 స్టేషన్‌లలో ఏర్పాటు 

సాక్షి, హైదరాబాద్‌: ఇక మీదట.. నేరాలు చేసి రైల్వే స్టేషన్లలోకి వెళ్లి తప్పించుకుంటామంటే కుదరదు. ‘ముఖ’చిత్రంతోపాటు.. నేర చిట్టాతో సహా అడ్డంగా దొరికిపోతారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారిలో ఎక్కువమంది తప్పించుకునే క్రమంలో రైల్వే స్టేషన్‌లకు చేరుతున్నారు. తోచిన రైలెక్కి పారిపోతున్నారు. అలాంటి వారిని పట్టుకునేందుకు..కేంద్రం ఏఐ ఆధారిత, రియల్‌టైమ్‌లో పనిచేసే వినూత్న సీసీటీవీ కెమెరాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇవి రైల్వే స్టేషన్లలో నేరగాళ్ల ముఖాలను పసిగట్టి అప్పటికప్పుడు వారి నేరాల చిట్టాను విప్పుతాయి. ఆ వెంటనే పోలీసులు సులభంగా పట్టుకోగలుగుతారు.

దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, ఇతర నేరాలు పెరుగుతుండటంతో కేంద్ర హోం శాఖ రైల్వే స్టేషన్‌లలో గట్టి నిఘా అవసరమని గుర్తించింది. నేరాలకు పాల్పడేవారిలో ఎక్కువ మంది రైళ్లలోనే పారిపోతుండటమే దీనికి కారణం. దీంతో నేరగాళ్లను సులభంగా గుర్తించేందుకు రైల్వే స్టేషన్‌లలో ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు సీసీటీవీ కెమెరా పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. నిర్భయ నిధి నుంచి ఇందుకు రూ.250 కోట్లు విడుదలకు నిర్ణయించింది. 

ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మకంగా, దేశంలో రద్దీ ఎక్కువగా ఉండే 8 కీలక రైల్వే స్టేషన్‌లలో తొలుత వీటిని అందుబాటులోకి తేబోతోంది. ఇందులో తెలంగాణలోని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కూడా ఉంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునరాభివృద్ధి జరుపుకొంటున్న ఈ స్టేషన్‌ వచ్చే ఏడాదిలో పూర్తి కొత్త రూపుతో, మినీ ఎయిర్‌పోర్టు తరహాలో అందుబాటులోకి రాబోతోంది. ఈలోపే ఈ కొత్త సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటుచేయనున్నారు. 

ఆ 8 స్టేషన్లు ఇవే 
సికింద్రాబాద్‌ కాకుండా మరో ఏడు నగరాలను కేంద్రం ఎంపిక చేసింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెరి్మనస్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, బెంగళూరు, చెన్నై, హౌరా, అహ్మదాబాద్, పుణేలోని స్టేషన్లలో పైలట్‌ ప్రాజెక్టుగా ఏఐ ఆధారిత 4కే హెచ్‌డీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. ఈ ఎనిమిది స్టేషన్‌లలో కలిపి రోజుకు దాదాపు కోటి మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారు ఈ రద్దీలో కలిసిపోయి పారిపోతున్నారు. 

ఇలా పని చేస్తుంది
ఈ వ్యవస్థలో ఏర్పాటుచేసే సీసీటీవీ కెమెరాలు ప్రత్యేకమైనవి. ఇవి దృశ్యాలను అత్యంత స్పష్టంగా రికార్డు చేస్తాయి. ఈ వ్యవస్థ భారతదేశ జాతీయ లైంగిక నేరస్థుల డేటాబేస్‌ (ఎన్‌డీపీఓ)తో అనుసంధానమై ఉంటుంది. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు పాల్పడిన వారి చిత్రాలు, నేర చరిత్ర, వేలిముద్రలు సహా ఇతర వివరాలు ఎన్‌డీపీఓలో నిక్షిప్తమై ఉన్నాయి. 

