తొమ్మిది నెలల వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు నిర్లక్ష్యంతో అడుక్కునే పరిస్థితి వచ్చింది.
అనంతపురం: 'తొమ్మిది నెలల వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు నిర్లక్ష్యంతో అడుక్కునే పరిస్థితి వచ్చింది' అంటూ గ్యార్బేజ్ కార్మికులు పెద్దన్న, ఎర్రిస్వామి, ఓబులేసు, రాజు, రామకృష్ణ అన్నారు. పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నగరపాలక సంస్థలో బిక్షాటన చేశారు. ప్రతి అధికారి వద్దకు వెళ్లి బిక్షం అడిగారు. కడుపులు కాలిపోతున్నాయని, ఆర్థిక పరిస్థితి దుర్భరంగా తయారైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా తొమ్మిది నెలలు వేతనాలు మరుగున పెట్టారంటూ వాపోయారు. రిలే దీక్షలు చేపట్టి పదహారు రోజులు గడుస్తున్నా.. ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
అపకీర్తి తేవద్దండి
కార్మికుల వేతనాలు రాకపోవడం చాలా బాధగా ఉందని డిప్యూటీ మేయర్ గంపన్న అన్నారు. బుధవారం తన చాంబర్‌లో బిక్షాటనకు వచ్చిన కార్మికులతో మాట్లాడారు. అంతకుముందు రిలే దీక్షలకు వెళ్లి మద్దతు తెలిపారు. బిక్షాటన చేసి అపకీర్తి తేవద్దని హితవు పలికారు. పాలకవర్గంతో చర్చించి కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వీలైతే టెంటు వేసుకుని దీక్ష చేస్తామంటూ హామీ ఇచ్చారు. గ్యార్బేజ్ కార్మికులకు మద్దతు తెల్పిన వారిలో కార్పొరేటర్లు బంగి సుదర్శన్, సరిపూటి రమణ, హేమలత, లోక, రహమత్ బీ, తదితరులున్నారు.