పాల ప్యాకెట్‌ కోసం వచ్చి.. అనంతలోకాలకు

Girl Child Deceased in Dranage East Godavari - Sakshi

డ్రైన్‌ ప్రవాహంలో కొట్టుకుపోయి చిన్నారి మృతి

తూర్పుగోదావరి,మండపేట: పాల ప్యాకెట్‌ కోసం వచ్చిన చిన్నారిని మురుగునీటి డ్రైన్‌ రూపంలో మృత్యువు కబళించింది. పాల ప్యాకెట్‌ కోసం వెళ్లిన చిన్నారి వచ్చేస్తుందని ఎదురు చూస్తున్న కన్నవారికి తీరని కడుపు కోత మిగిల్చింది. బాలికను కాపాడేందుకు పెద్ద ఎత్తున స్థానికులు డ్రైన్‌లో గాలించినా ఫలితం లేకపోయింది.  పట్టణానికి చెందిన పలివెల దుర్గాప్రసాద్, పల్లవి దంపతులకు కుమార్తె చంద్రకళ(7), కుమారుడు ఉన్నారు. స్థానిక మూడో వార్డులోని ఇంటిలో అద్దెకు ఉంటున్న దుర్గాప్రసాద్‌ వడ్రంగి పని చేస్తుంటాడు. స్థానిక రామాహిందూ మున్సిపల్‌ స్కూల్లో చంద్రకళ రెండో తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్ర సమయంలో పాల ప్యాకెట్‌ కోసం పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని దుకాణం వద్దకు వచ్చింది.

అప్పటికే కుంభవృష్టిగా కురిసిన వర్షంతో దుకాణం సమీపంలోని మంగళిబోదె డ్రైన్‌ వేగంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుంచి ముంపునీరు ప్రవహిస్తుండడంతో నీటిలో కాలి చెప్పు జారిపోయింది. దానిని తీసుకునే ప్రయత్నంలో చంద్రకళ నీటి ప్రవాహ వేగానికి డ్రైన్‌లో పడి కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించి ఇద్దరు చిన్నారులు బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లికి చెప్పడంతో ఆమె పరుగెత్తుకుంటూ సంఘటన స్థలానికి చేరుకుంది. తన బిడ్డను కాపాడమంటూ ఆమె డ్రైన్‌ వెంబడి పరుగులు పెట్టడం చూసి స్థానికులు పెద్ద ఎత్తున డ్రైన్‌లోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. కిలోమీటరు దూరంలో చిన్నారి దొరకడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మున్సిపల్‌ కమిషనర్‌ టి.రామ్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె విగతజీవిగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు ప్రసాద్, పల్లవి శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డను కాపాడమంటూ ఆస్పత్రి వద్ద వారు మొరపెట్టుకోవడం చూపరులను కలచివేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top