సీఎం జగన్‌తో జర్మన్‌ కాన్సుల్‌ జనరల్‌ కెరిస్‌స్టాల్‌ భేటీ

German Consulate Chennai Christina Maria Meets CM YS Jagan - Sakshi

ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన సీఎం జగన్‌కు అభినందనలు

నవరత్నాలు, సంక్షేమ పథకాలు గురించి అడిగి తెలుసుకున్న కెరిస్‌

ఏపీలో పెట్టుబడులకు సానుకూలం: జర్మన్‌ కాన్సుల్‌ జనరల్‌ కెరిస్‌

త్వరలో ఇండో-జర్మన్‌ బిజినెస్‌ కౌన్సిల్‌తో సమావేశానికి సిద్ధం

సాక్షి, తాడేపల్లి : భారత్‌,జర్మనీల మధ్య సన్నిహిత సంబంధాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతోనూ తమ దేశానికి సత్సంబంధాలున్నాయని జర్మనీ కాన్సుల్‌ జనరల్‌  కెరిన్‌ స్టాల్‌ అన్నారు. సోమవారం ఆమె తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన సీఎం వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలిపారు. 

నవరత్నాలు, వివిధ సంక్షేమపథకాలతోపాటు అవినీతి రహిత, పారదర్శక విధానాలకోసం పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలను సీఎం జగన్‌ వివరించారు. గడిచిన 9 నెలలుగా రాష్ట్రంలో సీఎం జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కెరిన్‌ అభినందించారు. భారత్‌ జర్మనీల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలతో పాటు, సుదీర్ఘ కాలంగా జర్మనీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉన్న బంధాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఇండో జర్మన్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ ఆసక్తిగా ఉందని ఆమె తెలిపారు. ఏపీలో పెట్టబడులు పెట్టేందుకు తమ కంపెనీలను ప్రోత్సహిస్తామన్నారు. వీలైనంత త్వరగా ఈ సమావేశం పెట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. 

అతిపెద్ద పవన్‌ విద్యుత్‌ మేన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ సీమెన్స్‌ – గమేసాతో పాటు జర్మనీ సహకారంతో నడుస్తున్న పలు విండ్‌ పవర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీల గురించి కెరిన్‌ ప్రస్తావించారు.మరోవైపు జీరోబడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ ప్రమోట్‌ చేసే చర్యల్లో భాగంగా ది జర్మన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు(కేఎఫ్‌డబ్ల్యూ)– ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని కెరిన్‌ అన్నారు. జర్మన్‌ సహకారంతో ప్రస్తుతం నడుస్తున్న  ప్రాజెక్టులను వివరించారు. ఆంధ్రప్రదేశ్, జర్మనీల మధ్య  ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించేందుకు, సాంస్కృతిక మార్పిడి మరియు పర్యాటక రంగాన్ని ప్రమోట్‌ చేసేందుకు తమవంతు కృషిచేస్తామని ఆమె అన్నారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయదలచిన 10 వేల మెగావాట్‌ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టు ద్వారా... సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం మహిళా సాధికారితలకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను సీఎం జగన్‌ జర్మన్‌ కాన్సుల్‌ జనరల్‌కు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్‌ దృష్ట్యా పనిసామర్ధ్యాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతను సీఎం ప్రస్తావించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యావ్యవస్ధను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. 

రాష్ట్రంలో 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్స్‌తో పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రస్తావించారు. మరోవైపు పాలిటెక్నిక్, బీటెక్‌లలో పాఠ్యప్రణాళికను మార్పు చేస్తున్నామని, కొత్తగా అప్రెంటిస్‌షిప్‌ విధానం తెచ్చామన్నారు. ఈ సమావేశంలో సయాంట్‌ ఎక్స్‌క్యూటివ్‌ ఛైర్మన్‌ బి.వి.ఆర్‌. మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top