ఫార్మా కంపెనీలో గ్యాస్‌ లీకేజీ

Gas leakage in pharma company - Sakshi

విశాఖ పరవాడలో దుర్ఘటన

విషవాయువు పీల్చిన ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మృత్యువాత

అపస్మారక స్థితికి నలుగురు.. ఆస్పతికి తరలింపు

తక్షణం కంపెనీ మూసివేత.. విచారణకు నలుగురితో కమిటీ

ప్రమాదంపై సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేయాలని ఆదేశం

సాక్షి ప్రతినిధి విశాఖపట్నం/సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సోమవారం అర్ధరాత్రి ఓ రియాక్టర్‌ నుంచి హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ విషవాయువు లీకైంది. విషవాయువును పీల్చిన ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు కోలుకోగా.. ఒకరికి వెంటిలేటర్‌పై చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద విషయం తెలియగానే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కంపెనీని షట్‌డౌన్‌ చేయించారు. ప్రమాద ప్రభావం ఫ్యాక్టరీలో ఒక రియాక్టర్‌ ఉన్న విభాగానికి మాత్రమే పరిమితమవ్వడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
ఘటనా స్థలాన్ని సందర్శించిన కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌.(ఇన్‌సెట్‌) ప్రమాదంలో మృతి చెందిన నరేంద్ర (ఫైల్‌) 

ప్రమాదం జరిగిందిలా.. 
విశాఖకు 42 కి.మీ. దూరంలో ఉన్న పరవాడ ఫార్మాసిటీలో 60 వరకు కెమికల్‌ కంపెనీలున్నాయి. ఫార్మాసిటీ రోడ్‌ నంబర్‌–3లోని 59 ప్లాట్‌లో ఉన్న సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలో రబీప్రజాల్‌ సోడియం, డోమ్‌పారిడోన్, ఓమోప్రజోల్‌ మొదలైన డ్రగ్స్‌ ఉత్పత్తుల తయారీ జరుగుతోంది. కంపెనీలో 137 మంది సిబ్బంది, కార్మికులు పనిచేస్తుండగా.. సోమవారం రాత్రి షిఫ్ట్‌లో 26 మంది ఉన్నారు. రాత్రి 11 గంటలకు షిఫ్ట్‌ ఇన్‌చార్జి రావి నరేంద్ర (33), కెమిస్ట్‌ మహంతి గౌరీశంకర్‌(26), హెల్పర్లు ఆనంద్‌బాబు, డి.జానకిరామ్, ఎం.సూర్యనారాయణ, ఎల్‌వీ చంద్రశేఖర్‌ కలసి ప్రొడక్షన్‌ బ్లాక్‌లోకి వెళ్లారు. 11.25 గంటలకు ఓమోప్రజోల్‌ అనే డ్రగ్‌కు సంబంధించిన బల్క్‌ రసాయనానికి చెందిన మదర్‌ లిక్కర్‌ను ఒక రియాక్టర్‌ నుంచి మరో రియాక్టర్‌కు పంపించడం ప్రారంభించారు.

స్టేజ్‌–3 వద్ద సెంటర్‌ ఫేజ్‌ క్యాచ్‌ పాయింట్‌లోని వ్యర్థ రసాయనాన్ని మరో రియాక్టర్‌లోకి పంపించే క్రమంలో ఎస్‌ఎస్‌ఆర్‌–107 రియాక్టర్‌లో ఉన్న పాత కెమికల్‌తో కలిసి రసాయనిక చర్య వికటించింది. ప్రమాదకరమైన హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువు వెలువడింది. షిఫ్ట్‌ ఇన్‌చార్జ్‌ నరేంద్ర, కెమిస్ట్‌ గౌరీశంకర్‌ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కానీ అదుపు చెయ్యలేకపోయారు. ఈలోగా విషవాయువు పీల్చడంతో కుప్పకూలిపోయారు. కాస్త దూరంలో ఉన్న నలుగురు హెల్పర్లు వెంటనే వీరి వద్దకొచ్చారు. వారు సైతం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. వెంటనే అప్రమత్తమైన ఇతర సిబ్బంది యూనిట్‌ను షట్‌డౌన్‌ చేశారు. బాధితులను రాంకీ సంస్థకు చెందిన అంబులెన్స్‌లో గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నరేంద్ర, గౌరీశంకర్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో.. మృతదేహాల్ని కేజీహెచ్‌కి తరలించారు. ఆనంద్‌బాబు, జానకిరామ్, సూర్యనారాయణల ఆరోగ్యం నిలకడగా ఉంది. చంద్రశేఖర్‌(37) పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విశాఖ కేర్‌ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించండి: సీఎం ఆదేశం
ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై సీఎంవో అధికారులను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. రియాక్టర్‌ వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్‌డౌన్‌ చేయించారని, ప్రమాదం ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్‌ ఉన్న విభాగానికి పరిమితమని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని నివేదించారు.

పెళ్లయిన రెండు నెలలకే..
ప్రమాదంలో మృత్యువాత పడిన మహంతి గౌరీశంకర్‌(26)కు రెండు నెలల కిందటే వివాహం జరిగింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన ఈ యువకుడు మూడేళ్లుగా సాయినార్‌లో కెమిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్‌లో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని సంచాం గ్రామ యువతితో వివాహమైంది. కరోనా వల్ల సమీప బంధువుల సమక్షంలో సాదాసీదాగా పెళ్లి జరిగింది. లాక్‌డౌన్‌ తరువాత ఘనంగా రిసెప్షన్‌ చేయాలనుకున్నారు. అంతలోనే మృత్యువాతపడ్డాడు.
► మరో మృతుడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నరేంద్ర(33) ఏడాది కిందటే హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చి ‘సాయినార్‌’లో షిఫ్ట్‌ ఇన్‌చార్జిగా చేరాడు. భార్య, కుమార్తె తెనాలిలో ఉంటున్నారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. 

తక్షణం స్పందించిన అధికార యంత్రాంగం 
ప్రమాద ఘటనపై అధికార యంత్రాంగం తక్షణం స్పందించింది. పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా హుటాహుటిన ఫార్మా కంపెనీకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్‌ వినయ్‌చంద్‌.. అధికారులను ఘటనాస్థలికి పంపించారు. అనంతరం ఘటనాస్థలికి వెళ్లిన కలెక్టర్‌ ప్రమాదం జరిగిన తీరుపై ప్రభుత్వానికి నివేదించారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగ్రాతులను పరామర్శించారు.  

► గ్యాస్‌ ప్రభావం పరిసర కంపెనీలు, సమీప జనావాసాలపై ఎంతమేరకు ఉంటుందనే విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఫోరెన్సిక్‌ విభాగ సిబ్బంది పరిశీలించారు. కంపెనీ నుంచి బయటకు గ్యాస్‌ లీకేజీ కాలేదని నిర్ధారించారు.
► గ్యాస్‌ లీకేజీ ఘటనకు కారణాలను అధ్యయనం చేయడానికి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ ఎ.రామలింగేశ్వరరాజు, తదితరులతో కూడిన నలుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాత్రి షిఫ్ట్‌లో సిబ్బంది తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సమాచారం.
► ఫ్యాక్టరీలోని ఒక యూనిట్‌కు పరిమితమని, దీనివల్ల చుట్టుపక్కల ఉన్న కంపెనీలకు ఎలాంటి ముప్పు లేదని తేలడంతో ఆ చుట్టూ ఉన్న 12 ఫార్మా కంపెనీలు తమ యూనిట్లను యధావిధిగా నిర్వహించాయి.
► మంత్రి అవంతి శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ వేర్వేరుగా ఘటనా స్థలిని సందర్శించి.. ప్రమాదంపై ఆరా తీశారు. అనంతరం.. అస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top