ఈఎస్‌ఐ కుంభకోణానికి ఆయనే ‘డైరెక్టర్‌’?

Gadi Vijay Kumar Plan And Main Direction in ESI Scam East Godavari - Sakshi

ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ మాజీ డైరెక్టర్‌ విజయకుమార్‌పై ఆరోపణలు

సొంత స్కానింగ్‌ సెంటర్‌కు లబ్ధి చేకూర్చారని అప్పట్లో గుసగుసలు

అవసరానికి మించి అక్కర లేని మందులు కోనుగోలు చేసినట్టు నిర్ధారణ

రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు సిఫారసు చేసిన వైనం

అవినీతి వ్యవహారంపై సహోద్యోగులతో విభేదాలు

రాజమహేంద్రవరం క్రైం : ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ గాడి విజయకుమార్‌ను ఏసీబీ అధికారులు అవినీతి ఆరోపణలపై అరెస్ట్‌ చేశారు. విజయవాడకు చెందిన ఏసీబీ సెంట్రల్‌ ఇన్విస్టిగేషన్‌ యూనిట్‌ శుక్రవారం రాజమహేంద్రవరం చేరుకొని విజయకుమార్‌ను ఆయన స్వగృహంలో అరెస్ట్‌ చేశారు. ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సరఫరా చేసే మందులు, పరికరాల భారీ కుంభకోణం ఈయన డైరెక్టర్‌గా ఉన్నప్పుడే జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తగా.. ఏసీబీ అధికారుల దర్యాప్తులో నిర్ధారణ కావడంతో విజయకుమార్‌ను అరెస్ట్‌ చేశారు. కాకినాడకు చెందిన విజయకుమార్‌ రాజమహేంద్రవరం ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో రేడియాలజిస్ట్‌గా విధులలో చేరారు. ఇక్కడే ఎక్కువ కాలం విధులు నిర్వహించి ఈఎస్‌ఐ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విజయవాడలో ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌ ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మందులు, పరికరాల కొనుగోళ్లలో కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణలో పలు విషయాలు వెలుగు చూడడంతో విజయకుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.(అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్‌)

రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించడంతో లబ్ధి  
విజయకుమార్‌ రాజమహేంద్రవరం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో వివిధ హోదాలలో పనిచేశారు. రాజమహేంద్రవరంలోని కంబాలచెరువు వద్ద అపోలో స్కానింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తూ ఈఎస్‌ఐ ఆసుపత్రికి వచ్చే రోగులను తన స్వంత స్కానింగ్‌ సెంటర్‌కు తరలించి లబ్ధి పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎక్కువ సమయం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఉండకుండా స్కానింగ్‌ సెంటర్‌లో ఉండడంతో అప్పట్లో సహోద్యోగులతో విభేదాలు వచ్చాయని వినికిడి.

జిల్లాలో ఒక ఈఎస్‌ఐ ఆసుపత్రి, ఎనిమిది ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ఉండగా, చికిత్స కోసం వచ్చే రోగులను 14 ప్రైవేటు క్లీనిక్‌లకు, 11 ప్రైవేటు ప్యానల్‌ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం  తరలించి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. రోగులకు ఇచ్చే మందులు, మెడకు వేసే నెక్‌ కాలర్, ఎముకలు విరిగిన సమయంలో కట్లు వేసేందుకు ఉపయోగించే పరికరాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈయన ఈఎస్‌ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో కుంభకోణాలు వ్యతిరేకించే వారు ఒక వర్గంగాను, సమర్ధించేవారు మరో వర్గంగా విభేదాలు వచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top