ఇలా ప్రస్తుతం సుమారు 20.28 లక్షల రికార్డులు ఉన్నాయి. సరికొత్త సీసీటీవీ కెమెరాలు హై–డెఫినిషన్‌ క్లారిటీతో వ్యక్తుల ముఖాలను గుర్తిస్తాయి. ఎన్‌డీపీఓ రికార్డులతో రియల్‌టైమ్‌లో వాటిని సమీక్షించి, రికార్డులో నమోదైన నేరగాళ్లు ఉన్నట్టు తేలితే వెంటనే పూర్తి డేటాను అందిస్తుంది. పోలీసు వ్యవస్థను అలర్ట్‌ చేయగానే.. పోలీసు సిబ్బంది వారిని వీలైనంత తొందరలో పట్టుకోగలుగుతారన్నది ఈ వ్యవస్థ ఏర్పాటు ఉద్దేశం.  

వాహనాలనూ గుర్తుపట్టేలా.. 
ఫేషియల్‌ రికగి్నషన్‌తో పాటు ఈ స్టేషన్లలో అత్యవసర కాల్‌ బాక్స్‌లు, స్మార్ట్‌ లైటింగ్, డ్రోన్‌నిఘా, ఆటోమేటెడ్‌ నంబర్‌ ప్లేట్‌ గుర్తింపు వ్యవస్థలతో సహా విస్తృత సాంకేతికతలను ఏర్పాటు చేయనున్నారు. గతంలో వివిధ నేరాల్లో పాలుపంచుకున్న వాహనాలు (నంబర్‌ప్లేట్‌ ఆధారంగా) కనిపించినా కెమెరాలు పట్టేస్తాయి. రైల్వే అనుబంధ సంస్థ సిగ్నల్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ విభాగం దీని ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తోంది. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ఎనిమిది రైల్వే స్టేషన్‌లలో, ఒక్కో స్టేషన్‌కు నిర్భయ నిధి నుంచి రూ.4.8 కోట్లు విడుదల చేశారు.  

గోప్యంగా సమాచారం 
ఈ కెమెరాలను వెయిటింగ్‌ హాళ్లు, రిజర్వేషన్‌ కౌంటర్లు, పార్కింగ్‌ ప్రాంతాలు, ప్రధాన ద్వారాలు, ప్లాట్‌ఫామ్‌లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ సహా వ్యక్తుల కదలికలుండేకీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కంట్రోల్‌ రూమ్‌లలో వీడియో ఫీడ్‌ పర్యవేక్షిస్తారు. ఈ వ్యవస్థ సేకరించే సమాచారాన్నిగోప్యంగా ఉంచుతామని,అవసరమైనంత మేరకు తప్ప బహిర్గతం చేయబోమని రైల్వే అధికారులు తెలిపారు. 

ఇదీ నేపథ్యం 
మహిళలపై నేరాలకుసంబంధించి.. తక్కువ శిక్ష రేటుపై ఆందోళన వ్యక్తం చేస్తూ విమెన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ గతంలో సుప్రీంకోర్టులో కేసు వేసింది. 2022లో 23.66 లక్షల పెండింగ్‌ కేసుల్లో 38,136 మందికి మాత్రమే శిక్ష పడిందనిపిటిషన్‌లో పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, ఈ కొత్త వ్యవస్థ ఏర్పాటు కోసం తీసుకుంటున్న చర్యలను తాజాగా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. వీలైనంత త్వరలో దీన్ని రైల్వే స్టేషన్‌లలో అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది.  

ఏ ప్రాంతంలో ఎలాంటి కెమెరాలు? 
» స్టేషన్‌ భవనాల్లోని ప్రాంతాల్లో డోమ్‌ టైప్‌ కెమెరాలు 
»   ప్లాట్‌ఫామ్స్‌ వద్ద బుల్లెట్‌ టైప్‌ కెమెరాలు 
» పార్కింగ్‌ ఏరియాలలో పాన్‌ టిల్ట్‌ జూమ్‌ టైప్‌ కెమెరాలు 
»  కీలక ప్రాంతాల్లో 4కే హెచ్‌డీ అల్ట్రా కెమెరాలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement