లెక్క చెప్పాల్సిందే | give details for the cost of election | Sakshi
Sakshi News home page

లెక్క చెప్పాల్సిందే

Jun 9 2014 1:51 AM | Updated on Aug 14 2018 4:34 PM

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల సంఘానికి అందించాల్సి ఉంది.

 ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల సంఘానికి అందించాల్సి ఉంది. అయితే ఖర్చు వివరాలందించడంలో అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. ఈ రెండు ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 196 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా ఇప్పటి వరకు కేవలం 20 మంది అభ్యర్థులు మాత్రమే ఎన్నికల ఖర్చు వివరాలందించారు. మరో 176 మంది అభ్యర్థులు ఇవ్వాల్సి ఉంది. అందుకు తుది గడువు ఈనెల 15గా నిర్ణయించారు. అప్పటికల్లా ఖర్చు వివరాలు అందించకుంటే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సంబంధిత అభ్యర్థు లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
 సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారీ పోటీచేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 187 మంది, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు 29 మంది అభ్యర్థులు పోటీ చేశారు.  ఎన్నికల ఫలితాలను మే 16న ప్రకటించారు. ఖర్చు వివరాలను సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందించాల్సి ఉంది. గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికల ఖర్చు వివరాలందించడంలో అభ్యర్థులు అనాసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ఓటమిని జీర్ణించుకోలేక, మరికొంత మంది ఇవ్వొచ్చులే అన్న నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు.
 
 వివరాలు అందించకుంటే...
 =అభ్యర్థులంతా  నామినేషన్లు దాఖలు చేసిన నాటి నుంచి ఎన్నికలు జరిగే తేదీ వరకు చేసిన ప్రతి పైసా లెక్క చూపించాల్సిందే. ఇప్పటికే ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఎన్నికల సంఘం కొంతమేర మినహాయింపు ఇచ్చింది. దానికి లోబడి ఖర్చు చేశారా,అంతకంటే ఎక్కువ ఖర్చు చేశారా అన్న వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పరిశీలించనున్నారు.
 
 = కీలకమైన ఎన్నికల ఖర్చు వివరాలను అభ్యర్థులు అందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తోంది. భవిష్యత్‌లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటిస్తారు. గుర్తింపు పొందిన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన వారికి ఒకరకంగా ఇది రాజకీయ సమాధి వంటిదే. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినవారు భవిష్యత్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి అవకాశం వస్తే దానిని కోల్పోయే ప్రమాదం ఉంది.
 
 = ఎన్నికల ఖర్చు వివరాలను అందించని అభ్యర్థులకు సంబంధిత నియోజకవర్గాల రిట ర్నింగ్ అధికారుల నుంచి నోటీసులు పంపించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది.
 
ఖర్చులో తేడాలున్నా ఇబ్బందే..
ఎన్నికల ఖర్చుకు సంబంధించి అభ్యర్థులు అందించిన లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు తేడా ఉంటే ఇబ్బంది తప్పదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారన్నది బహిరంగ రహస్యమే. నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవ్వనున్న ఎన్నికల ఖర్చు వివరాల్లో భారీగా చేసిన ఖర్చు వివరాలు కనిపించకుంటే ఎవరైనా కోర్టులో ఫిర్యాదు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలను ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకునే పనిలో తలమునకలై ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement