ఇప్పటికి కళ్లు తెరిచారు | Ghat, on the roads without traffic safety | Sakshi
Sakshi News home page

ఇప్పటికి కళ్లు తెరిచారు

Jul 16 2015 2:27 AM | Updated on Aug 18 2018 8:05 PM

ఇప్పటికి కళ్లు తెరిచారు - Sakshi

ఇప్పటికి కళ్లు తెరిచారు

ప్రచార యావతో భక్తులను గాలికొదిలేసిన ప్రభుత్వం పుష్కరఘాట్‌లో 27 మందిని బలిగొన్న తర్వాత మేల్కొంది.

* దుర్ఘటన తర్వాత మేల్కొన్న ఏపీ ప్రభుత్వం  
* ఘాట్లు, రోడ్లపై రద్దీ లేకుండా జాగ్రత్తలు

రాజమండ్రి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రచార యావతో భక్తులను గాలికొదిలేసిన ప్రభుత్వం పుష్కరఘాట్‌లో 27 మందిని బలిగొన్న తర్వాత మేల్కొంది. ఊహల్లో విహరిస్తూ అంతా అద్భుతంగా ఉందనే ప్రచారంతో నేల విడిచి సాము చేసిన ప్రభుత్వ పెద్దలు.. విపక్షాలు, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టారు.

అదనపు పోలీసు బలగాలను దింపి దుర్ఘటన జరిగిన పుష్కరఘాట్ మొదలు మిగిలిన ఘాట్లలోనూ మోహరించారు. తొక్కిసలాట జరిగిన ఘాట్ ఎదుట కోటగుమ్మం సెంటర్‌లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మంగళవారం సీఎం వాహనశ్రేణి సులభంగా తిరిగేందుకు బారికేడ్లను ఏర్పాటు చేయలేదు. దీనివల్ల భక్తులు ఒకేచోట పోగుపడి మళ్లీ ఇబ్బందులు నెలకొంటాయని రాత్రికి రాత్రి క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

దీంతో గోదావరి రైల్వేస్టేషన్‌లో దిగిన భక్తులు నేరుగా క్యూలైన్‌లోకి వెళ్లి పుష్కరఘాట్‌లోకి ప్రవేశించే వీలు ఏర్పడింది. స్టేషన్‌లో ఎక్కువమంది దిగితే రద్దీని పక్కనున్న కోటిలింగాల రేవుకు మళ్లించారు. క్యూలైన్లు, ఘాట్‌లలో పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. భక్తులు రోడ్లపైకి రాకుండా క్యూలైన్లలో వెళ్లేలా చూశారు. అదే సమయంలో క్యూలైన్లలోనూ భారీగా జనం ఉండకుండా జాగ్రత్తపడ్డారు.
 
దృష్టంతా పుష్కరఘాట్‌పైనే: పుష్కరఘాట్‌లోనూ ఎక్కడా జనం నిలబడకుండా వెంటనే స్నానం చేసి వెళ్లిపోయేలా చూశారు. పోలీసులు, వలంటీర్లు నదిలో స్నానం చేసిన వెంటనే భక్తులను తీసుకొచ్చి బయటకు పంపించివేశారు. మంగళవారం మంచినీరు లేక జనం అల్లాడిపోవడంతో బుధవారం మంచినీటి ప్యాకెట్లను ఘాట్లు, క్యూలైన్లలో పంపిణీ చేయించారు. ఇదంతా కేవలం పుష్కరఘాట్‌లోనే కనిపించింది. మిగిలిన ఘాట్లలో ఈ స్థాయి ఏర్పాట్లు చేయలేదు.
 
ఘాట్లలో అర్ధరాత్రి తిరిగిన ముఖ్యమంత్రి
మంగళవారం జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాట్లలో అర్ధరాత్రి తిరిగారు. సరస్వతి, కోటిలింగాల, పుష్కరఘాట్‌లలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమీక్షలు నిర్వహించనున్నారు.
 
పోలీసులకు మరిన్ని వాకీటాకీలు
సాక్షి, రాజమండ్రి: రాజమండ్రి పుష్కరఘాట్ ఘటన నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలీసుల మధ్య మరింత సమన్వయం కోసం మరిన్ని వాకీటాకీలు మంజూరు చేసిం ది. వీటిని రాజమండ్రిలోని 18 ఘాట్లకు కేటాయించారు. ముఖ్యంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే పుష్కరఘాట్‌కు ఎనిమిదింటిని కేటాయించారు. మంగళవారం నాటి దుర్ఘటన తర్వాత ఈ ఘాట్‌వద్ద పోలీసు బందోబస్తును పెంచారు. 11 మంది ఐపీఎస్‌లు ప్రస్తుతం ఇక్కడ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement